ALL 1ST PAGE NEWS

 

1. గుజరాత్‌ డబుల్‌ ఇంజన్‌ కాదు.. ట్రబుల్‌ ఇంజన్‌
` పవర్‌ హాలీడేపై మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా..
హైదరాబాద్‌,మార్చి 31(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు మాటల యుద్ధానికి దిగుతుంటే, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అధికార టీఆర్‌ఎస్‌ నేతలు. రానున్న ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే, అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం కేంద్రంలోని బిజెపిని టార్గెట్‌ చేసి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ మండిపడుతోంది. తెలంగాణలో బీజేపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని సవాళ్ళు విసురుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అంశంపై రాజకీయ రగడ కొనసాగుతుంది.ధాన్యం కొనుగోళ్ళ రగడ నుండి బీజేపీని టార్గెట్‌ చేస్తున్న టీఆర్‌ఎస్‌ ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంలోని బీజేపీతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తోంది. మరోపక్క పెరిగిన పెట్రోల్‌ ,డీజిల్‌, గ్యాస్‌ ధరలపై కూడా సమర శంఖాన్ని పూరించింది. కేంద్రంలోని బిజెపి సర్కార్‌ పై ఒత్తిడి పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం విఫలయత్నం చేస్తుంది. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.గుజరాత్‌ మోడల్‌ పై మండిపడిన కేటీఆర్‌ ఇక ఇదే సమయంలో ఒకపక్క కేంద్రంతో వరి వార్‌ కంటిన్యూ చేస్తూనే బిజెపి పాలనపై విరుచుకు పడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. తాజాగా గుజరాత్‌ మోడల్‌ పైన ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ప్రస్తుతం గుజరాత్‌ రాష్ట్రంలో వారానికి ఒకరోజు పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించడాన్ని చూపించి ఇదేనా డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్‌. పవర్‌ ఫుల్‌ వ్యక్తులు వచ్చిన రాష్ట్రంలో ఇండస్ట్రీకి పవర్‌ హాలిడే అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారింది.గుజరాత్‌ రాష్ట్రంలో ఇండస్ట్రీస్‌ కి పవర్‌ హాలిడే.. ఇది డబుల్‌ ఇంజనా .. ట్రబుల్‌ ఇంజనా ? బిజెపిని సూటిగా టార్గెట్‌ చేస్తున్న మంత్రి గుజరాత్‌ మోడల్‌ అద్భుతం కాదంటూ ఈ పోస్ట్‌ చేశారు. గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జారీచేసిన లెటర్‌ ను తన ట్వీట్‌ కు జత చేసి ట్విట్టర్లో పోస్ట్‌ చేసిన కేటీఆర్‌ గుజరాత్‌ రాష్ట్రంలో ఇండస్ట్రీస్‌ కి పవర్‌ హాలిడే అంటూ వ్యాఖ్యానించారు. ఇది డబల్‌ ఇంజనా ? లేక ట్రబుల్‌ ఇంజనా అంటూ సూటిగానే ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే ఉద్దేశంతో బిజెపి పదే పదే చెప్పే డబల్‌ గ్రోత్‌ ఇంజన్‌ మోడల్‌ అంటే ఇదేనా అంటూ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు.తెలంగాణాపై ఫోకస్‌ చేస్తున్న బీజేపీని టార్గెట్‌ చేస్తున్న మంత్రి కేటీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సొంతగడ్డ గుజరాత్‌ లో ఇలాంటి పరిస్థితులు ఉంటే డబుల్‌ గ్రోత్‌ ఇంజన్‌ మోడల్‌ అని ఎలా చెబుతారు అంటూ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. గుజరాత్‌ మోడల్‌ ఏమి అద్భుతం కాదని పేర్కొన్న కేటీఆర్‌, అంత గొప్పగా అభివృద్ధి చేస్తే పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బలపడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ని టార్గెట్‌ చేయడం కోసం కేటీఆర్‌ బిజెపి వైఫల్యాలను ఒక్కొక్కటిగా టార్గెట్‌ చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలలో బీజేపీపై విముఖత పెరిగేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పెట్రో ధరలపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కెటిఆర్‌
దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్‌ డీజిల్‌, గ్యాస్‌ ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2014కు ముందు ప్రధాని మోదీ చేసిన ట్వీట్లను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. పెట్రో ధరల పెంపు విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని మోదీ ప్రశ్నించిన ట్వీట్‌ను కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని మోదీ చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. కేంద్ర వైఫల్యం వల్ల రాష్టాల్రపై తీవ్ర భారం పడుతుందని కేటీఆర్‌ మండిపడ్డారు. పేదల అవసరాల పట్ల బాధ్యత లేకుండా బీజేపీ పాలిస్తోందన్నారు. బీజేపీ అధికారం కోసం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చామని బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రం వాటా ఎంత ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీరో సహకారం అందించి ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

