ALL NEWS

 

1.పార్లమెంటు సాక్షిగా పచ్చిఅబద్ధాలు
` బరితెగించిన పియూష్‌ గోయల్‌
` మంత్రి నిరంజన్‌రెడ్డి ఫైర్‌
` ధాన్యం కొనుగోళ్లపై అవే పాత అబద్దాలు
` భిన్న పరిస్థితులున్న రాష్ట్రాలకు ఒకే నిబంధనలు విధించి..సమానత్వం అని పేరు పెట్టడం మూర్ఖత్వం
` కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికం ..
` మోడీ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు... మరి ఇది కూడా బెదిరింపేనా?
` కేంద్రం కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగవిరుద్ధమన్న మంత్రి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి పియూష్‌గోయల్‌ పచ్బిఅబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటిలాగే అబద్ధాలను వల్లెవేస్తున్నారన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని పార్లమెంటు సాక్షిగా చెప్పడం అప్రజాస్వామికం. మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు యూపీఎ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మరి నాడు మోడీ చేసింది బెదిరింపేనా?కేంద్రం కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగవిరుద్దం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్‌ గోయల్‌కు పదవిలో ఉండే అర్హత ఉందా? రైతులకు వెంటనే సమాధానం చెప్పాలికేంద్రం రాసుకున్న ఫార్మాట్‌లో రాష్ట్రాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకుని బాయిల్డ్‌రైస్‌ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గం.తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్‌రైస్‌కు అనుకూలంగా ఉన్న ధాన్యం మాత్రమే పండుతాయి. ఇది కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఉన్న ప్రత్యేక పరిస్థితి.రారైస్‌ చేస్తే వచ్చే నష్టాన్ని కేంద్రం ఎందుకు భరించదు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడదు ? పార్లమెంటు సాక్షిగా దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు ? నేరుగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసి దానిని రారైస్‌గా చేసుకుంటారో? బాయిల్‌ చేసుకుంటారో? వారి ఇష్టం.అన్ని రాష్ట్రాలకూ ఒకే గైడ్‌ లైన్స్‌ అని పీయూష్‌ గోయల్‌ చెప్పడం విడ్డూరం.భిన్న పరిస్థితులున్న రాష్ట్రాలకు ఒకే నిబంధనలు విధించామని, దానికి సమానత్వం అని పేరు పెట్టడం మూర్ఖత్వం ఈ విషయాన్ని వదిలేసి కేంద్రం మొండిగా తెలంగాణలో రారైస్‌ అనే పేరుతో తెలంగాణ వరిధాన్యం కొనం అని పరోక్షంగా చెప్పడం దారుణం.ధాన్యం కొనుగోళ్లపై ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యలు అవివేకం.అయిదేళ్లు పౌరసరఫరాల మంత్రిగా పనిచేసిన వ్యక్తి, కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు తెలిసిన వ్యక్తి ఇలా మాట్లాడడం బాధాకరం, బాధ్యతారాహిత్యం.తెలంగాణ రైతుల గురించి కేంద్రాన్ని ఒప్పించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనడం సిగ్గుచేటు.బీజేపీలో చేరగానే ఆ పార్టీ అధిష్టానం నాయకుల మెదళ్లలో ఉన్న చిప్‌ను మార్చేస్తుందా?.సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు రైతులకు కేసీఆర్‌ ఇచ్చారు.కేసీఆర్‌ సహకారంతో రైతులు పంటలు పండిస్తే వాటిని కొనాల్సిన బాధ్యత కేంద్రానిది.తెలంగాణ వచ్చినప్పుడు సాగులో ఉన్నది కోటి 30 లక్షల ఎకరాలు.పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం రాకతో 2 కోట్ల 15 లక్షల ఎకరాలు సాగవుతున్నది కనిపించడం లేదా ? కళ్లు మూసుకున్నారా? కొత్తగా 85 లక్షల ఎకరాల సాగు నిజం కాదా? పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్‌తో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలు పూర్తయితే ఇది మరింత పెరుగుతుంది.తెలంగాణ వచ్చినప్పుడు వరి ధాన్యం దిగుబడి 68 లక్షల మెట్రిక్‌ టన్నులు నేడు దాదాపు మూడు కోట్ల మెట్రిక్‌ టన్నులు ఇది వాస్తవం కాదా? గత ఏడాది ఎఫ్‌సీఐ తెలంగాణ నుంచి 92 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించింది వాస్తవం కాదా? దేశంలో 53 శాతం తెలంగాణ నుండే సేకరించింది నిజం కాదా? ఈ విషయం ఎఫ్‌సీఐ స్వయంగా వెల్లడిరచింది వాస్తవం కాదా?రైతులు వరే సాగు చేయాలి. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేసీఆర్‌తో విూకు సంబంధం లేదు అని బీజేపీ పార్టీలోని అల్పుడొకరు బీరాలు పలికాడు. ఈ విషయం బీజేపీ నాయకులకు తెలియదా ? ఆ భీరాలు పలికిన నేత ఏ కలుగులో దాక్కున్నాడు ? నరం లేని నాలుకలతో రోజుకు, పూటకు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.తెలంగాణ ప్రజాప్రతినిధులుగా ఉన్న బీజేపీ నేతలు ఈ ప్రాంత రైతుల కోసం కేంద్రం ద్వారా విూరు చేసింది ఏంటి ?కాళేశ్వరానికి జాతీయ హోదా తేలేదు... రాష్ట్రంలో అభివృద్ది పనులకు ప్రత్యేక నిధులు తీసుకురాలేదు .. రాష్ట్రానికి రావాల్సిన నిధులే కేంద్రం ఇయ్యకుండా ఇబ్బంది పెడుతుంటే కనీసం అడిగిన పాపాన పోలేదు.పసుపు బోర్డు తెస్తామని ఎన్నికల్లో గెలిచి అదీ తేలేదు.అసలు తెలంగాణ బీజేపీ నాయకులు ఈ ప్రాంత రైతులకోసం, తెలంగాణ అభివృద్ది కోసం ఏం చేశారు ?అధిష్టానం ఇచ్చిన స్క్రిప్టును గంగిరెద్దుల్లా తలఊపుతూ చదువుతున్నా రు .. తెలంగాణ రైతుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.పంటల వైవిద్యీకరణలో భాగంగా రైతులను ఆ వైపు ప్రోత్సాహించాలని కేంద్రం చెబుతుంది. రాష్ట్రం ఆ దిశగా ప్రోత్సహిస్తూ చర్యలు తీసుకుంటుంటే ఇక్కడి బీజేపీ నేతలు రైతులను వరి వేయాలని రెచ్చగొడతారు ?ఎవరు రైతులకు మేలు చేస్తున్నది ? ఎవరు రైతుల జీవితాలతో రాజకీయం చేస్తున్నది ? ప్రజలు గమనిస్తున్నారురెండు సార్లు ఎన్నికల మేనిఫెస్టోలో 60 ఏండ్లు పైబడిన అందరు రైతులకు ఫించన్‌ ఇస్తామని మోసం చేసిన పార్టీ బీజేపీ2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్న వాగ్దానాలను మరుగున పడేశారు. నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి 13 నెలలు రైతులను గోసపెట్టి, దాదాపు 700 మంది రైతుల ఉసురు పోసుకుని ఆఖరుకు జాతికి క్షమాపణ చెప్పిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. విూరా రైతుల గురించి, రైతుల పట్ల బాద్యత గురించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెప్పేదిబీజేపీ బడా కార్పోరేట్ల, బడా వ్యాపారుల పార్టీ. రైతులు, పేద ప్రజలు ఎన్నడూ బీజేపీ ఎజెండాలో లేరు ... ఇది దేశానికంతా అర్ధమయిందిబీజేపీని సాగనంపితే తప్ప ఈ దేశంలో రైతులు బాగుపడరు ఇప్పుడు తెలంగాణ రైతులకు అర్ధమవుతుంది .. రేపు దేశ రైతాంగానికి అర్దమవుతుంది.. కేసీఆర్‌ దానికి నడుం బిగిస్తున్నారు’’ అని అన్నారు.

 

 

2.రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు
` హాజరైన రాజకీయ ప్రముఖులు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని.. ఆ వెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజ్భవన్లో వేడుకలకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు గైర్హాజరయ్యారు. ఉగాది వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్రావు, ఈటల రాజేందర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, చాడ వెంకట్రెడ్డి వేడుకలకు హాజరయ్యారు.

 

3.ఎంజీఎం ఘటనపై సర్కారు సీరియస్‌
` బాధ్యులపై కఠిన చర్యలు
హనుమకొండ,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్‌ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. ఐసీయూలో ఎలుకలు కరవడం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. ఆస్పత్రులను మెరుగు పరుస్తున్నామని.. ఇలాంటి లోపాలు ఉండటం కూడా సరికాదని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రిగా ఎంజీఎం ఆస్పత్రిలో సౌకర్యాలపై వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌ రెడ్డితో కలిసి ఇవాళ మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. రోగిని ఎలుక కరిచిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులను మంత్రి పరారమర్శించారు.‘‘ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా లోపం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. ఘటన జరిగిన తర్వాత విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారని.. ఆస్పత్రిలో పరిశుభ్రత సరిగా లేదనే విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటన్నింటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. కొవిడ్‌ సమయంలో ఎంజీఎం ఆస్పత్రి పెద్ద ఎత్తున సేవలు అందించింది. వైద్యులు, సిబ్బంది అందరూ బాగా పనిచేశారు. నేను ప్రత్యేకంగా ఎవరినీ ఏవిూ అనడం లేదు. కానీ, ఈ ఘటన పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ని బదిలీ చేయడంతో పాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేశాం. బాధితుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో మాట్లాడాను. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ నిమ్స్కి తరలిస్తామని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు’’ అని మంత్రి వివరించారు.

 

 

4.పేద రోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): పేద రోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఎంజీఎం ఘటనపై విమర్శలు గుప్పించిన ఆయన.... కేసీఆర్‌ కిట్‌ పేరుతో గొప్పలు చెప్పుకోవడం ఆపాలని తెలిపారు. ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలను అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించాలని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి సూచించారు.

 

5.రాజకీయ నాయకులు కాదు...(కిక్క
పోలీసులు ప్రజల విశ్వాసం పొందాలి
` దర్యాప్తు సంస్థలన్నీ ఒకే పరిధిలోకి తేవాలి
` ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు
` డి.పి.కోహ్లీ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీజేఐ ఎన్‌.వి.రమణ
దిల్లీ,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):పోలీసు విధి నిర్వహణ కత్తివిూద సాములాంటిదని.. పోలీసు అధికారాలను రాజకీయ నాయకులు దుర్వినియోగం చేయడం ఎప్పటినుంచో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డి.పి.కోహ్లీ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్లో ‘‘ప్రజాస్వామ్యం ` దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు’’ అంశంపై జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రసంగించారు. పోలీసుల జీవితాలపై ప్రముఖ కవి రావి శాస్త్రి రచనను సీజేఐ ఉటంకించారు. పోలీసు ఉద్యోగం ఎంత సవాళ్లతో కూడుకున్నదో రావిశాస్త్రి తన రచనల్లో కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అంతర్భాగమని సీజేఐ పేర్కొన్నారు.‘‘ఇది 75 ఏళ్ల స్వతంత్ర భారత సందర్భం. భారతీయులందరం మన స్వేచ్ఛను మనం ప్రేమిస్తాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం చెప్పిన ప్రజాస్వామ్య విధానం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదు. నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రజల నమ్మకాన్ని చూరగొనడమే పోలీసుల తక్షణ కర్తవ్యం. ఆరంభ దశల్లో సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. నిష్పాక్షికత, స్వతంత్రత విషయంలో సీబీఐ ప్రతీకగా నిలిచేది. న్యాయం కోసం బాధితులు సీబీఐ వైపే చూసేవారు. కాలక్రమంలో తన చర్యల ద్వారా సీబీఐ చర్చల్లో నిలిచింది. విలువలు, నైతికతకు కట్టుబడి ఉంటే ఎవరూ మిమ్మల్ని అడ్డగించలేరు. మంచి నాయకుడు ఉంటే ఆ సంస్థకు మంచి పేరు తీసుకురావచ్చు’’‘‘ప్రస్తుతం సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటుంది. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం. ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలి. ప్రాసిక్యూషన్‌, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలి. శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశం. చాలా వరకు నేర విచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుంది. విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనకబడుతున్నారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరం. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడాలి. అందుకోసం పోలీసుల శిక్షణ తీరులో మార్పు రావాలి. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. దర్యాప్తు సంస్థలే శాశ్వతం’’ అని సీజేఐ పేర్కొన్నారు.

