2023 ఆరంభంలో భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ

 



దిల్లీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): భారత ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్‌ కరెన్సీ 2023 ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వ్యాలెట్ల తరహాలోనే అది కూడా పనిచేస్తుందని పేర్కొన్నాయి. అయితే, దీనికి ప్రభుత్వ హావిూ ఉంటుందని స్పష్టం చేశాయి.రిజర్వు బ్యాంకు మద్దతుతో ‘డిజిటల్‌ రూపీ’ని ప్రవేశపెట్టనున్నట్లు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పేపర్‌ కరెన్సీ తరహాలోనే డిజిటల్‌ కరెన్సీకి కూడా ఆర్‌బీఐ ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదుతో పోలిస్తే డిజటల్‌ కరెన్సీ అంత భిన్నంగా ఏవిూ ఉండదని పేర్కొన్నాయి. డిజిటల్‌ కరెన్సీని సాధారణ కరెన్సీకి డిజిటల్‌ రూపంగా భావించొచ్చని తెలిపాయి. ఒకరకంగా చెప్పాలంటే డిజిటల్‌ కరెన్సీ అంటే ప్రభుత్వ భరోసా ఉన్న ఒక ఎలక్ట్రానిక్‌ వ్యాలెట్‌ మాత్రమేనని వివరించాయి.వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి డిజిటల్‌ కరెన్సీ వినియోగానికి సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. రిజర్వ్‌ బ్యాంకు అభివృద్ధి చేస్తున్న డిజిటల్‌ రూపీ బ్లాక్‌చైన్‌ సాంకేతికత ద్వారా అన్ని లావాదేవీలను ట్రాక్‌ చేయొచ్చని పేర్కొన్నాయి. చేతిలో నోట్లకు బదులు ఫోన్‌లో డిజిటల్‌ కరెన్సీ ఉంటుందని వివరించాయి. దాన్ని ఎలాంటి లావాదేవీలకైనా వినియోగించుకోవచ్చని.. వాటన్నింటికీ ప్రభుత్వ హావిూ ఉంటుందని స్పష్టం చేశాయి. జేబులో ఉండే పర్సులో డబ్బులు పెట్టుకోవడానికి బదులు ఫోన్‌ వ్యాలెట్‌లో డబ్బులు ఉంటాయని వివరించాయి.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన సొంత డిజిటల్‌ కరెన్సీని సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ) పేరుతో ప్రవేశపెట్టబోతోందని 2022`23 బడ్జెట్‌ ద్వారా కేంద్రం స్పష్టతనిచ్చింది. ‘బ్లాక్‌చైన్‌’ ఆధారిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిట్‌కాయిన్‌, ఎథేరియం వంటి క్రిప్టో ఆస్తులకు, భారత రిజర్వు బ్యాంకు ఆవిష్కరించే సీబీడీసీకి మధ్య తేడా ఉంటుంది. బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టో కాయిన్లు/ కరెన్సీ పూర్తిగా ప్రైవేటు కాయిన్లు. నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు కూడా అంతే. కానీ సీబీడీసీ మాత్రం ప్రభుత్వ మద్దతు గల వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీ. దీన్ని ఆర్‌బీఐ పంపిణీ చేస్తుంది. అంటే దీనికి ప్రభుత్వ అనుమతితో పాటు పర్యవేక్షణ ఉంటుంది.