2.ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు భారీగా ఆయుధ,ఆర్థిక నష్టాలు
` యుద్ధం కోసం సుమారు రూ.2లక్షల కోట్లు ఖర్చుచేసిన రష్యా
మాస్కో,మార్చి 31(జనంసాక్షి):గత ఐదు వారాలుగా ఉక్రెయిన్‌పై యుద్ధంకోసం రష్యా భారీగా ఆయుధ, ఆర్థిక నష్టాలను చవిచూస్తోంది. యుద్ధం కోసం రష్యా సుమారు రూ.2లక్షల కోట్ల వరకు ఖర్చు చేసనట్లు సమాచారం.ఇంత చేసినా పుతిన్‌ సేనలకు ఉక్రెయిన్‌పై పట్టు దక్కడం లేదు. మొన్న జరిగిన చర్చలో సైన్యాన్ని వెనక్కు తిసుకుంటున్నట్టు ప్రకటించిన రష్యా ఆ వెంటనే మాట మార్చేసింది. ఉక్రెయిన్‌పై యథావిధిగా బాంబువర్షం కురిపిస్తోందిటర్కీలోని ఇస్తాంబుల్లో ఇటీవల జరిగిన శాంతి చర్చల్లో సైనిక కార్యకలాపాలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ రష్యా దాడులు మాత్రం ఆపడంలేదు. రష్యా సేనలు కీవ్‌ పరిసర ప్రాంతాలపై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌ సహా ఇతర ప్రాంతాలపైనా దాడుల తీవ్రత పెరిగిందని ఉక్రెయిన్‌ పేర్కొంటోంది. కీవ్తో పాటు చెర్న్హివ్‌ సవిూపంలో దాడులు ఆపేందుకు అంగీకరించిన కొద్దిగంట్లలోనే బాంబుల మోత మోగిస్తుండటం గమనార్హం. మరోవైపు, ఉక్రెయిన్‌ తూర్పు నగరం ఇజియం, డొనెట్స్క్‌ చుట్టూ రష్యా సేనలు మోహరించాయి. డెనెట్స్క్‌ ప్రాంతంలో పుతిన్‌ సేనలు దూకుడుతో వ్యవహరిస్తున్నాయి. రాత్రంతా తెల్ల భాస్వరం బాంబులతో దాడులు చేసినట్టు డొనెట్స్క్‌ ప్రాంత గవర్నర్‌ పావ్లో కైర్లెంకో వెల్లడిరచారు. అలాగే, రష్యా దాడులతో ఇర్పిన్లో సగ భాగం నాశనమైందనీ.. కీలక మౌలిక వసతులకు సంబంధించి తీవ్ర నష్టం వాటిల్లినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
రష్యా ఆయుధ డిపోపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి
రష్యా సేనల దాడులను ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. రష్యా భూభాగంలోని ఆయుధ డిపోపై దాడి చేశాయి. బాలిస్టిక్‌ క్షిపణితో ఉక్రెయిన్‌ దళాలు జరిపిన దాడిలో ఆయుధ డిపో ధ్వంసమైంది. ఐదు వారాలుగా రష్యా కొనసాగిస్తున్న దండయాత్రలో ఇరువైపులా వేల మంది మృతిచెందారు. ఈ యుద్ధంలో 17,500 మందికి పైగా రష్యా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్‌ సైన్యం తాజాగా ప్రకటించుకుంది. అంతేకాకుండా 135 విమానాలు, 131 హెలికాప్టర్లతో పాటు 614 ట్యాంకులు, 1735 సాయుధ శకటాలు, 75 ఇంధన ట్యాంకులు, 1200లకు పైగా వాహనాలు, ఇతర యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపింది. మరోవైపు, అనేకమంది ఉక్రెయిన్‌ సైనికులు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. 40లక్షలకు పైగా ఉక్రెయిన్‌ పౌరులు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. దీంతో ఉక్రెయిన్‌ హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి.
రష్యాను ఆపకపోతే కష్టమే!
గురువారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆస్ట్రేలియా పార్లమెంట్ను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ఉక్రెయిన్కు 25 మిలియన్‌ డాలర్ల మిలటరీ సాయం ప్రకటించగా.. మరింత సైనిక సహకారం అందించాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ కోరారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. రష్యాను ఆపకపోతే ప్రపంచ భద్రతకు చిక్కులు తప్పవని హెచ్చరించారు. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాలని పలు దేశాలు, కంపెనీలకు పిలుపునిచ్చారు. నల్ల సముద్రం వెంబడి ఓడరేవులు, నగరాల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు, ఉక్రెయిన్‌, రష్యా విదేశాంగ మంత్రులు రెండు వారాల్లో భేటీ అవుతారని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. రష్యన్‌ ఒలిగార్క్‌, వ్యాపారవేత్త రోమన్‌ అబ్రమోవిచ్‌ ఎంతో నిజాయతీగా యుద్ధం ముగిసేందుకు పనిచేస్తున్నారని టర్కీ విదేశాంగ శాఖ మంత్రి మెవ్లుట్‌ కావ్సోగ్లు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచే కీవ్‌, మాస్కో మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

