.పేద విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయం


హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి):హైదరాబాద్‌ మంత్రి కేటీఆర్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఇద్దరు అక్కాచెళ్లెళ్లకు డబ్బులు లేవని.. తన తండ్రి కూలీ పని చేస్తున్నాడని తెలుసుకొని ఆ విద్యార్థినుల లక్ష్యం ఆగిపోకుండా.. కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఇద్దరు అక్కాచెళ్లెళ్లకు వాళ్ల ఉన్నత విద్య పూర్తయ్యేంతవరకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజమల్లు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. కోవిడ్‌ వల్ల ఆ ఉద్యోగం కూడా పోయింది. దీంతో రోజు వారి కూలీగా మారాడు. కూలీ పనులు చేస్తూ తన పిల్లలను ఇప్పటి వరకు చదివించాడు. తనకు ఇద్దరు కూతుళ్లు. కావేరీ(21), శ్రావణి(18). కావేరీ ఇంటర్మీడియెట్‌లో 95 శాతం మార్కులతో పాస్‌ అవడంతో పాటు సిద్ధిపేటలోని సురభి మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించింది. శ్రావణి కూడా ఇంటర్మీడియెట్‌లో 97 శాతం ఉత్తీర్ణత సాధించి ఏపీలోని ఎన్‌ఐటీ తాడెపల్లిగూడెంలో ఉన్న ఎన్‌ఐటీలో బీటెక్‌ సీటు సంపాదించింది. ఇద్దరికీ తమ మెరిట్‌ ఆధారంగా ఆయా కాలేజీల్లో ఉచిత సీటు వచ్చినప్పటికీ.. మిగితా పరీక్ష, ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌, మెస్‌ ఫీజులు చెల్లించడం చాలా కష్టంగా మారింది.ఈ విషయం ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఇద్దరు అక్కాచెళ్లెళ్లు మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ పూర్తి చేసే దాకా.. అయ్యే ఖర్చును తానే భరిస్తానని హావిూ ఇచ్చారు.ఈసందర్భంగా ఇద్దరు విద్యార్థినులు తన తండ్రితో పాటు మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఇద్దరు విద్యార్థినులతో మంత్రి కేటీఆర్‌ కాసేపు మాట్లాడారు. వాళ్ల చదువు గురించి వాకబు చేశారు. వాళ్లకు అండగా ఉంటానని మాటిచ్చారు. అనంతరం మంత్రి కేటీఆర్‌.. వాళ్లకు చెక్‌ను అందజేశారు. తమ ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్‌కు ఇద్దరు విద్యార్థినులు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.