 

6.అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి
` రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్‌’ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతికాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సీఎం అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, వ్యవసాయం బాగుంటెనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడడంలో ముందున్నదన్నారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామనీ, ‘శుభకృత్‌ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

 

7.మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం
` తమ సదస్సులో ప్రసగించాలని మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆహ్వానం
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. తమ సదస్సులో ప్రసంగించాలని అమెరికాకు చెందిన మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. లాస్‌ ఏంజిల్స్‌లో మే 1 నుంచి 4వ తేదీ వరకు మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌ 25వ వార్షిక సదస్సు జరగనుంది. సెలబ్రేటింగ్‌ ద పవర్‌ ఆఫ్‌ కనెక్షన్‌ పేరుతో సదస్సును నిర్వహించనున్నారు.ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించినందుకు మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత ప్రపంచ ప్రముఖులకు కలిసేందుకు ఇది మంచి వేదిక అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

8.భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర..
` ఒకేసారి రూ.273.5 వడ్డింపు
` ఇది ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ అయితే బాగుండేదని కేటీఆర్‌ ఎద్దెవా
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):చమురు ధరల మోత ఇప్పట్లో ఆగేలా లేదు. నిన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్‌ కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.2460కి చేరింది.ఇక దేశరాజధాని న్యూఢల్లీిలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. దీంతో రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తున్నది. కాగా, గతనెల 1న 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.105 మేర పెంచిన విషయం తెలిసిందే.కాగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గృహ వినియోగ సిలిండర్‌ ధరలను పెంచిన సమయంలోనూ కేటీఆర్‌ కేంద్రాన్ని తప్పుపడుతూ ట్వీట్‌ చేశారు.తాజాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధరల పెంపుపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని కేటీఆర్‌ ఎద్దెవా చేశారు.