 

3.ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయను..
చివరి బంతి వరకూ ఆడతా
జాతినుద్దేశించిన ప్రసంగంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్‌,మార్చి 31(జనంసాక్షి):దేశం ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో తమ ముందున్న రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రధాని పదవికి రాజీనామా చేయడంలేదని, ఆఖరి బంతి వరకూ ఆడతానని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో తనపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.’’నా లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడా? అనిపిస్తుంది. దేవుడు డబ్బు, మంచి జీవితంతో పాటు అన్నీ ఇచ్చాడు. ఇప్పటికీ నాకు ఎలాంటి దానిపై వ్యామోహంలేదు. పాకిస్థాన్‌కు సంబంధించి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావని చాలా మంది అడిగారు. పూర్వీకుల విజన్‌ సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా. పాక్‌ ఉన్నతస్థానంలో ఉండటం నా చిన్నతనంలో చూశా. మలేషియా రాజకుమారులతో కలిసి చదువుకున్నా. ఉన్నత స్థానం నుంచి పతనం వరకు పాకిస్థాన్‌ను చూశా. పాకిస్థాన్‌ నాకన్నా ఐదేళ్లు మాత్రమే పెద్దది. స్వాతంత్య్రం తర్వాత పుట్టిన తొలి తరం నుంచి నేను వచ్చాను. మా పార్టీ మేనిఫెస్టోలో న్యాయం, మానవత్వం, నిజాయతీ ఈ మూడే అంశాలు పెట్టాం. ఎవరికీ తలవంచను. నా దేశాన్ని ఎవరికీ బానిస కానివ్వను’’ అన్నారు.స్వతంత్ర విదేశాంగ విధానమే లక్ష్యం. నాకు భారత్‌, అమెరికాలో చాలా మంది మిత్రులు ఉన్నారు. నాకు ఎవరిపైనా దురుద్దేశాలు లేవు. వారి విధానాలను ఖండిస్తున్నా. ప్రధాని అయ్యాక మన విధానం ఎవరికీ వ్యతిరేకంగా ఉండకూడదని నిర్ణయించుకున్నా. కశ్మీర్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినప్పడు మాత్రమే వివాదం వచ్చింది. భారత్‌తో స్నేహానికి నా వంతు ప్రయత్నం చేశా. ప్రధాని పదవికి రాజీనామా చేయను. నా క్రికెట్‌ రోజుల్లో లాగే ఆఖరి బంతి వరకు పోరాడతా’’ అని ఇమ్రాన్‌ తేల్చి చెప్పారు.’’కొందరు వ్యక్తులు అమ్ముడుపోతున్నారు. దేశాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని అమ్మేస్తున్నారు. కానీ ప్రజలు అలాంటి వారిని క్షమించరు. విూ కుట్ర ఫలిస్తుందని విూరు భావిస్తే.. విూకో విషయం చెబుతున్నా. ఈ పరిస్థితులతో నేను పోరాడతా. పోరాటం చేసేందుకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు. ఎన్నో కష్టాల తర్వాతే ఇక్కడి దాకా వచ్చా. నేను దేశాన్ని నాశనం చేశానని అంటున్నారు. కానీ నేను కేవలం మూడున్నరేళ్లు పాలించా. గతంలో లేనంతగా ఈ కాలంలో నేనేం చేశానో సవాల్‌ చేసి చెప్పగలను. దేశ భవిష్యత్‌ ఎటువైపు వెళుతుందో ఈ ఆదివారమే తేలుతుంది’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు.

