all news

 

1.అడ్డంకులెన్నొచ్చినా రైతులను కాపాడుకుంటాం
` కేంద్రానికి రైతు వ్యతిరేక విధానాలు
` కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తోంది.
` రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తవుతాయి
` ‘దళితబంధు’తో ఏడాదికి 2లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం
` ప్రగతిభవన్‌లో వ్యవసాయ రంగంపై ఉన్నత స్థాయి సవిూక్షలో సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తిరోగమన విధానాలు అవలంబిస్తోందని.. రైతులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరుస్తోందని సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటల దిగుబడి పెంచే చర్యలు తీసుకోవడం లేదని.. పంట ఉత్పత్తి తగ్గించే అపసవ్య విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయ రంగంపై ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించిన కేసీఆర్‌.. యాసంగి వరి ధాన్యం సేకరణ, ఏర్పాట్ల తీరుపై సవిూక్షించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.’’ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రం సాగురంగాన్ని అభివృద్ధి చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కార్యాచరణను పటిష్టంగా అమలు చేస్తాం. పత్తి, మిర్చి, కంది, ఇతర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. జిల్లా స్థాయిలో వ్యవసాయ అధికారులు విస్తృతంగా పర్యటించాలి. ఏఈవోలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవాలి. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ వ్యవసాయం గొప్పగా పురోగమిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తోంది. రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తవుతాయి’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.దళితబంధు పథకం అమలును వేగవంతం చేయాలని.. అర్హులైన వారికి మరింత త్వరగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25వేల మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు అందించినట్లు సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నివేదించారు. దళితబంధు కోసం ముందస్తుగానే నిధులు విడుదల చేసినందున గుర్తించిన అర్హులకు నిధులు అందించడంలో ఎలాంటి జాప్యం జరగరాదని చెప్పారు. పథకాన్ని మరింత ప్రభావవంతంగా, వేగంగా అమలు చేసేందుకు త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు.’’దళితబంధు అమలవుతున్న తీరు పట్ల దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. పథకం అమలుతో అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాలు అందుతాయి. దళితబంధు కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జిస్తుంది. సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగం కంటే గొప్పగా స్పిల్‌ ఎకానవిూకి దోహదపడుతుంది. వ్యాపార, వాణిజ్యాల ద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్డీపీని పెంచడంలో దోహదపడుతుంది. ఇప్పటికే దళితబంధు ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం. ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడే దళిత యువతలో ఉన్న నిరాశ తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంది. వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. వైద్యారోగ్య శాఖ, ఎరువుల దుకాణాలు.. ఇలా ప్రభుత్వం లైసెన్స్‌లు ఇస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలి’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు.

సచివాలయ నిర్మాణాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సెక్రటేరియట్‌ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకశంగా, సూక్ష్మంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్‌ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లర్స్‌, కాంక్రీట్‌ వాల్స్‌, స్టెయిర్‌ కేస్‌, డోర్స్‌, విండోస్‌ డిజైన్లను, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. మంత్రుల ఛాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వీటిలోకి వెంటిలేషన్‌ బాగానే వస్తున్నదని సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీ గురించి ఆరా తీశారు. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన రెడ్‌ స్టోన్‌ వాల్‌ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్‌ సప్లయ్‌ గురించి వివరాలు తెలుసుకున్నారు. స్టోన్‌ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. కాంపౌండ్‌ గ్రిల్‌ మోడల్స్‌ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. సెక్యూరిటీ స్టాఫ్‌, సర్వీస్‌ స్టాఫ్‌ అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెక్రటేరియట్‌ భవన పరిసరాల్లో ఓపెన్‌ గ్రౌండ్‌ ఫిల్లింగ్‌ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్‌, ఫౌంటేన్స్‌ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. బిల్డింగ్‌ డిజైన్స్‌, కలర్స్‌, ఇంటీరియర్‌ సహా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని సీఎం ఆదేశించారు. సెక్రటేరియట్‌ నిర్మాణపనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట, ఆర్‌ అండ్‌ బీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, ప్రియాంక వర్గీస్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిర్మాణ సంస్థ షాపూర్‌ జీ పల్లోంజీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

 

2.చిన్నరైతులే పాడిపరిశ్రమకు పెద్దదిక్కు
` సన్నకారు రైతుల బాధ్యతను గుర్తించి ఆదుకుంటున్నా
` గుజరాత్‌ పర్యటనలో ప్రధాని మోడీ
` డెయిరీ కాంప్లెక్స్‌ అండ్‌ పొటాటో ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ప్రారంభం
అహ్మదాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్‌ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్‌.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్‌లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్‌ ఉత్పత్తి చేస్తుందని వెల్లడిరచారు. గుజరాత్‌ రాష్ట్రం బనాస్కాంత జిల్లాలోని డియోదర్‌ లో మంగళవారం ’డెయిరీ కాంప్లెక్స్‌ అండ్‌ పొటాటో ప్రాసెసింగ్‌ ప్లాంట్‌’ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్లాంట్‌ ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న రైతులే.. పాడి పరిశ్రమ అతిపెద్ద లబ్దిదారులని అన్నారు. సహకార డెయిరీ.. చిన్న రైతులను, మహిళలను, గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. బనాస్‌ డెయిరీ ఆసియాలోని ప్రముఖ పాల ఉత్పత్తి తయారీ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సన్నకారు రైతులకు అండగా ఉంటుందని ప్రధాని హావిూ ఇచ్చారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్న సన్నకారు రైతుల బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. అందుకే సంవత్సరానికి రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో పాలు, ఆలుగడ్డ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిందన్న ఆయన... ఈ ప్లాంట్‌ ద్వారా లక్షల టన్నుల పాలు, పొటాటో ఉత్పత్తులు తయారవుతాయన్నారు. దీంతో ప్రజల ఆహారావసరాలు కొంతమేరకైనా తీరనున్నట్లు మోడీ పేర్కొన్నారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ డెయిరీలో రోజుకు 30 లక్షల లీటర్ల పాలు, సుమారు 80 టన్నుల వెన్న, లక్ష టన్నుల ఐస్‌?క్రీం తయారవుతుంది. 20 టన్నుల కోవా, ఆరు టన్నుల చాక్లెట్‌ ఉత్పత్తి అవుతుంది.అక్కడి మహిళలు తమ పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమతో పశువులను చూసుకుంటున్నారని మోదీ ప్రశంసించారు. ఇక్కడ పొటాటో చిప్స్‌, ఆలూ టిక్కీ, ప్యాటీస్‌ మొదలైన ఉత్పత్తులు తయారవుతాయి. వీటిలో చాలా వరకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి.

 

 

3.విద్వేషాలు రెచ్చగొట్టారో జాగ్రత్త!
` మతం పేరిట చిచ్చు పెడితే ఉక్కుపాదంతో అణచివేస్తాం
` శాంతిభద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లే
` విధ్వంసకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే
` రూ.495 కోట్లతో పాతబస్తీలో పలు అభివృద్ది పనులకు కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కులం, మతం పేరు విూద రాజకీయం చేసే విధ్వంసకర శక్తులను, చిల్లరమల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ సూచించారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోనే కాదు, రాష్ట్రంలో కూడా మతం పేరిట రాజకీయాలు చేయలేదన్నారు. పనికిమాలిన పంచాయతీలు లేవని కూడా స్పష్టం చేశారు. కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదు. ఆ చిచ్చులో చలిమంటలు కాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.. చేయబోమని తేల్చిచెప్పారు. కొన్నేండ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ఐదు నుంచి పది రోజుల పాటు కర్ఫ్యూ విధించేవారు. కానీ కేసీఆర్‌ నాయకత్వంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని తెలిపారు. మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఒకే ఒక్క రోజు రూ. 495 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఓల్డ్‌ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో మోజాంజాహీ మార్కెట్‌ను చూసి బాధపడేవాళ్లం. ఇప్పుడు మోజాం జాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేశామన్నారు. కులీకుత్‌బ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం. వారసత్వ సంపదను కాపాడుకుంటామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఏ ఎలక్షన్స్‌ లేవు. ఏ ఎన్నికలు లేకపోయినా..రూ. 495 కోట్లతో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామంటే.. పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం తాగునీరు, విద్యుత్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీలో అవసరమైన చోట రోడ్లను విస్తరిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోని పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కారిస్తామని కేటీఆర్‌ తెలిపారు. జీవో నం 58, 59 తెచ్చి లక్ష మందికి హైదరాబాద్‌లో పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నాం. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను పెంచుతున్నామని కేటీఆర్‌ తెలిపారు.రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి మహ్మూద్‌ అలీతో కలిసి మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. విూర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్‌ ట్రైన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు
పెంచినట్లు చెప్పారు. అలాగే రూ.108కోట్ల వ్యయంతో పూర్తి చేసిన బహదూర్‌పుర ఫ్లైల ఓవర్‌, రూ.35కోట్ల తో చార్మినార్‌ వద్ద ముర్గీచౌక్‌ పునరుద్ధరణ, రూ.30కోట్లతో సర్దార్‌ మహల్‌ అభివృద్ధి, రూ.297.30 కోట్లతో కార్వాన్‌ నియోజకవర్గంలో సీవరేజీ పనులకు శంకుస్థాపన చేసారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సంద్భంగా సర్దార్‌ మహల్‌ను అభివృద్ధి చేసుకుంటున్నా మన్నారు. రూ.109 కోట్లతో బహదూర్‌ పురా ల్‌ ఓవర్‌ను నిర్మాంచామని అన్నారు. మిరాలం చెరువు వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి శంకుస్థాపన, ట్రాన్స్ఫర్‌ స్టేషన్‌, కలెక్షన్‌ పాయింట్‌ను ప్రారంభించామని మంత్రి చెప్పారు. కొన్ని మెట్రో నగరాల్లో మంచి నీటి కష్టాలు ఉన్నాయని, కానీ మన దగ్గర మంచినీటికి, కరెంట్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

 

4.రెండో దశకు చేరిన రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం
` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
` తక్షణమే ఆయుధాలు వీడండి..
` ఉక్రెయిన్‌ సేనలకు రష్యా అల్టిమేటం
కీవ్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుందే తప్ప, తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విజయం సాధించలేకపోయిన పుతిన్‌ సేనలు..ఉక్రెయిన్‌ తూర్పు భాగంలోని డాన్‌బాస్‌పై దృష్టిసారించాయి. అక్కడ రెండో దశ యుద్ధం ప్రారంభమైందని, అది కూడా భారీస్థాయిలో ఉందని కీవ్‌ వర్గాలు వెల్లడిరచాయి.’రష్యన్‌ దళాలు డాన్‌బాస్‌ కోసం రెండోదశ యుద్ధాన్ని ప్రారంభించాయని ఇప్పుడు ధ్రువీకరిస్తున్నాం. దీనికోసం వారు చాలాకాలంగా సిద్ధం అవుతున్నారు. ఈ దురాక్రమణ నిమిత్తం భారీస్థాయిలో రష్యా సైనికులను ఇక్కడ మోహరించారు. ఇక్కడకు ఎంతమంది సైనికులు వచ్చారన్నదానితో సంబంధం లేకుండా.. మేం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మమ్మల్ని మేం రక్షించుకుంటాం’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ టెలిగ్రాంలో పోస్టు పెట్టారు.జెలెన్‌స్కీకి ముందు తూర్పు లుగాన్స్క్‌ ప్రాంత గవర్నర్‌ సెర్గీ గైడే కూడా రష్యా దాడి గురించి వెల్లడిరచారు. ‘ఇది నరకం. మేం వారాలుగా మాట్లాడుకుంటోన్న యుద్ధం ప్రారంభమైంది. రూబిజ్నే, పోపస్నాలో నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రశాంత నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది’ అని ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడిరచారు. కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్‌ సైనిక కాన్వాయ్‌ తర్వాత అక్కడ నుంచి ఉపసంహరించుకుంది. తర్వాత డాన్‌బాస్‌ ప్రాంతంపై తిరిగి దృష్టి సారించింది. ఆ ప్రాంతాన్ని 2014 నుంచి రష్యా అనుకూల వేర్పాటువాదులు పాక్షికంగా నియంత్రిస్తున్నారు.
బుచా దారుణాలకు పాల్పడిన బ్రిగేడ్‌కు పుతిన్‌ ప్రశంస..
బుచా పట్టణంలో రష్యా సైన్యం మారణహోమానికి పాల్పడినట్లు ఉక్రెయిన్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన దృశ్యాలను వెలుగులోకి తేగా.. ప్రపంచమంతా తీవ్ర ఆవేదనకు గురైంది. రష్యా సైన్యం ఆకృత్యాలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిరచింది. అయితే అక్కడ హింసాకాండకు పాల్పడిన బ్రిగేడ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నుంచి గౌరవం దక్కింది. మాతృభూమి, దేశ ప్రయోజనాలను రక్షించేందుకు పోరాటం చేశారంటూ ఆయన సంతకం చేసిన ఉత్తర్వును ఆ బ్రిగేడ్‌ అందుకుంది. అలాగే గార్డ్స్‌ అనే బిరుదును పొందింది.
తక్షణమే ఆయుధాలు వీడండి.. ఉక్రెయిన్‌ సేనలకు రష్యా అల్టిమేటం
సైనిక చర్య పేరుతో భీకర దాడులకు తెగబడుతున్న రష్యా సేనలకు ఉక్రెయిన్‌ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ నేపథ్యంలో మేరియుపొల్‌ ముట్టడికి చేరువైన రష్యా సేనలు.. తక్షణమే ఆయుధాలు వీడాలని ఉక్రెయిన్‌ సైన్యానికి అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా తాజా హెచ్చరిక చేసింది.’రష్యా సేనలపై ప్రతిఘటిస్తోన్న ఉక్రెయిన్‌ సైనికులను వెంటనే ఆ చర్యలను ఆపేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు అలాంటి అవివేకమైన ప్రతిఘటనకు గల కారణాలను తెలపాలని ఉక్రెయిన్‌ అధికారులకు మరోసారి సూచిస్తున్నాం. అందుకే సైనికులే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని తక్షణమే ఆయుధాలు వీడాలి’ అని రష్యా రక్షణశాఖ పిలుపునిచ్చింది. మేరియుపోల్‌ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం చేరువైన సమయంలో ప్రతిఘటించడం వల్ల ఉక్రెయిన్‌ సేనలు మరింత విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లేనని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడిన ప్రతిఒక్కరి ప్రాణాల రక్షణకు హావిూ ఇస్తున్నామంటూ రష్యా వెల్లడిరచింది.ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా బలగాలు తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టిసారించాయి. ఇదే సమయంలో తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు రెండో దశ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నామని ఉక్రెయిన్‌ పేర్కొంది. రష్యా సైనికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్ఘాటించింది. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్న రష్యా.. మేరియుపొల్‌లో ప్రతిఘటన ఆపకపోతే భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది.

 

5.సమాచార డైరెక్టర్‌గా బి. రాజమౌళి
సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్‌) గా బి. రాజమౌళి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంతో తనను డైరక్టర్‌గా నియమించినందుకు రాజమౌళి ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు
` జనంసాక్షి,హైదరాబాద్‌

 

6.నేను రబ్బర్‌ స్టాంపును కాదు
`గవర్నర్‌ తమిళిసై
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా సీఎంలు నియంతలుగా మారుతున్నారని, ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నా... ఇద్దరూ భిన్నమైనవారని గవర్నర్‌ అన్నారు. ఇది ప్రజాస్వాయ్యనికి మంచింది కాదని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా... ఆ పరిస్థితిని తాను కోరవటంలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు... అధికార పార్టీకి విరుద్ధమైన నిర్ణయాలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని
చెప్పారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను... వ్యక్తిగతంగా కించపర్చే విధంగా ప్రవర్తించటం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు గానూ అందరం కలిసి సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం చేసే అన్ని సిఫార్సులను గవర్నర్‌ ఆమోదించాలని లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్‌ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.ఏదైనా విభేదించగానే ప్రభుత్వం వివాదం చేయటం సరికాదని... అన్నింటినీ వ్యక్తిగత వ్యవహారాలకు ఆపాదించవద్దని గవర్నర్‌ చెప్పారు. ప్రోటోకాల్‌ పాటించకపోవడం సరికాదని పునరుద్ఘాటించారు. పరస్పర చర్చలు, అవగాహనతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ విందును బహిష్కరించాయని.. గవర్నర్‌ను ఒక పార్టీకి చెందిన వారిగా చూడటం సరికాదని అన్నారు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని... ఒకరు తమ అభిప్రాయం చెప్పగానే విమర్శించడం సరికాదని తమిళిసై తెలిపారు. నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వాలని ఆశించటంలేదు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను... నేను అహంకారం ఉన్న వ్యక్తిని కాను. శక్తిమంతమైన వ్యక్తినని. అన్ని విభేదాలు మర్చిపోయి ప్రజలకు సేవలందించేందుకు కలిసి పనిచేద్దాం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అధికార పార్టీకి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్నింటిని ఆమోదించాలని ఎక్కడాలేదు. అలాంటి పరిస్థితుల ప్రభావం మన సంబంధాలపై ఉండొద్దని కోరుతున్నాను. ఎంతో ఆప్యాయతో పంపిన ఆహ్వానాలను గౌరవించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విందులకు పిలిచినప్పుడు ఆహ్వానాలను బహిష్కరించటం అనేది అనవసర రాద్దాంతం. వ్యక్తిగత ఆహ్వానాలను రాజకీయాలతో ఆపాదించాల్సిన అవసరంలేదు. అన్ని విషయాలపై కూర్చుని చర్చించుకుని.... ప్రజా సంక్షేమం కోసం పాటుపడదామని కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహపూర్వకమైన వ్యక్తి కాదని నేను చెప్పటంలేదు. కానీ... ఆయనతో విభేదాలు ఉన్న మాట మాత్రం వాస్తవం. నేను ఆ విభేదాలను కోరుకోవటంలేదు. మొదట్లో నేను చంద్రశేఖర్‌రావును కలిసినప్పుడు ప్రతిపాదించిన ఆయుష్మాన్‌భారత్‌ను ఆయన అంగీకరించారు. మా పరస్పర చర్చల ఫలితంగా ప్రజలకు సైతం మేలు జరిగింది. ఇప్పుడు కూడా ఆయనను ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి విభేదాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం అని అన్నారు.

 

7.30 శాతం మందిలో లాంగ్‌కోవిడ్‌ లక్షణాలు
అమెరికా అధ్యయనంలో వెల్లడి
లాస్‌ ఏంజెల్స్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి): కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్‌ (ఒనీనిణ అనీలతిట) వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది.ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన నుంచి నెలల తరబడి వారిని కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయని తెలిపింది. కొవిడ్‌ సోకిన అనంతర ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రి పాలైన వారితోపాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్‌ అక్యూట్‌ సీక్వెలే ఆఫ్‌ కొవిడ్‌ (ఖరూఅ)గా పిలిచే ‘లాంగ్‌ కొవిడ్‌’ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ (ఙఅఒం) పరిశోధకులు వెల్లడిరచారు. దీర్ఘకాల కొవిడ్‌పై 309 మంది బాధితులపై అధ్యయనం చేపట్టగా.. కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారిలో అధికశాతం అలసట (31శాతం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (15శాతం) వంటి లక్షణాలతో బాధపడినట్లు గుర్తించారు. ఇక వాసన గుర్తించకపోయే లక్షణం 16శాతం మందిలో కనిపించిందన్నారు.కొవిడ్‌ తదనంతర ప్రభావాలను తెలుసుకోవడంలో భాగంగా అమెరికా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో మొత్తం 1038 మంది కొవిడ్‌ బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 309 మందిలో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలంపాటు వేధిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిపై దీర్ఘకాలంలో కొవిడ్‌ ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న విషయాలను తెలుసుకోవడంలో తాజా అధ్యయనం దోహదపడుతుందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన యూసీఎల్‌ఏ ప్రొఫెసర్‌ సస్‌ యూ పేర్కొన్నారు.

 

8.సైన్యంలో సైబర్‌ సెక్యురిటీ కలకలం..
` వాట్సాప్‌ వేదికగా దేశ సైన్యంలో సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘన..!
దిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):భారత నిఘా వర్గాలు మంగళవారం ఆందోళనకర విషయాన్ని గుర్తించాయి. దేశ సైన్యంలో సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు వెల్లడిరచాయి.సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగిఉన్నట్లు పేర్కొన్నాయి.’కొంతమంది సైనికాధికారుల ప్రమేయం ఉన్న సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనను నిఘా వర్గాలు, సైన్యం గుర్తించాయి. ఇది పొరుగుదేశాల గూఢచర్య కార్యకలాపాలతో ముడిపడి ఉండొచ్చు. వాట్సాప్‌ గ్రూప్‌ల వేదికగా ఈ ఉల్లంఘన జరిగింది’ అని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడిరచాయి. దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించామని, దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు తప్పవని పేర్కొన్నాయి. కేసు సున్నితత్వం కారణంగా మరిన్ని వివరాలు వెల్లడిరచేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే ఎటువంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని అభ్యర్థించారు.ఇటీవల కాలంలో మన సైన్యం కార్యకలాపాలను తెలుసుకునేందుకు అనుమానిత పాక్‌, చైనా నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం మన అధికారుల నుంచి సున్నిత సమాచారాన్ని పొందేందుకు సోషల్‌ విూడియాను వేదిక చేసుకుంటున్నాయి. శత్రు దేశాల ప్రయత్నాలు చాలా వరకు విఫలమైనప్పటికీ.. వీరి ఉచ్చులో పడిన కొందరు అధికారుల నుంచి కొంత సమాచారం పొందినట్లు తెలుస్తోంది. ఈ తరహా కేసుల్ని అరికట్టేందుకు సోషల్‌ విూడియాను ఉపయోగిస్తున్నప్పుడు మార్గదర్శకాలను అనుసరించాలని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు.

