సంగగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతలకు కెసిఆర్‌ శంకుస్థాపన


3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా పథకం

 కెసిఆర్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం

బహిరంగ సభలో ప్రస్తుతించిన మంత్రి హరీష్‌ రావు

సంగారెడ్డి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నారాయణ ఖేడ్‌ చేరుకున్న అనంతరం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.84 లక్షల వ్యవసాయ భూములకు సాగు నీరు అందనున్నది. లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులకు కావాల్సిన సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డీపీఆర్‌ ఆధారంగా జిల్లా నీటిపారుదల శాఖ అంచనాలు తయారు చేసి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ సైతం పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగూరు ప్రాజెక్ట్‌ నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాల్వలు, పంప్‌ హౌస్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం భూ సేకరణ కొనసాగుతోంది.సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సింగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 3.84 లక్షల ఎకరాలకు నీరు అందనున్నది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 57వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 1.06 లక్షల ఎకరాలు, అంధోల్‌లో 56వేల ఎకరాలు, నారాయణఖేడ్‌ సెగ్మెంట్‌ పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు రెండు లిఫ్టుల ద్వారా సాగు నీరు అందనున్నది. కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా 4 నియోజకవర్గాలకు నీరందించే పనులు జరగనున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం రూ.4,427కోట్లు ఖర్చు చేయనున్నది. నారాయణఖేడ్‌ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ వద్ద బసవేశ్వర ఎత్తిపోతలు.. అంధోల్‌ నియోజకవర్గ పరిధిలోని రాయికోడ్‌ మండలం ఐదులాపూర్‌ వద్ద సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. వీటి ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్‌, అంధోల్‌ నియోజకవర్గాల్లోని 12 మండలాల్లోని 231 గ్రామాలకు సాగునీరందనుంది. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్‌, అందోల్‌?నియోజకవర్గాల్లో  ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 166 గ్రామాలకు నీరందనున్నది. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి హరీస్‌ రావు మాట్లాడుతూ.. పురాణాల్లో రాముడు కాలు పెడితే రాయి అహల్య అయిందని.. నేడు సీఎం కేసీఆర్‌ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం సన్యశ్యామలం అవుతోందని  కొనియాడారు. సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ మన గురించి ఆలోచించలేదు. ఈరోజు మిషన్‌ భగీరథ నీళ్లు ఇంటింటికీ వస్తున్నాయి. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ వచ్చింది. రోడ్లు వచ్చాయి. సాగునీరు కూడా ఇప్పుడు రాబోతోంది. మన గురించి సీఎం కేసీఆర్‌ ఆలోచించి.. 4000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలను సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. మంజీరాలో వరద వస్తే ఆనీళ్లు వెళ్లి గోదావరిలో కలవడం మనకు తెలుసు. కానీ.. మన సీఎం గోదావరి నీళ్లను వెనక్కి మళ్లించి.. మంజీరాలో కలిపే అద్భుత కార్యక్రమాన్ని కల్పిస్తున్నారు. ఎక్కడో 90 విూటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌కు, మల్లన్న సాగర్‌ నుంచి సింగూర్‌కు, సింగూర్‌ నుంచి జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌కు అందించబోతున్నారు.. అని హరీశ్‌ రావు చెప్పుకొచ్చారు. కోటి ఎకరాల మాగాణిగా మన తెలంగాణను ఏడేండ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌ది. నేను గతంలో నారాయణఖేడ్‌లో పనిచేసినప్పుడు ఒక సామెత ఉండేది. గోరెంచకు పిల్లనియ్యొద్దు.. హద్దునూరుకు ఎద్దును ఇవ్వొద్దు అనే సామెత ఉండేది. ఇవాళ విూ దయతో మిషన్‌ భగీరథ నీళ్లు వచ్చాయి. దీంతో గోరెంచకు నీళ్లు వచ్చాయి. త్వరలో ఈ ప్రాజెక్టులతో హద్దునూరుకు ఎద్దు కూడా ఇస్తారు.. అంటూ మంత్రి హరీశ్‌ రావు వాడుకలో ఉన్న సామెతను గుర్తు చేశారు. చివ్నిూబాయి.. కమిటి మండలంలోని సర్దార్‌ తండ సార్‌ తనది. ఒక సారి ఎన్నికల ప్రచారంలో వాళ్ల తండాకు వెళ్లా. అప్పుడు ఆమె ఏమన్నదంటే మా తండాకు ఎవ్వరూ పిల్లను ఇస్తలేరు సార్‌. మా తండాకు కరెంట్‌ లేదు. మా తండాకు రోడ్డు లేదు. మా తండాకు నీళ్లు లేవు.. అని చెప్పింది. కానీ.. ఇప్పుడు అన్నీ ఆ తండాకు ఇచ్చారు సార్‌. దీంతో పిలిచి పిలిచి మా తండాకు పిల్లను ఇస్తున్నార్‌ సార్‌ అని ఇటీవల ఆ తండాకు మళ్లీ వెళ్లినప్పుడు చెప్పింది.. అని మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు.ఇలా ఎన్నో కాదు..చాలా విజయగాథలు ఉన్నాయి. నారాయణ్‌ఖేడ్‌కు విద్య కోసం 8 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 15 సబ్‌స్టేషేన్లు తెచ్చుకున్నం. మార్కెట్‌ యార్డులు వచ్చాయి. 54 తండాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నాం.. అని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.