 

 

4.ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం
న్యూఢల్లీి,మార్చి 31(జనంసాక్షి): షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండిరగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటుదనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాడుతున్న విషయం తెలిసిందే.గత కొన్ని రోజులుగా పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్‌ ఎంపీ యానికం ఠాగోర్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు.కాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తొక్కిపెట్టిందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌ రావు దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. అందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఎనిమిదేండ్లుగా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని నామా విమర్శించారు. ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేసిన అనంతరం ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు విూడియాతో మాట్లాడారు.నవంబర్‌ 29, 2014న అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని టీఆర్‌ఎస్‌ ఎంపీ గుర్తు చేశారు. ఈ తీర్మానంపై కేంద్రం స్పందించడం లేదు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో ఎస్సీలు అణచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల సమస్యల విూద మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినప్పటికీ, ఆయన స్పందించలేదని తెలిపారు. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి. వీరి జనాభా ప్రతిపాదికన ఆధారంగా వారికి న్యాయం జరగాలన్నారు. అధికారం, పెత్తనం విూ దగ్గర పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.2014లో ఎన్నికల ముందు ఇదే బీజేపీ నాయకులు.. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ అణగారిన కులాలను ఇంకా అణగదొక్కుతూనే ఉంది. రాష్ట్రాలకు అధికారాలు ఇస్తే ఈ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం తీసుకొస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానంపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ పలు లేఖలు రాశారు. మంత్రుల బృందం కూడా కేంద్ర మంత్రులను కలిసింది. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. ఎస్సీలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్సీలు నిలదీయాల్సిన అవసరం ఉందని నామా నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు.

 

5.వదలని పెట్రోమంట
` మారోమారు పెరిగిన రేట్లు
దిల్లీ,మార్చి 31(జనంసాక్షి):సామాన్యుడి గుండె జారిపోయేలా దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది.గురువారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించారు. గత 10 రోజుల్లో 9 సార్లు వీటి ధరలను సవరించగా.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.6.40 పెరగడం గమనార్హం. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.81కి చేరింది. ముంబయి, కోల్‌కతాల్లో, హైదరాబాద్‌ల్లో అయితే ఏకంగా రూ.110 దాటేసింది.137 రోజుల విరామం తర్వాత మార్చి 22న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 80 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఒక రోజు మినహా దాదాపు ప్రతి రోజూ ధరల పెంపు కొనసాగుతోంది. అటు గ్యాస్‌ ధరలు కూడా పెరగడం, నిత్యావసరాలు మండిపోతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దిల్లీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిరసనల్లో పాల్గొన్నారు.

