తిరుమల,మార్చి4 (జనం సాక్షి ) : తిరుమలలోని శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగగా తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే 50,511 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. 22,089 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, భక్తులు సమర్పించిన కానుకల వల్ల హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు. కాగా తిరుపతిలోని ఎస్వీ శిల్పకళాశాలలో నిర్వహిస్తున్న శిల్పాల ప్రదర్శన, అమ్మకాలు ముగిసాయి. ఫిబ్రవరి 26 నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించారు. శిల్పకళాశాల విద్యార్థులు రూపొందించిన దేవాలయ విమానాలు, మండపాలు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, దారుశిల్పాలు, పంచలోహ శిల్పాలు, సంప్రదాయ వర్ణచిత్రాలు, సంప్రదాయ కలంకారి వర్ణచిత్రాలను ప్రదర్శించడంతోపాటు విక్రయానికి ఉంచారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ప్రదర్శనను సందర్శించారు. ఆరు రోజుల్లో మొత్తం 10,157 మంది ఈ ప్రదర్శనను సందర్శించి విద్యార్థులు తయారుచేసిన పలు కళాకృతులను విరివిగా కొనుగోలు చేశారని అధికారులు వివరించారు.
తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