ఈత సరదాకు ముగ్గురు బాలురు బలి
ఒంగోలు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకున్నది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు శవాలై తేలారు. ఆదివారం నుంచి ఈ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. పొందూరు సవిూపంలోని పొడవారిపాలెం వద్ద మూసీ వాగులో 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశారు. వాసు (15), జగన్ (12), మహేశ్ (13) లు నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాలెం సవిూపంలోని ముసీ వాగు దగ్గరకు వెళ్లారు. అనంతరం ఈత కొట్టేందుకు వీరు వాగులోకి దిగారు. సవిూపంలోని కొందరు రైతులు నీటిలోకి దిగొద్దని వీరిని వారించారు. అయినప్పటికీ వినకుండా సరదా ఈత కొట్టేందుకు దిగారు.
చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. మరికొందరు స్థానికులతో కలిసి వెతకడం ప్రారంభించారు. బాలురు మూసీ వాగు వైపు వెళ్లారని తెలుసుకుని వారంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటిగా ఉన్నందున గాలింపు నిలిపివేశారు. సోమవారం ఉదయం రెస్క్యూ వర్కర్లు తిరిగి వెతగ్గా.. తప్పిపోయిన ముగ్గురు బాలుర మృతదేహాలు లభించాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.