 

6.పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్‌
` దేశవ్యాప్తంగా దద్దరిల్లిన నిరసనలు
` పార్లమెంటులో నిలదీసిన కాంగ్రెస్‌ ఎంపిలు
` విజయ్‌ చౌక్‌ వద్ద రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా
న్యూఢల్లీి,మార్చి 31(జనంసాక్షి): ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ మండిపడిరది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెంచిన ధరలను పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇంధన ధరల పెంపు.. సామాన్యుడికి భారంగా మారిందని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్‌ చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అంతకుముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రో ధరలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారని మోడీ సర్కారుపై రాహుల్‌ గాంధీ విమర్శలకు దిగారు. చమురు ధరలు భగ్గుమంటుంటే ఫకీరుని ప్రశ్నించినా మోడీ గురించి అన్నారు. జోలె పట్టుకుని మాయమాటలతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారంటూ దుయ్యబట్టారు. ఆసియాలోని పలు దేశాల పెట్రో రేట్లు, భారత్‌లో ఉన్న చమురు ధరలను పోల్చుతూ రాహుల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ’పెట్రోల్‌ రేట్లను భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. అఫ్గానిస్థాన్‌ లో రూ.66.99, పాకిస్థాన్‌ లో రూ.62.38, శ్రీలంకలో రూ.72.96, బంగ్లాదేశ్‌ లో రూ.78.53, భూటాన్‌ లో రూ.86.28, నేపాల్‌ లో రూ.97.05, ఇండియాలో రూ.101.81గా ఉంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ధరల పెరుగుదల నుంచి భారత్‌ కు విముక్తి కలగాలనిహ్యాష్‌ ట్యాగ్‌ ను ట్వీట్‌ కు జత చేశారు. ఇకపోతే పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢల్లీిలోని విజయ్‌ చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ ఎంపీలు ప్రదర్శన చేపట్టారు. ’మెహంగాయి ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ అనే పేరుతో నిరసనలకు దిగారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారినా చలించడం లేదని రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో పేదవారి నుంచి ప్రభుత్వం డబ్బులు దోచుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది. ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరుగుతోందని రాహుల్‌ గాంధీ అన్నారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసిస్తూ.. మధ్యప్రదేశ్మాజీ సెం కమల్‌నాథ్‌ ఆధ్వర్యంలో మహిళలు ధర్నాలకు దిగారు. గ్యాస్‌ సిలిండర్లకు దండలు వేస్తూ నిరసనలు చేపట్టారు. చెన్నైలోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పలు రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ నేతృత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధనం ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ ఎంపీలు.గత 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్‌,డీజిల్‌ రేటు పెరిగిందన్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నామని కాంగ్రెస్‌ నేత ఖర్గే అన్నారు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరి, మల్లికార్జున్‌ ఖర్గే, అభిషేక్‌ సింఫ్వీులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

7.రాజ్యసభలో అనుభవజ్ఞులే ఎక్కువ
` వారి అనుభవమే ఉపయోగపడిరది
` మంచి చట్టాలు తీసుకుని రావడంలో వారిదే ముఖ్యపాత్ర
` రిటైర్‌ అవుతున్న సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ
న్యూఢల్లీి,మార్చి 31(జనంసాక్షి):మన రాజ్యసభలో చాలా అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని, మంచి చట్టాలు చేయడంలో వారి అనుభవం ఎల్లప్పుడూ ఉపయోగపడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొన్నిసార్లు అకడమిక్‌ నాలెడ్జ్‌ కంటే అనుభవానికే ఎక్కువ శక్తి ఉంటుందని ఆయన అన్నారు. ఈ రోజు రిటైర్‌ అవుతున్న రాజ్యసభ ఎంపీలు మళ్లీ తిరిగి సభకు ఎన్నికవ్వాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో గురువారం 72 మంది ఎంపీల పదవీకాలం ముగిసింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌.. రిటైర్‌ అవుతున్న సభ్యులకు వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటో దిగారు. అనంతరం సభ మొదలయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ ఇవాళ రిటైర్‌ అవుతున్న వారిలో పలువురు సభ్యులు సుదీర్ఘ కాలం పార్లమెంట్‌లో ఉన్నారన్నారు. కొన్నిసార్లు అకడమిక్‌ నాలెడ్జ్‌ కంటే అనుభవమే చాలా శక్తిమంతమైనదని అన్నారు. ఈ దేశ ప్రజలకు మంచి చేసే చట్టాలు తీసుకురావడంలో లోక్‌సభ కంటే రాజ్యసభ పాత్రనే ఎక్కువని చెప్పారు. రాజ్యసభలో సభ్యులుగా పొందిన అనుభవాన్ని దేశ నలుమూలలకూ ఉపయోగపడేలా చూడాలన్నారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకున్న వివిధ పార్టీలకు చెందిన 72మంది ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు పలికారు. వీరంతా మరోసారి సభకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చదువు ద్వారా పొందిన జ్ఞానం కంటే అనుభవం ద్వారా వచ్చే జ్ఞానమే శక్తిమంతమైందని సభ్యులను ఉద్దేశించి మోదీ అన్నారు. సభలో ఎంతో కాలం గడిపామని, సభకు ఇచ్చినదానికంటే, సభే అందరి జీవితాలకు ఎంతో తోడ్పాటు అందించిందని మోదీ చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా పొందిన అనుభవాన్ని దేశ నలుమూలలకు తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించారు. భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. సభలో సభ్యుల సంఖ్య తగ్గితే మిగతా వారిపై బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. పదవీ కాలం పూర్తయిన 72మంది సభ్యులతో మోదీ, వెంకయ్య, ఓం బిర్లా ఫొటోలు దిగారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సభాపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను మోదీ ఆప్యాయంగా పలకరించారు. దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభ్యులు అంకితభావం, మెరుగైన పనితీరు, విధానపరమైన సమగ్రతతో నడుచుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు సూచించారు. చట్టాలను రూపొందించే సంస్థలకు విఘాతం కలగించకుండా ఉండాలని అన్నారు. సభ్యుల ఆందోళన కారణంగా 2017 నుంచి 35శాతం సభా సమయం వృథా అయిందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు ప్రసాదించిన గౌరవాన్ని, విశేషాధికారాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ రద్దు చేశారు. పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయా సభ్యులంతా రాజ్యసభలో ప్రసగించారు. వారు అతమఅనుభవాలను పంచుకున్నారు. రోజంతా వారి ప్రసంగాలు కొనసాగాయి. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో 72 మంది సభ్యులకు విందు ఏర్పాటుచేశారు. పదవీకాలం పూర్తికానున్న వారిలో ఏకే ఆంటోని, అంబికా సోని, పీ చిదంబరం, ఆనంద్‌ శర్మ, సురేశ్‌ ప్రభు, ప్రఫుల్‌ పటేల్‌, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రసన్న ఆచార్య, సంజయ్‌ రౌత్‌, నరేశ్‌ గుర్జాల్‌, సతీష్‌ చంద్ర మిశ్ర, మేరీ కోమ్‌, స్వపన్‌ దాస్‌ గుప్తా, నరేంద్ర జాధవ్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. తెలుగురాష్టాల్ర నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, సురేశ్‌ ప్రభు, విజయసాయిరెడ్డి, డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఉన్నారు.

 

8.వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం
` ఐసీయూలో రోగి కాలు, చేతివేళ్లు కొరికేసిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం
` ఘటనపై ప్రభుత్వం సీరియస్‌..
` సూపరింటెండెంట్‌ బదిలీ, ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్‌ వేటు
వరంగల్‌,మార్చి 31(జనంసాక్షి):వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆర్‌ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి.దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గతకొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎంలో చేర్చారు. రోగి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్‌ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టుకట్టారు. ఇవాళ ఉదయం కూడా ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు. శ్రీనివాస్‌కు తీవ్ర రక్తస్రావం కావడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు ఎలుకల బెడదపై ఆస్పత్రి ఆర్‌ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగి శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ఘటనపై ప్రభుత్వం సీరియస్‌..
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలోని ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఉపక్రమించింది.ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గతకొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎంలో చేర్చారు. రోగి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్‌ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టుకట్టారు. ఇవాళ ఉదయం కూడా ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు.

 

9.తెలంగాణలో ఎండల తీవ్రత..
` 6 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌: డీహెచ్‌ శ్రీనివాసరావు
హైదరాబాద్‌,మార్చి 31(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని.. రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్‌ విూడియాతో మాట్లాడారు. 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి అడేలా చూడాలని.. అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వెల్లడిరచారు. నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించే వాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రావొద్దని చెప్పారు. కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారం తీసుకోవద్దని సూచించారు.

 

10.దేశం కోసం నా ప్రాణమైనా ఇస్తా
` దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌
దిల్లీ,మార్చి 31(జనంసాక్షి): తన నివాసం ఎదుట బీజేవైఎం ఆందోళనకారులు చేపట్టిన విధ్వంసంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీనే దాదాగిరీకి పాల్పడుతూ.. ఈ సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. ఈ దేశం కోసం తాను చావడానికైనా సిద్ధమని అన్నారు.‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని అవాస్తవ చిత్రం అంటూ వ్యాఖ్యలు చేసి కశ్మీరీ పండితులను ఎగతాళి చేసినందుకు క్షమాపణ చెప్పాలని కోరతూ బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు బుధవారం కేజ్రీవాల్‌ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఎన్నికల్లో తమను ఓడిరచలేక కేజ్రీవాల్ను చంపాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది.ఈ ఘటనపై తాజాగా కేజ్రీవాల్‌ స్పందిస్తూ భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యం కాకపోవచ్చు. కానీ, దేశం ముఖ్యం. ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇలాంటి దౌర్జన్యాలతో భారత అభివృద్ది చెందదు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఇలాంటి దాదాగిరీకి పాల్పడితే.. ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తుంది. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి దౌర్జన్యమే సరైన మార్గమేమో అని ప్రజలు భావిస్తారు’’ అని కేజ్రీవాల్‌ విమర్శించారు.కేజ్రీవాల్‌ ఇంటి ముందు దాడి ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

 

 

