న్యూఢల్లీి,డిసెంబర్ 10 జనంసాక్షి: జనరల్ బిపిన్ రావత్ దంపతులతోపాటు హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ లఖ్విందర్సింగ్ లిద్దర్ కుమార్తె ఆస్నా లిద్దర్.. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన తండ్రితో తనకుగల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి హీరో అని, తనకు మంచి స్నేహితు డని చెప్పారు. నా తండ్రి హీరో, నాకు మంచి స్నేహితుడు. ఆయన నాకు గొప్ప మార్గదర్శకుడు. ఇప్పుడు ఆయన మా నుంచి దూరం కావడం దైవ సంకల్పం కావచ్చు. మాకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా అని ఆస్నా లిద్దర్ వ్యాఖ్యానించారు. తనకు ఇప్పుడు 17 సంవత్సరాలు అని, తనకు తన తండ్రితో 17 ఏండ్ల అనుబంధం ఉన్నదని చెప్పారు. తమ తండ్రితో ఉన్న తీపి జ్ఞాపకాలతో తాము ముందుకు సాగుతామన్నారు. అదేవిధంగా లిద్దర్ భార్య గీతికా లిద్దర్ కూడా తన భర్తతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తమకు తీరని లోటని చెప్పారు. తానొక సైనికుడి భార్యనని, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికామని తెలిపారు. ఆయనను నవ్వుతూ సాగనంపామన్నారు. ఈ మాటలు చెబుతూ ఆమె ఉబికివస్తున్న దుఃఖాన్ని పంటిబిగువున అణిచిపెట్టడం కనిపించింది.
నా తండ్రి హీరో, నాకు మంచి స్నేహితుడులిద్దర్ కుమార్తె ఆస్నా లిద్దర్