` కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీ విజయ దుంధుభి
` నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా
` మణిపూర్,గోవా,ఉత్తరాఖండ్,యూపీలలో వికసించిన కమలం..
` యూపీలో రెండు సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్
` ఒకే ఒక్క సీటు దక్కించుకున్న బిఎస్పీ
చండీగఢ్,మార్చి 10(జనంసాక్షి):పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీ విజయ దుంధుభి మోగించింది. రాష్ట్రంలోని దాదాపు 70 శాతానికిపైగా సీట్లను ఆప్ గెలుచుకుంది. ప్రస్తుత సీఎంతోపాటు మాజీ సీఎం, పీసీసీ చీఫ్‌లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హవాలో కొట్టుకుపోయారు. ఒక రకంగా పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్రను సృష్టించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఎస్‌ఎడీ పితామహుడు ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమిపాలయ్యారు. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం తొలి రౌండ్‌ల ఓట్ల లెక్కింపు తర్వాత 91 స్థానాల్లో ఆధిక్యం సాధించి క్లీన్‌స్వీప్ దిశగా సాగింది.గురువారం రాత్రి వరకు పంజాబ్ అసెంబ్లీ ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ (18), శిరోమణి అకాలీదళ్ (మూడు), భారతీయ జనతా పార్టీ (రెండు), బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన భగవంత్ మాన్ ఖట్కర్ కలాన్‌లో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కాకుండా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్కలన్‌లో కొత్త పంజాబ్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ గురువారం తెలిపారు. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ గెలుపొందారు.ఇది ఇలావుండగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చెన్నీ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు.. అయితే, భదౌడా, చమకౌర్ సాహిబ్ రెండు స్థానాల్లోనూ ఆయన పరాజయం పాలయ్యారు. ఇక, అమృత్ సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరాజయం పాలయ్యారు.. అజయ్ గుప్తా అనే ఆప్ అభ్యర్థి సిద్ధూను ఓడిరచారు. మరోవైపు పంజాబ్ సీఎంగా పనిచేసిన అమరీందర్ సింగ్.. పాటియాలా నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి అజీత్ సింగ్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు.. ఇక, మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు. ఇలా ఎంతోమంది రాజకీయ ప్రముఖులను మట్టి కరిపించారు ఆప్ అభ్యర్థులు.అనుకున్నట్లే ఉత్తర ప్రదేశ్‌ను మరోసారి బీజేపీ నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది. దాదాపు 273 సీట్లలో బిజెపి విజయం సాధించింది. ఇకపోతే ఎస్పీ 125 సీట్ల ఆధిక్యంలో రెండోస్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లలో మాత్రమే ఆధిక్యాన్ని పొందింది. గతంలో పాలన చేసిన బిఎస్పీ కేవలం ఒక్క స్థానంలోనే ముందంజలో ఉంది. ఈ ఫలితాలతో మరోమారు యోగి ఆదిత్యనాథ్ యూపిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. 2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాల వ్యూహా రచన మరోసారి ఫలించింది. ఈ విజయంలో వారిదే కీలక భూమిక. ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోనే నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని పాలన చూసే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లోనూ భాజపా గెలుపు బావుటా ఎగరేసిన నేపథ్యంలో లఖ నవూలో భాజపా కార్యకర్తలు అట్టహాసంగా సంబురాలు జరుపుకొన్నారు. కార్యకర్తలు, పార్టీ నేతలతో సంబరాల్లో పాల్గొన్న యోగి.. అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రెండోసారి అధికారం కట్టబెట్టిన యూపీ ప్రజలకు యోగి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో మొదటిసారి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని యోగి అన్నారు. ప్రజలు అందించిన ఈ విజయంతో యూపీ అభివృద్ధికి మరింత ఎక్కువగా కృషి చేస్తానన్నారు. భాజపా పాలనలో రక్షణ ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారని.. మోదీ మార్గనిర్దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కొవిడ్, లాక్ డౌన్ సమయంలో పేదలకు భాజపా అండగా నిలిచిందని.. పేదలకు తాగునీరు, విద్యుత్, ఇళ్లు, ఇతర వసతులు సమకూర్చామన్నారు. మోదీ నేతృత్వంలో యూపీ నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోందని.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని యోగి హావిూ ఇచ్చారు.
మణిపూర్‌లో మళ్లీ వికసించిన కమలం..
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సత్తా చాటింది. ఒక్క పంజాబ్‌లో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కమలం వికసించింది. ఇక మణిపూర్‌లోనూ బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలను గెలుచుకొని మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకుంది.ఇక కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్‌పీపీ ఏడు స్థానాల్లో.. ఎన్పీఎఫ్ కూడా అయిదు స్థానాల్లో విజయం సాధించింది. ఇక జేడీయూ ఆరు చోట్ల గెలుపొందింది. ఇతరులు అయిదు స్థానంలో గెలిచారుమణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విజయం సాధించారు. హింగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగేజం శరత్‌చంద్ర సింగ్‌పై 17 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆ సందర్భంగా బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.మరోవైపు మణిపూర్‌లో బీజేపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇంఫాల్‌లోని బీజేపీ కార్యాలయం ముందు బాంబులు పేల్చారు. సీఎం బీరెన్ సింగ్ ఇంటి వద్ద మహిళలందరూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని.. సంప్రదాయ నృత్యాలలతో అలరించారు.
గోవాలోనూ ‘చేయి’చ్చారు
నాలుగు రాష్ట్రాల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు గోవాలోనూ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో చేతులెత్తేసిన గ్రాండ్? ఓల్డ్ పార్టీ.. గోవాలోనైనా అధికారంలోకి వచ్చి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా అక్కడా నిరాశే ఎదురైంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 12 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 20 స్థానాలు గెలిచింది. మెజారిటీకి అడుగు దూరంలో నిలిచింది. అయితే, స్వతంత్రులుగా గెలిచినవారిలో ముగ్గరు తమకు మద్దతు ఇస్తారని కమళ దళం ఇప్పటికే ప్రకటించింది. గోవాలో అధికారాన్ని తిరిగి చేపడతామని స్పష్టం చేసింది.ఇక గోవాలో హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 21 సీట్లు రావాల్సి ఉంది.. అయితే ఇప్పటికే గోవాలో 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకుంది. టీఎంసీ రెండు స్థానాలు, ఆప్ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు. కాగా ఒక్క ఇండిపెండెంట్‌ను లాక్కోగలిగినా బీజేపీ సర్కార్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెట్లే కీలకం కానున్నారు. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునేందుకు తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు రిసార్ట్‌కు తరలించారు.గోవాలో మ్యాజిక్‌ఫిగర్‌కు చేరువలో బీజేపీ ఆగిపోవడంతో ప్రభుత్వ ఏర్పాట్లలో కమలనాథులు నిమగ్నమయ్యారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన సమర్పించాలని భావిస్తోన్న బీజేపీ ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరింది. మరోవైపు బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అంటున్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ సహా స్వతంత్రుల మద్ధతు తమకే ఉందని ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్‌లో నవశకం