12.హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై బీటెక్‌ విద్యార్థి మృతి
హైదరాబాద్‌,మార్చి 31(జనంసాక్షి):హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై బీటెక్‌ విద్యార్థి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు జూబ్లీహిల్స్‌, నల్లకుంట పరిధిలో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.వారి నుంచి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శివమ్‌రోడ్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌ అనే వ్యక్తిని నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ బృందం నల్లకుంట పోలీసుల సాయంతో అరెస్టు చేసింది. అతనితో పాటు డ్రగ్స్‌ వినియోగిస్తున్న ముగ్గురుని కూడా అరెస్టు చేశారు. ఈ నలుగురితో పాటు మరో బీటెక్‌ విద్యార్థి తరచూ గోవా వెళ్లి డ్రగ్స్‌ తీసుకునే వారు. ఈక్రమంలో డ్రగ్స్‌ మోతాదు ఎక్కువై బీటెక్‌ విద్యార్థి మృతి చెందినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌ గోవా నుంచి మత్తు పదార్థాలు తెచ్చి హైదరాబాద్‌లో తన స్నేహితులు, కస్టమర్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 6ఎల్‌ఎస్డీ బోల్ట్స్‌, 10 ఎక్ట్సాసి పిల్‌, 100 గ్రాముల హాష్‌ ఆయిల్‌, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో డ్రగ్స్‌ విక్రయిస్తున్న శ్రీరామ్‌ ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి .. వివిధ ప్రాంతాల్లో తిరిగి డీఎంటీ డ్రగ్స్‌ తయారు చేసిన శ్రీరామ్‌ పలువురికి విక్రయిస్తున్నాడు. అతనితో పాటు డ్రగ్స్‌ వినియోగిస్తున్న దీపక్‌ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి 8గ్రాముల డీఎంటీ డ్రగ్‌, తయారీ సామగ్రి, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్టు శాంతిభద్రతల అదనపు సీపీ ఎల్‌.ఎస్‌. చౌహాన్‌ తెలిపారు.
లక్ష్మీపతి కోసం గాలిస్తున్న పోలీసుల..
నల్లకుంటలో పోలీసులు అరెస్టు చేసిన డ్రగ్స్‌ విక్రేత ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌కు హాష్‌ అయిల్‌ (గంజాయి నుంచి తీసిన ఆయిల్‌) విక్రయించిన లక్ష్మీపతి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రేమ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
బీటెక్‌ విద్యార్థి మరణంపై వెలుగులోకి ఆసక్తికర విషయాలు..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మోతాదు ఎక్కువై నమోదైన తొలి మరణంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరానికి చెందిన బీటెక్‌ విద్యార్థి విచిత్ర ప్రవర్తనతో ఈనెల 19న నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యాడు. అతని తండ్రి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులకు పరిస్థితి ఏంటో మొదట అర్థం కాలేదు. అతను మత్తు పదార్థాలకు బానిసని వైద్యులకు చెప్పలేదు. దీంతో వైద్యులు అతని స్నేహితులను పిలిచి విషయం తెలుసుకోగా... ఎల్‌ఎస్‌డీతో పాటు మద్యం, కెనలబిస్‌ సేవించాడని తెలిపారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంపాలైన యువకుడి మెదడులో స్ట్రోక్స్‌ వచ్చాయని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. విచిత్రంగా ప్రవర్తించి శరీర అవయవాలు పనిచేయడం మానేశాయని, అందుకే మృతి చెందినట్టు వెల్లడిరచారు. ఈనెల 23న అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన్నేళ్లుగా వివిధ రకాల మత్తుపదార్థాలు సేవిస్తుండటం వల్లనే అతను తీవ్ర అనారోగ్యంపాలై మృతి చెందాడని చెప్పారు.

 

13.రేపటి నుంచి మాస్కులు అవసరంలేదు..
` ‘మహా’ కేబినెట్‌ నిర్ణయం!
` కొవిడ్‌ నిబంధనలన్నీ ఎత్తివేత
ముంబయి,మార్చి 31(జనంసాక్షి): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని నిర్ణయించింది. కొవిడ్‌ ప్రారంభ దశలో అమలులోకి తీసుకొచ్చిన డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, కేబినెట్‌ నిర్ణయించిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే వెల్లడిరచారు. అలాగే, మాస్క్‌ ధరించడం తప్పనిసరి కాదన్నారు. రెండు డోసులు వేసుకున్న ప్రజలు ముంబయి లోకల్‌ రైళ్లలో ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. అయితే, బలవంతపు నిబంధనలు సడలిస్తున్నామంటే దానర్థం ప్రజలు జాగ్రత్తలు పాటించొద్దని కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, టాస్క్ఫోర్స్‌ కమిటీతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, మున్ముందు కరోనా వైరస్లాంటి మహమ్మారులు రాకుండా అడ్డుకోవాలంటే ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, వ్యాక్సిన్‌ వేయించుకోవడం వంటి చర్యలు అవసరమని మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మహారాష్ట్రలో గురువారం 183 కొవిడ్‌ కేసులు, ఒక కొవిడ్‌ మరణం నమోదయ్యాయి. తాజాగా 219మంది రికవరీ కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 902 క్రియాశీల కేసులు ఉన్నాయి.