సంజీవయ్య ఇంటిముందు ధర్నాకు దిగిన విహెచ్
కర్నూలు,ఫిబ్రవరి12(జనం సాక్షి ): కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంజీవయ్య ఇంటి ఎదుట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు ధర్నా నిర్వహించారు. ఏపీలో జిల్లాల పునర్విభజన సందర్భంగా ఆయనతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లను ప్రకటించిన ఏపీ సీఎం జగన్‌ను హనుమంతరావు అభినందించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ , కడప జిల్లాకు వైఎస్సార్, మన్యం ప్రాంతాలకు అల్లూరి పేర్లు పెట్టిన విధంగా కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఉమ్మడి రాష్టాన్రికి అనేక సేవలందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు. స్థానిక నేతలు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి