పంచాయితీనిధులు పక్కదారి పట్టడంతో సమస్యలు
ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే గ్రామాల్లో పనులు
అమరావతి,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): ఆర్థిక సంఘం నిధులు వస్తాయనే ఆశతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పంచాయతీ పాలకవర్గాలు స్థానికంగా కొన్ని పనులు చేసి ఇప్పుడు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాయి. నిధులు రాకపోవడంతో చేపిన పనులకు సంబంధించి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చేది వేసవి కావడంతో మంచి నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సమస్యలను తీర్చకుంటే ప్రజల నుంచి విమర్శలు తప్పవు. చేసిన పనులకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో నిధులు లేకపోవడంతో బిల్లుల చెల్లింపు కష్టంగా మారింది. అలాగే కొత్తగా మౌలిక వసతుల కల్పనకు ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, మంత్రులను సర్పంచులు కలిసి ఆర్థిక సంఘం నిధులను తమ ఖాతాలకు మళ్లించాలని కోరినా ఫలితం శూన్యంగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే వేసవి ప్రభావం పడిరది. ఈ నేపథ్యంలో తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు కూడా నిధులు లేవని పంచాయతీ కార్యదర్శి ఒకరు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వస్తే, కొత్త పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం గ్రామ పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమైన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రెండున్నర వేల కోట్లను ప్రభుత్వం గతేడాది తన ఖాతాకు మళ్లించుకుంది. దీంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆటంకం కలుగుతోంది. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రతి ఏడాదీ కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌తోపాటు గ్రామ పంచాయతీలకు కూడా ఆ నిధులు
మంజూరవుతాయి. అందులో పంచాయతీలకు 70 నంచి 85 శాతం, మండలాలకు 10 నుంచి 25, జిల్లా పరిషత్‌కు ఐదు నుంచి 15 శాతం మేర నిధులు మంజూరవుతాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ నిధులను ప్రభుత్వం బదిలీ చేసుకునే అధికారం లేదు. విద్యుత్ బిల్లుల సర్దుబాటు పేరుతో అన్ని
పంచాయతీల బ్యాంకు ఖాతాలనూ ప్రభుత్వం జీరో చేసింది. దీనిపై గతేడాది నవంబరులో సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖతాను తెరవాల్సి ఉండగా, రాష్ట్రంలో అలాంటి విధానం లేకపోవడంతో, నిధులన్నీ పంచాయతీ ఖాతాలోనే జమకావడం, తరచూ ప్రభుత్వం వాటిని బదలాయించుకోవడం జరుగుతోంది. దీనిపై ప్రజా ప్రతినిధుల నుంచి వ్యతిరేకత రావడంతో, ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయాలని పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు అన్ని పంచాయతీలూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేకంగా ఖాతాలను ఓపెన్ చేశాయి. మండల, జిల్లా పరిషత్ అధికారులు సైతం ప్రత్యేకంగా బ్యాంకు ఖతాలు తెరిచారు. అయినప్పటికీ ప్రభుత్వం బదలాయించుకున్న నిధులను వెనక్కి వేయలేదు.
వచ్చే వేసివిలో నీటి సమస్యలే ఎక్కువ