తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం

 



` త్యాగాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రం
` ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిరది
` మోనార్క్‌లా దేశాన్ని ఏలాలనుకుంటున్న మోడీ
` ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రధాని
` మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):ప్రధాని మోదీకి తెలంగాణ అభివృద్ధిపై ఈర్ష్య, ద్వేషం, అసూయ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసనగా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి, అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగనపడేసి.. దేశాన్ని మోనార్క్‌లా ఏలాలని మోదీ అనుకుంటున్నాడని విమర్శించారు. దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాక అనివార్య పరిస్థితుల్లో అందరికన్నా ఆఖరుకు సమ్మతించి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజా పోరాటానికి తలొగ్గి విధిలేక 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ ఇవ్వదనుకొని.. బీజేపీ తర్వాత ఎలాగైనా దాటవేయొ చ్చని.. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్నారు. కానీ తెలంగాణ ప్రజల అదృష్టం, కేసీఆర్‌ నాయకత్వంలో పెరిగిన ఒత్తిడి, ఆమరణ నిరాహార దీక్ష, వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు.. అన్నీ వెరసి తెలంగాణ సమాజం గిరిగీసి నిలబడడంతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే రాజకీయ భవిష్యత్‌ ఉండదనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారన్నారు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని రకాలుగా చర్చలు జరిగాయన్నారు. పార్లమెంట్‌లో, అఖిలపక్షాల భేటీలో, జేఏసీలో, శ్రీకృష్ణ కమిటీ పర్యటనలో చర్చలు జరిగాయని, ఇవన్నీ అయ్యాక పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పాసైందని గుర్తు చేశారు. ఇవన్నీ జరిగాక వచ్చిన బిల్లును మోదీ అవమానించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. తెలంగాణ ఏర్పాటై ఎనిమిళ్లయి అద్భుతంగా అభివృద్ధిలో పురోగమిస్తున్నామని, దేశంలో అనేక రంగాల్లో కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకిందన్నారు. మోదీ రాచరికపు, ఆలోచనా విధానానికి గండి కొట్టే సాహసం చేస్తున్నదని ఒక్క కేసీఆర్‌ అని, అందుకే తెలంగాణ విూద కసిబూని మాట్లాడుతూ పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారని, దాన్ని మరిచిన పాలకులు ప్రజల పాదాల కింద ధూళిలో కలిసిపోతారన్నారు.ఇదిలా ఉండగా అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడామని.... ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే లక్షలాది మందితో ఢల్లీిలో ధర్నా చేస్తామన్నారు. 1200 మంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోం అన్నారు. మొన్న హైదరాబాద్‌ వచ్చినప్పుడు మోదీకి ఇక్కడి అభివృద్ధి కనిపించలేదా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా అభివృద్ధిలో ముందుంది అని మంత్రి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రాష్టాన్న్రి ప్రోత్సహించాల్సిందిపోయి తెలంగాణ విూద విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంత సీఎం కేసీఆర్‌ వెంట ఉంది కాబట్టే చూసి ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు.కాగా మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎర్రబెల్లిరాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయట పడిరదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌ రావు ఫైర్‌ అయ్యారు.తెలంగాణ పై కక్షసాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం హన్మకొండలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి విూడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఉన్నంతకాలం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు. బీజేపీ నాయకులను గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన పై ప్రధాని వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఖండిస్తుందన్నారు. వారి వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ దీక్ష, అనేకమంది ఆత్మబలిదానాలతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన హావిూలు ఇంకా నెరవేరలేదు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను సరిగా అమలు చేయడంలేదు. కొన్ని సవరణలు చేయాలని కేసీఆర్‌ కోరారు. దొంగ బీజేపీ నాయకులు అంబేద్కర్‌ ను విమర్శించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులను ఉరికిచ్చి కొడుతామని హెచ్చరించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ..ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్నాం.బీజేపీ నాయకులకు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలన్నారు.ఇదిలావుంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్వయంగా బైక్‌ ర్యాలీలలో పాల్గొన్నారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ పై దాడికి బీజేపీ కుట్ర చేస్తున్నదన్నారు. ప్రధాని నిన్న రాజ్యసభలో తెలంగాణ విభజనపై విషం కక్కారని చెప్పారు. తెలంగాణను కానీ, కేసీఆర్‌ను కానీ ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ బిడ్డలు చాలా చైతన్య వంతులన్న విషయం గుర్తు చేశారు. రాజ్యాంగ బద్ధంగా విభజన జరిగిందని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినా, కించపరిచినా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, కించపరచడమేనని మంత్రి అన్నారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకుందన్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాయి. అయినప్పటికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులు పాస్‌ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ? అని నిలదీశారు. పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా..? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోదీ? రైతు వర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకించినా విూరు వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా..? అని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్‌ చేసిన పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా..? ఇదెక్కడి న్యాయం మోదీ జీ..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.