పచ్చదనం పెంపు కృషి ఫలించింది
24 నుంచి 31 శాతానికి చేరుకున్న పచ్చదనంఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి25 (జనంసాక్షి): తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కెటిఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరాల్లో భవనాలు కూలగొట్టి చెట్లు నాటే పరిస్థితులు భవిష్యత్‌లో రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో తమకు చెప్పారని గుర్తు చేశారు. సరళతర వాణిజ్యవిధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్స్ తీసుకొచ్చి రాష్టాల్ర మధ్య పోటీ పెంచాలని సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన దిశగా రాష్టాల్రను ప్రోత్సహించేలా ర్యాంకింగ్ విధానాన్ని తీసుకురావాలన్నారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం అత్యంత ప్రాధాన్యమైన అంశం అని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు అనుమతుల విషయంలో ఆటవీశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు. తెలంగాణ, హైదరాబాద్ ఈవోడీబీ ర్యాంకులతో పాటు పచ్చదనం పెంపులోనూ అగ్రగామిగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మౌళిక సదుపాయాలు దేశంలో ఏ ఇతర నగరంలో లేవన్నారు. ఉపాధి హావిూ పథకం నిధులను పచ్చదనం పెంపు కోసం సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. బాగా పనిచేసే రాష్టాల్రకు ప్రోత్సాహకంగా కాంపా నిధులను అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాల తరహాలో అటవీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీడ్ బాల్స్ వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగించాం అని కేటీఆర్ తెలిపారు.