దళిత సెల్ సదస్సులో వర్ల రామయ్య విమర్శలు
విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. దళితులపై జరిగిన దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. వారిని ఏదో కేసులో పెట్టి వేధించిన ఘటనలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు. టీడీపీ దళిత సెల్ ఆధ్వర్యంలో నగరంలో దళిత ప్రతిఘటన సదస్సు జరిగింది. సదససులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నిస్తే శిరోముండనం చేయించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపింది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. అత్యాచారాలకు గురైన దళిత యువతులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు. నిందితులకు కొమ్ము కాసేలా అధికార పార్టీనేతల తీరు ఉందని ఆయన ఆరోపించారు. ఈ సదస్సులో పార్టీ నేతలు యం.యస్.రాజు, నెట్టెం రఘురాం, దేవినేని ఉమ, తదితరులు హాజరయ్యారు.