` అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ అయినందున అనుసరించాల్సిన
కార్యాచరణపై మంత్రివర్గ సహచరులకు వివరించిన కేసీఆర్!
` నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్,మార్చి 6(జనంసాక్షి):అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టబోయే 2022`23 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. బడ్జెట్‌ను ఆమోదించడమే ప్రధాన అజెండాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలను సీఎం కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అయినందున .. అనుసరించాల్సిన కార్యాచరణ, అమలు తీరుతెన్నులపై వివరించినట్టు సమాచారం. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళి సై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం పొందడంతో బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే నేరుగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశ పెడతారు. మరో వైపు బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1200 మంది పోలీసులు బందోబస్తులో భాగం కానున్నారు.