9.మనకలలను పిల్లలపై బలవంతంగా రుద్దొద్దు
` ‘పరీక్షా పే చర్చా’.. కార్యక్రమంలో విద్యార్థులకు మోదీ సలహాలు
దిల్లీ,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలలను, కోరికలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని, పిల్లల ఆసక్తులేంటో అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. పరీక్షలపై విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ప్రధాని మోదీ నేడు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేసి వారిలో మనోధైర్యం నింపారు. మోదీ మాట్లాడుతూ‘‘ పరీక్షల సమయంలో పండగలను ఎంజాయ్‌ చేయలేం. కానీ, పరీక్షలను పండగలా భావిస్తే ఆనందంగా రాయగలం.ఎందుకు భయపడుతున్నారు?.. సముద్రమంతా ఈదుకుంటూ వచ్చిన విూరు చివరి క్షణంలో ఒడ్డున మునిగిపోతామని ఎందుకు భయపడుతున్నారు? విూరు పరీక్ష రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో విూరు ఎన్నో పరీక్షలను విజయవంతంగా పాసయ్యారు. ఒత్తిడికి గురికావొద్దు.అతి భయం, అతి నమ్మకం వద్దు.. అది మనల్ని మరింత కంగారుకు గురిచేస్తుంది.ఆన్లైన్లో జ్ఞానం సంపాదించి.. ఆఫ్లైన్లో దాన్ని ఆచరణలో పెట్టండి.విూతో విూరు సమయం గడపండి. ఈ సమయంలో ఆన్లైన్‌, ఆఫ్లైన్‌ కంటే కూడా ఇన్నర్లైన్లో ఉండటం చాలా అవసరం.టెక్నాలజీ మనకు శాపం కాదు. దాన్ని మనం సమర్థంగా ఉపయోగించుకోవాలి. నైపుణ్యాలు పెంచుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం.పిల్లలు చాలా ప్రత్యేకం. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేక టాలెంట్‌ ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలి. అంతేగానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలల్ని వారిపై బలవంతంగా రుద్దొద్దు.పోటీని చూసి ఎప్పుడూ భయపడొద్దు. పోటీ ఎక్కువగా ఉందంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లే. అందువల్ల ఫలితాల కోసం చూడకుండా పోటీల్లో పాల్గొంటూ ఉండాలి.మనలో స్ఫూర్తి నింపేందుకు ఎలాంటి ఇంజెక్షన్‌ ఉండదు. మనలోని ఆత్మన్యూనతను దూరం చేసుకుని ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందుతూ ఉండాలి.

 

11.రక్షణరంగంలో భారత్‌కు సహకారమందిస్తాం
` రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్‌
దిల్లీ,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):రక్షణ రంగంలో భారత్‌కు పరస్పర సహకారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్‌ అన్నారు. రష్యా నుంచి భారత్‌ ఏం కొనాలనుకున్నా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం కేంద్ర విదేశాంగ మంత్రి జై.శంకర్తో భేటీ అయి.. ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. అనంతరం విూడియాతో మాట్లాడారు.‘‘భారత్‌, రష్యా మధ్య దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. భారత విదేశాల విధానాలు స్వతంత్రమైనవి. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని రష్యా విశ్వసిస్తోంది. రష్యా సమాఖ్య కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. అందుకే ఈ రెండు దేశాలు అనేక అంశాల్లో వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. రక్షణ రంగంలో భారత్కు మా సహకారం కొనసాగిస్తాం. రష్యా నుంచి భారత్‌ ఎలాంటి ఉత్పత్తులు కొనుగోలు చేయాలన్నా వాటిపై చర్చించి, సరఫరా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ముడి చమురు కొనుగోలు అంశంపై లవ్రోస్‌ పరోక్షంగా స్పందించారు.ఈ సందర్భంగా అమెరికా ఆంక్షలపైన లవ్రోస్‌ మాట్లాడారు. ‘‘భారత్‌`రష్యా భాగస్వామ్యంపై ఎవరి ఒత్తిడి ప్రభావం చూపించదు. వారు(అమెరికాను ఉద్దేశిస్తూ) తమ రాజకీయాలను అనుసరించమని ఇతరులను బలవంత పెడుతున్నారు’’ అని విమర్శించారు.ఇక ఉక్రెయిన్పై దండయాత్ర గురించి స్పందిస్తూ.. ‘‘అది యుద్ధం కాదు. ఒక ప్రత్యేక ఆపరేషన్‌ మాత్రమే. రష్యాకు కీవ్‌ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూసుకోవడమే మా ప్రధాన లక్ష్యం. త్వరలోనే ఉక్రెయిన్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.కాగా పర్యటనలో భాగంగా సెర్గీ లవ్రోస్‌ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ భేటీ కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పంపిన సందేశాన్ని వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటున్నట్లు లవ్రోస్‌ తెలిపారు. ‘‘పుతిన్‌, మోదీ నిరంతరం టచ్లోనే ఉంటారు. నేను నా చర్చల గురించి పుతిన్కు నివేదిస్తాను. పుతిన్‌ పంపిన వ్యక్తిగత సందేశాన్ని ప్రధాని మోదీకి చెప్పే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్పై రష్యా సాగిస్తోన్న దండయాత్ర విషయంలో భారత్‌ అవలంబిస్తోన్న తటస్థ వైఖరిపై అమెరికా వంటి దేశాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో సెర్గీ లవ్రోస్‌ దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షలతో సతమతమవుతోన్న రష్యా తమ చమురు ఎగుమతులను పెంచుకునేందుకు భారత్కు డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా లవ్రోస్‌ జైశంకర్‌ భేటీలోనూ ఈ చౌక చమురు సరఫరాపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

