కేంద్రం తీరు దారుణంగా ఉంది
మండిపడ్డ ఎమ్మెల్యే హరిప్రియనాయక్
ఖమ్మం,ఫిబ్రవరి23 (జనం సాక్షి): బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో బయ్యారం ఉక్కు ఫ్యార్టరీ ఉద్యమం మళ్లీ రాజుకుంటోంది. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం నిప్పుకణికలై నినదిస్తున్న ఈ ప్రాంత ప్రజానీకం మరో పోరుకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నేతృత్వంలో ఉక్కు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని, ఉక్కు కర్మాగారం వస్తే రాష్టాన్రికి లబ్ది చేకూరుతుందని, ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని అనుకున్నామన్నారు. నిన్న కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని చెప్పి.. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారన్నారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే హరిప్రియ మరోసారి స్పష్టం చేశారు. ఈ దీక్షకు ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఫీుభావం తెలిపారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదించారు. మాజీ ఎంపి ప్రొఫెసర్ సీతరాం నాయక్, ఎంపి కవిత తదితరులు హాజరయ్యారు.
కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డిపై మహబూబాబాద్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో చేపట్టిన ఉక్కు దీక్షలో ఎంపీ మాట్లాడారు. తాము చేతగాని దద్దమ్మలం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారన్నారు. బయ్యారం ఉక్కును తుక్కుతో పోల్చారని ఆమె ఆరోపించారు. ’ మిమ్మల్నే తుక్కు తుక్కుగా కొడతాం కొడకా’ అని కిషన్ రెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంత హక్కుల కోసం ప్రాణాలైనా తెగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు