లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు ఉన్నప్పటికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని బాధిత రైతుల తరుఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. హేయమైన నేర స్వభావాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. నిందితుడు ఉన్నతస్థాయి వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసి న్యాయ మార్గానికి ఆటంకం కలిగించే అవకాశమున్నదని అందులో పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 18న ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాధితుల తరుఫు న్యాయవాది సంబంధిత విషయాలను హైకోర్టు దృష్టికి తీసుకురాకుండా నిరోధించారని పిటిషన్‌లో ఆరోపించారు. సమర్థవంతమైన న్యాయ విచారణ కోసం బాధిత రైతు కుటుంబాలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తిరస్కరించారని అందులో పేర్కొన్నారు. అలాగే ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడంలో విఫలమైనందున తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్లు తెలిపారు.
కాగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో ఇది రెండోవది. ఈ నెల 15న ఆయన బెయిల్‌పై కోర్టు నుంచి విడుదలైన రెండు రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. ఆశిష్ మిశ్రా సాక్ష్యాలను తారుమారు చేయవచ్చని, సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నదని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఏడాది అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో రోడ్డు పక్కగా నిరసన చేస్తున్న రైతులను ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనంతో తొక్కించారు. ఈ ఘటనతోపాటు ఆ వెంటనే చెలరేగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్ మరణించారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను చాలా రోజుల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఆశిష్ మిశ్రాకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.