` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
జెనీవా,ఫిబ్రవరి 7(జనంసాక్షి): గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త వేరియంట్ల ముప్పు ఇంకా తొలగిపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ డాక్టర్. టెడ్రోస్ అధానమ్ మాట్లాడారు. ‘‘మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే.. దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ కొవిడ్ మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుంది. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండే గ్రూపుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని టెడ్రోస్ అన్నారు. ఈ సందర్భంగా టీకా అసమానతల గురించి డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా పొందగలిగారు. ఇక ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23శాతం మాత్రమే. టీకా పంపిణీలో దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని పూడ్చి.. అందరికీ వ్యాక్సిన్ అందించడమే డబ్ల్యూహెచ్‌వో తక్షణ ప్రాధాన్యం’’ అని ఆయన తెలిపారు.
దశాబ్దాలపాటు కొవిడ్ ప్రభావం ఉంటుంది