మరోమారు ఉత్తర్వులుజారీచేసిన డిజిసిఎ
న్యూఢల్లీిన్యూఢల్లీి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం తెలిపింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతించిన విమానాలు, బబుల్ విమాన సర్వీసులపై ఈ నిషేధ ప్రభావం ఉండదని పేర్కొంది. గత ఏడాది నవంబర్ 26 నాటి సర్క్యులర్‌ను పాక్షికంగా సవరించినట్లు తెలిపింది. ఈ మేరకు డీజీసీఏ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 23న విధించిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతున్నది. అయితే కొన్ని దేశాలతో కుదిరిన బబుల్ ఒప్పందం మేరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కాగా, గత ఏడాది డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తామని డీజీసీఏ ప్రకటించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ సవిూక్ష అనంతరం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు నిషేధాన్ని పొడిగించింది. మరోవైపు దేశంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై ప్రభావం చూపింది. దీంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అయితే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ’ఆపరేషన్ గంగా’ పేరుతో ప్రత్యేక విమానాలను భారత్ నడుపుతున్నది. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్‌తో సహా అనేక మధ్య యూరోపియన్ దేశాల నుంచి విమానాలు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారతీయులు, భారత విద్యార్థులను తరలిస్తున్నది. దీనికి ఆయా దేశాలు తమ సహకారాన్ని భారత్‌కు అందిస్తున్నాయి.
అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగింపు