వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖ పరిధిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో నియామకాలు చేపడుతున్నది. వీటికి తోడుగా ఏపీ వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, హెల్త్ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం పోస్టులు సృష్టించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా సృష్టించిన పోస్టుల్లో డాక్టర్లు 485, నర్సింగ్ 60, ఫార్మసీ 78, పారామెడికల్ క్లాస్`4 644, ల్యాబ్ టెక్నీషియన్ 279, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 39, హాస్పిటల్ అడ్మినిస్టేష్రన్ 54, ఇతర పోస్టులు 949 ఉన్నాయి. వీటిలో చాలా పోస్టులు డైరెక్ట్, పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. మరికొన్ని పోస్టులను పదోన్నతితో భర్తీ చేయనున్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖల్లో ఇప్పటివరకు 39 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. 27 వేల పోస్టుల్లో నియామకాలు పూర్తవగా.. మిగిలినవి ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేయడం విశేషం.