` ఆరు నెలలు సినిమాలకు..సెల్‌ఫోన్లకు దూరంగా ఉండండి
` ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదవండి
` మంత్రి మల్లారెడ్డితో కలసి కోచింగ్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్,మార్చి 14(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేశారు. 6 నెలలు సినిమాలకు దూరంగా ఉండండని కేటీఆర్ సూచించారు. కొద్దిగా క్రికెట్ తక్కువ చూడండి. ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలను బంద్ చేసి చదువుపై దృష్టి సారించండి. ఫోన్ తక్కువగా వాడితేనే లాభం ఉంటుంది. విూ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలని ఉద్యోగ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు.పీర్జాదిగూడ పరిధిలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత మాట్లాడుట కష్టం. మిమ్మల్ని ఒక ఊపు ఊపి విడిచి పెట్టారు. అసెంబ్లీలో కూడా అంతే. మనసుకు ఎక్కే విధంగా మాట్లాడిరడు. ఆయన కూడా యూతే కాబట్టి ఆ విధంగా మాట్లాడారని కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న కాక మొన్న శాసనసభలో 90 వేల ఉద్యోగాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఘనత మల్లారెడ్డికే దక్కుతుందన్నారు. కోచింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. 3 నుంచి 4 నెలల పాటు ఈ కోచింగ్ సెంటర్ కొనసాగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు కొనసాగుతాయి. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వనున్నారు. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొవిడ్ కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య, నిపుణ చానెల్‌ను ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. యూట్యూబ్‌లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో లభ్యమవుతుందన్నారు. ఈ చానెల్‌ను వాడుకోవాలని సూచిస్తున్నాను. విూ కోసమే ప్రభుత్వం ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పోటీతత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తదనే విశ్వాసం వస్తుంది. ఒక వేళ ఉద్యోగం రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయి. 13 వేల పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. మరో 6 వేల పరిశ్రమలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రయివేటు రంగంలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. తెలంగాణ పిల్లలకు కొలువులు ఇచ్చినట్లు అయితే ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రయివేటు రంగంలో కచ్చితంగా మన పిల్లలకే సింహ భాగం అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. టీ హబ్, వీ హబ్ లాంటి సంస్థల్లో కూడా పారిశ్రామిక ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
5 లక్షల 62 వేల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వాళ్లు కూడా నింపక తప్పదు. దాంట్లో మనకు కూడా 60 నుంచి 70 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చదవడం వల్ల నష్టం ఉండదు. ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది. నైపుణ్య శిక్షణ(స్కిల్) పొందాలి. అప్ స్కిల్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు రీ స్కిల్ చేసుకోవాలి. ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విూరు తయారు కావాలి. టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో మారు తున్న పరిణామాలకు అనుగుణంగా మనకు మనం ఆవిష్కరించుకోవాలి. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో వచ్చే ఉద్యోగాలకు పోటీ పడుతూనే ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ యువతకు డిగ్రీలు ఉంటే సరిపోదు.. కష్టపడి చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనిస్పష్టం చేశారు. మంచి ఉద్యోగంతో పాటు మంచి పార్ట్‌నర్‌ను సంపాదించు కోవాలని మంత్రి సూచించారు. తన ప్రసంగంతో ఉద్యోగ అభ్యర్థుల్లో మల్లారెడ్డి జోష్ నింపారు. ప్రపంచంలో ఉన్న టాప్ ఇంజినీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు మన తెలంగాణ వారే. తెలుగు వారికి తెలివితేటలు ఎక్కువ. స్కిల్, చాలెంజ్‌తో పాటు కసి ఎక్కువ. యువతకు గత గవర్నమెంట్లు మద్దతు తెలుపలేదు. అందుకే ఇతర దేశాలకు వెళ్లి సెటిలయ్యారు. మన కేసీఆర్ సీఎం అయ్యాక, యువత, తెలివిపరులు మన దగ్గరే ఉండాలని, తెలంగాణను అభివృద్ది చేసుకోవాలనే ఉద్దేశంతో యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ప్రపంచంలోని టాప్ మోస్ట్ కంపెనీలను కేటీఆర్ రాష్టాన్రికి తీసుకొచ్చారు. మన వద్ద ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తన విద్యార్థుల ఇంగ్లీష్ పర్‌ఫెక్ట్‌గా ఉంటదని మల్లారెడ్డి పేర్కొన్నారు. చైనా, జపాన్ వాసులు ఇంగ్లీష్ మాట్లాడితే బిత్తరబిత్తరగా ఉంటుంది. కానీ మన ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అన్ని రకాల వసతులు కల్పించి, కోచింగ్ ఇప్పిస్తున్నాం. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగాలు విూకందరికి రావాలని కోరుకుంటున్నానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తానొకప్పుడు పాలు అమ్మి, బండలు అమ్మి జీవనం కొనసాగించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇప్పుడు మల్టీ నేషనల్ కంపెనీలు నగరానికి వచ్చాయి. భవిష్యత్ అంతా విూదే, ప్రపంచమంతా విూదే. మళ్లీ జన్మలేదు. సక్సెస్ కావాలి. విూరు కష్టపడితే విూకే మంచిది. సీరియస్‌గా కష్టపడాలి. తెలంగాణలో గొప్ప అవకాశాలు ఉన్నాయని చెప్పారు.ప్రపంచంలోని చాలా మంది టెక్నాలజీని వాడుకొని ప్రపంచ కుబేరులు అయ్యారని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. టెక్నాలజీ అంటే తెలివితో పని చేయాలి. యాపిల్ కంపెనీ ఉంది. ఒక యాపిల్ ఫోన్ రూ. 2 వేల వరకు తయారవుతుంది. ఆ ఫోన్‌ను మాత్రం రూ. లక్ష వరకు అమ్ముతుండు. 2జీ, 3జీ, 4జీ, 5జీ అని అప్‌గ్రేడ్ చేసుకుంటూ అధిక ధరకు అమ్ముతున్నారు. అలా మనం కూడా అప్‌గ్రేడ్ కావాలి. అదృష్టం అనేది మన చేతుల్లోనే ఉంది. విూ కోసం విూరు కష్టపడాల్సిందే. డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు. అప్‌గ్రేడ్ అవుతేనే సక్సెస్ అవుతాం. దూకుడు పెంచాలి. లేకపోతే విూ భవిష్యత్‌కు ప్రమాదం ఉంటుంది. విూకు అధిక జీతాలు వస్తే మంచి పార్ట్‌నర్, బంగ్లా దొరుకుతుందని ఉద్యోగ అభ్యర్థుల్లో మంత్రి మల్లారెడ్డి జోష్ కల్పించారు.
ఉద్యోగాలకు ఉచిత శిక్షణ