కరోనా జాగ్రత్తలతో తీసుకుని వెళ్లాలి
హైదరాబాద్,ఫిబ్రవరి1 (జనం సాక్షి): స్కూళ్లు తెరిచి విద్యార్థులు యధావిధిగా పాఠశాలలకు వెళేతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను సేఫ్‌గా వెళ్లేలా చూసుకోవాలని పోలీస్ శాఖ సూచించింది. కరోనా జాగ్రత్తలతో పాటు ..వారు క్షేమంగగా వెళ్లి వచ్చేలా సిద్దంగా ఉండాలని చూడాలన్నారు. వారు క్షేమంగా వెళ్లివచ్చేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. కరోనా కాలం కావడంతో మరింతగా శ్రద్ద చూపాలన్నారు. భద్రత లేని వాహనాల్లో పంపరాదన్నారు. ఆటోల సామర్థ్యం పరిశీలించాలని, డ్రైవర్ల గురించి తెలుసుకోవా లన్నారు. రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లోని పాఠశాలలకు తమ పిల్లను ఎలాంటి భద్రత లేని ప్రయాణంతో ప్రతిరోజూ సాగనంపడం కష్టంగా మారింది. దీంతో కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇవి సరిగా ఉన్నాయో లేదా, డ్రైవర్ శిక్షణ పొందాడా లేదా అన్నది చూసుకోవాలన్నారు. వాహనాలను కూడా శానిటైజేషన్ చేయించాలన్నారు. పిల్లలను జాగ్రత్తగా స్కూలుకు తీసుకుని వెళ్లి, మళ్లీ ఇంటికి చేర్చేలా విద్యాంస్థలతో మాట్లాడుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొందరు పిల్లలకు స్కూళ్లకు కుక్కిన ఆటోల్లో పంపడం క్షేమం కాదని అన్నారు. ఆటోలు, వాహనాల్లో కూడా భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. ఇంతకాలం ఇరుకు వాహనాల్లో పాఠశాలకు బయల్దేరుతున్న చిన్నారులు సవాలును ఎదుర్కొంటున్నారు. ఇకపోతే బస్సు సదుపాయం లేని బడులకు వెళ్లే చిన్నారుల కుటుంబాలు ఆందోళనతో పాటు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. ఒకవేళ బస్సు సౌకర్యం ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించని కుటుంబా లదీ ఇదే రకమైన పరిస్థితి. చిన్న వ్యాన్లు, ఆటోల్లో ప్రయాణం సాగిస్తున్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు వెళ్తున్నారు. ఆటోల్లో పాఠశాల విద్యార్థులు ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతూ.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. నలుగురు ప్రయాణిం చాల్సిన ఆటోలో కనీసం పది నుంచి 20 మంది విద్యార్థులను కుక్కి తీసుకుని వెళుతున్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని అంటున్నారు. నగర శివారుల్లో చాలా ప్రాంతాలకు రవాణా సదుపాయం లేదు. ఇరుకు సందులు, బస్సులు వెళ్లేందుకు అనువుగా లేని రహదారులు, ఒకరిద్దరి కోసం కొన్ని ప్రాంతాలకు వెళ్లని పాఠశాల వాహనాలు.. ఇలా కారణం ఏదైనా చిన్నారులు ఆటోలు, ఇతర వాహనాలపై పాఠశాలకు వెళ్లొచ్చేందుకు ఆధారపడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువులు కావాలంటే ఆటో ప్రయాణం తప్పనిసరి అయ్యింది. కరోనా హెచ్చరికల నేపథ్యంలో ప్రమాదం అంచున ప్రయాణం సాగిస్తున్న ఆటోల డ్రైవర్లు, ఇతర వాహనదారులు, పాఠశాలల
యాజమాన్యాలు స్పందించాలని పోలీసులు సూచించారు. ఏ చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించాలి. ఆటోవాలాలు, మినీ వ్యాను డ్రైవర్లు పిల్లల భద్రత అంశాన్నీ గమనించాలన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుని శానిటైజేషన్ చేయించి వారిని భౌతికదూరం పాటించేలా తీసుకుని వెళ్లాలన్నారు.