 

12.అవసరమైతే నూకలు తింటాం..
భాజపాను గద్దె దించుతాం: హరీశ్‌రావు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):యాసంగి ధాన్యం వ్యవహారం కొలిక్కిరావడం లేదు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తుండగా... కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇదే అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్రమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దేశంలో ఒకేరకమైన పరిస్థితులు ఉండవని, ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకలు తినాలని చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. అవసరమైతే నూకలు తింటామన్న హరీశ్రావు.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. తెలంగాణ సమాజం అవమానాన్ని సహించదని స్పష్టం చేశారు.‘‘రైతుల పక్షాన ధాన్యం కొనండి అని అడగడం దవ్కిూ కాదు.. డిమాండ్‌ చేయడం అవుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం అవుతుంది తప్ప అది.. దవ్కిూ కానే కాదు పీయూష్‌ గోయల్‌ గారూ! దవ్కిూల సంస్కృతి విూది. ఆ అలవాటు విూకుంది. పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు... దవ్కిూలిచ్చే సంస్కృతి భాజపాది. మా రైతుల పక్షాన అడిగాం తప్ప... మేమెక్కడా దవ్కిూలు ఇచ్చిన పరిస్థితి లేదు. నూకలు తినమని విూరు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులు మర్చిపోలేదు. అన్నం తినో.. అటుకులు బుక్కో.. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. నూకలు తినమంటారా? అవసరమైతే నూకలు తింటాం.. మిమ్మల్ని గద్దె దించి తీరుతారు మా తెలంగాణ రైతులు. తెలంగాణ సమాజం దేన్నయినా సహిస్తది కానీ, అవమానాన్ని సహించదు.ఆనాడు తెలంగాణ ప్రజలను సమైక్య పాలకులు ఎట్లా అవమానపర్చారో.. ఇవాళ భాజపా నాయకులు పీయూష్‌ గోయల్‌ కూడా తెలంగాణ రైతాంగాన్ని, 70లక్షల మంది రైతులను అవమాన పరుస్తున్నారు. వక్రీకరిస్తున్నది విూరు.. వక్రీకరించి తెలంగాణ ప్రజల్ని అవమాన పరుస్తున్నది విూరు. ఏం మాట్లాడుతున్నారు పీయూష్‌ గోయల్‌ గారు.. డబ్ల్యూటీఓ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయట. అవేవో 1995లో చేశారు అని చెబుతున్నారు... మరి ఎనిమిదేళ్ల నుంచి విూరేం చేస్తున్నారు. డబ్ల్యూటీఓ ఒప్పందాలను మార్చగలిగే శక్తి రైతులకు ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ప్రధాన మంత్రి ప్రపంచమంతా తిరిగారు కదా..! దేశ రైతుల ప్రయోజనాల కోసం డబ్ల్యూటీఓ ఒప్పందాలను మార్చండి. ఒప్పించండి.. మెప్పించండి.. రైతుల ప్రయోజనాలు కాపాడండి. రైతుల హక్కులు కాపాడండి’’ అని హరీశ్రావు డిమాండ్‌ చేశారు.