మెదక్ : మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. మంత్రాల నెపంతో ఓ ఇద్దరు దంపతులను దగ్గరి బంధువులే విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన అల్లాదుర్గం గ్రామంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోయిన రమేశ్(40), రజిత(38) ఊర్లోనే కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఆ దంపతులు చేతబడి చేస్తున్నారని దగ్గరి బంధువులు అనుమానించారు.
దీంతో సోమవారం ఉదయం ఆ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. ఇష్టమొచ్చినట్లు కొడుతూ.. గ్రామంలో ఊరేగించారు. అనంతరం వారిద్దరిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. గ్రామస్తులు ఎవరూ ఆ దంపతులకు అండగా నిలవలేదు.
సమాచారం అందుకు పోలీసులు అల్లాదుర్గం గ్రామానికి చేరుకున్నారు. రమేశ్, రజితను బంధువుల నుంచి విడిపించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంత్రాల నెపంతో ఆ దంపతులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.