 

9.శ్రీలంకలో ఆందోళనలు ఉద్రికత్తం
` నిరసనకారులపై పేలిన తూటా!
` పోలీస్‌ కాల్పుల్లో ఒకరి మృతి.. 24మందికి గాయాలు
కొలంబో,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు బహిరంగ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. అయితే, నిరసనకారులు రాంబుక్కనలో రైల్వే ట్రాక్ను బ్లాక్‌ చేశారనీ.. తమపై రాళ్లు రువ్వారని పోలీసులు పేర్కొంటున్నారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే బహిరంగ కాల్పులు జరిపామనీ.. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టు పోలీస్‌ అధికార ప్రతినిధి నిహాల్‌ తాల్డువా వెల్లడిరచారు. గాయపడిన వారిని సవిూపంలోని కేగల్లె ఆస్పత్రిలో చేర్పించగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో 8మంది పోలీసులకు కూడా గాయాలైనట్టు పేర్కొన్నారు.శ్రీలంకలో ఇంధన ధరలూ భగ్గుమంటున్నాయి. ఈ ద్వీప దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం శ్రీలంక రూ.338కు చేరింది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ (ఎల్‌ఐఓసీ) పెట్రోల్‌ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీ) కూడా సోమవారం అర్ధరాత్రి ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధరను రూ.84 మేర పెంచేయడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.338కి చేరింది. శ్రీలంకలో గత ఆరు నెలల కాలంలో ఎల్‌ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా.. సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు తాజాగా పెంచిన ధరలు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి.మరోవైపు, శ్రీలంకలో గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. పలు చోట్ల రహదారులను బ్లాక్‌ చేసి వాహనాలు, టైర్లకు నిప్పంటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

 

 

10.భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత
` రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రపంచ నీటి దినోత్సవాలను పురస్కరించుకొని జల మండలి ,గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టన్‌ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని వ్యవసాయ శాఖ మంత్రి క్యాంప్‌ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ అపర భగీరథుడు మన ముఖ్య మంత్రి కె.సి.ఆర్‌ రాష్ట్ర ప్రజలు సాగు నీటి కై, త్రాగు నీటి కొరకై ఎలాంటి ఇక్కట్లకు లోను కాకుండా ఉండేవిధంగా పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. మూడేళ్లలో ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి 70 శాతం పూర్తయింది. ఏడేళ్లలో తెలంగాణ కోటి ఎకరాలకు సాగు నీటిని అందిస్తూ దేశంలోనే వ్యవసాయ రంగం లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి తెలంగాణ కీర్తిని ఇనుమడిరపజేశారు. రైతన్నలకై ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. హైద్రాబాద్‌ నగర ప్రజల దాహర్తిని తీర్చడానికి ఎన్నో వందల కిలోవిూటర్ల నుండి ఎన్నో వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మంచి నీటిని నగరానికి తీసుకొచ్చి ఉచితంగ సరఫరా చేస్తున్నారు. రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకొని నీటి నిల్వలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజల అందరి పై ఉన్నదని ప్రతి ఒక్కరూ తమ ఇంటి అవరణంలో విధిగా ఇంకుడు గుంతల ను ఏర్పాటు చేసుకొని రాబోయే వర్షాకాలంలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకొని రాబోయే తరాలకు నీటి నిల్వలను అందించాలని అన్నారు. ఈ సంధర్భంగా ప్లకార్డులు, కర్ర పత్రాల మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డి.జీ.యం శ్రీనివాస్‌ రావు, జీ.యం రాంబాబు, కార్మికులు మరియు గాంధీ సంస్థల ప్రతినిధులు డా॥ యానల ప్రభాకర్‌ రెడ్డి, డా॥మైనేని వాణి, పి గిరిధర్‌ గౌడ్‌,నరేష్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.