\
మేడారంలో వెల్లివిరిసన సాంస్కృతిక చైతన్యంప్రజలు తండోపతండాలుగా రాక
మొక్కులు తీర్చుకుని వేడుకుని తిరుగగుపయనం
ములుగు, ఫిబ్రవరి 18 ( జనం సాక్షి): రెండేళ్లకోమారు జరగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మరోమారు తన ఘనతను చాటుకుంది. మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ఉత్తరాదిలో జరిగే కుంభమేళాకు తీసిపోని విధంగా ప్రజలు దీనిని ఆరాధిస్తున్నారని ప్రపంచానికి తెలియచేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనులు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే మేడారంనకు ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పనక్కరలేదు. అందుకే ఇక దీనిని ప్రపంచం అబ్బురపడేలా అభివృద్ది చేస్తామని, సిఎం కెసిఆర్ ప్రకటించారు. మరో రెండేళ్లకు వచ్చే జాతర నాటికి దీనిని అమలు చేస్తే తెలంగాణ జనజాతరకు ప్రపంచ గుర్తింపు దక్కడం ఖాయం. వచ్చే జాతర నాటికి మేడారం ఉత్సవానికి జాతీయ హోదా రావాలని సిఎం కూడా కోరుకుంటున్నారు. అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచే కృషి చేయాల్సి ఉంది. ప్రజల్లో ఎంతో భక్తి విశ్వాసం ఉంటే తప్ప ఈ జాతరకు ఇంతటి ఆదరణ దక్కదు. లక్షలాదిగా ప్రజలు నాలుగు రోజలుగా తరలివచ్చిన తీరే ఇందుకు నిదర్శనం. అన్నింటికి మించి ప్రభుత్వం ఇక్కడ చేసిన ఏర్పాట్లు అమోఘం. ముఖ్యంగా మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి, ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నీ తామై అధికారులను నడిపించిన తీరుతో జాతరలో ఎక్కడా చిన్న పొరపాటు జరగలేదు. అధికార యంత్రాంగం
కూడా అహోరాత్రాలు కష్టించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయగలిగింది. ఎంతపెద్ద జాతరైనా ఘనంగా నిర్వహించగలమని ప్రభుత్వం నిరూపించింది. అందుకే లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనం అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మొక్కులు, పూజలతో మేడారం ఆధ్యాత్మిక వనమైంది. ఇక్కడి రావడం ఎంతో గర్వంగా ఉందని అత్యధికమంది ఆనందపారవశ్యం చెందారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేమంటున్నారు. చిన్నపాటి కుగ్రామంలో లక్షలాది మందికి అధికారులు సకల ఏర్పాట్లు చేయడమంటే ఒక సవాలే అయినా దానిని సక్రమంగా చేపట్టిన తీరు అభినందించకుండా ఉండలేం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక సౌకర్యాలు అనుకున్న స్థాయిలో లేకున్నా ఎక్కడా ఇబ్బందులు రాకుండా అధికారులు తమ ప్రతిభను, చిత్తశుద్దిని చాటుకున్నారు. అధికారులు కూడా అంకితభావంతో పని చేశారు. సిఎం కెసిఆర్ కూడా ఈ జాతర విషయంలో ముందు నుంచీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లకు పురమాయించారు. సమైక్య రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతరకు దక్కాల్సిన ప్రాముఖ్యం దక్కకుండా పోయిందని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ఘన వారసత్వాన్ని అందించిన మహాతల్లుల జాతర ఏర్పాట్లకోసం ఈసారి దాదాపు రూ.75 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. మేడారం సమ్మక్క`సారక్కలు తెలంగాణ ఆత్మగౌరవానికి, ధిక్కార సంస్కృతికి ప్రతీకలని అన్నారు. గిరిజనులు తమ ఆరాధ్యదైవాలను కొలిచే జాతర. నియంతృత్వ ధిక్కారానికి, పోరాట పటిమకు నిలువెత్తు ప్రతిరూపం. భవిష్యత్‌లో ఈ మహాజాతర ఘనంగా నిర్వహించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. మేడారం వచ్చే భక్తులకు శాశ్వత ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఏటా జంపన్న వాగులో నీరు లేకపోవడం వల్ల లక్నవరం చెరువు నుంచి నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. భక్తులు అత్యంత పవిత్రంగా జంపన్నవాగులో స్నానమాచరిస్తారు. ఆ వాగు కలుషితం కాకుండా చూడాల్సి ఉంది. ఇందుకోసం వాగు ఎగువన చిన్నసైజ్ డ్యామ్ నిర్మిస్తామన్న హావిూని నెరవేర్చాల్సి ఉంది. మేడారం మహాజాతర నిజానికి ప్రతీ రెండేండ్లకోసారి జరుగుతుంది. కానీ భక్తులు జాతర జరిగే సమయం లోనే కాదు.. నిరంతరాయంగా వచ్చి తల్లుల దీవెనలు పొందుతున్నారు. ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా గిరిజన సమాజమే కాదు మిగితా సమాజం తండోపతండాలుగా వచ్చి వెళ్తుంటారు. అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేస్తే భక్తులకు ఇబ్బందులు రావు. శనివారం సాయంత్రం తల్లీబిడ్డలు సమ్మక్క, సారక్క వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగియనున్నది. మేడారంలో నాలుగురోజులు జరిగే సమ్మక్క సారక్క మహాజాతర బుధవారం ప్రారంభమైంది. పూజారులు బుధవారం కన్నెపల్లి నుంచి బిడ్డ సారక్క, గురువారం చిలుకలగుట్ట నుంచి తల్లి సమ్మక్కను మేడారంలో గద్దెలపైకి తీసుకొచ్చారు. రెండురోజుల ముందునుంచే మేడారంలో విడిదిచేసిన భక్తులు.. తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరిన సమయంలో దర్శించుకున్నారు. సమ్మక్క సారక్క దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఈ నాలుగు రోజులు వనం జనసాగరాన్ని తలపించింది. మేడారంలో గద్దెలపై కొలువుదీరిన వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాదిమంది తరలివచ్చారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జనసంద్రమైంది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణనుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. క్యూలైన్లు, గద్దెల ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జంపన్నవాగు పుణ్యస్నానాలతో పులకించిపోయింది. వనదేవతలకు ఎత్తుబంగారం, ఒడిబియ్యంతో మొక్కులు సమర్పించి తల్లీ సల్లంగ సూడు.. రెండేళ్లకోసారి వస్తాంఅంటూ తిరుగు ప్రయాణ మయ్యారు.