దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. సమస్యలపై గొంతుచించుకుని అరిచినా వినిపించుకునే స్థాయిని మోడీ దాటిపోయారు. నిరుద్యోగం పెరిగిందని, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీస్తున్నా సమాధానం ఇచ్చే ధైర్యం మోడీకి లేదు. విపక్ష పార్టీలు నిజాలు అడిగినంతనే బిజెపి అగ్గివిూద గుగ్గిలం కావడం దాని అసహనాన్ని వెల్లడిస్తోంది. ఎనిమిదేళ్ల పదవీ కాలంలో చేతగాని నిర్ణయాలు తీసుకుని దేశప్రజలను అగాధంలోకి నెట్టిన మోడీ బృందానికి సహజంగానే విమర్శలను జీర్ణించుకునే స్థాయి లేదు. ఉద్యోగ కల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలమయ్యారని గణాంకాలే వెల్లడిస్తున్నా ఒప్పుకునే ధైర్యం చేయడం లేదు. దీనికితోడు ఉన్నప్రభుత్వరంగ సంస్థలను నిస్సిగ్గుగా అమ్ముతున్నా..గట్టిగా నిలదీసే నేతలు బిజెపిలో కూడా లేరు. అంతెందుకు పార్లమెంటులో ఏ సమస్యపైనా చర్చించే ధైర్యం కూడా మోడీ చేయడం లేదు. అసలు తమను పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్ని వర్గాలు వాదిస్తున్నా పట్టించు కోవడం లేదు. ఎన్నికల ముందు, పార్లమెంటు సమావేశాల సందర్భంగా నీతి వాక్యాలు చెప్పడంతప్ప సమస్యల కోణంలో చూడడం లేదు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే రంగాల్లో ఎలాంటి సానుకూల మార్పులు తీసుకు వచ్చిందీ చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసు కోవడం లేదు. రాష్టాల్రకు ఒరగబెట్టిందీ ఏవిూ లేకున్నా గణాంకాలతో వివరించేందుకు పదేపదే ప్రయత్నాలు చేయడంతప్ప మరేవిూ లేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తుడుముకోవడం బిజెపికి అలవాటుగా మారింది. సత్యాలను కూడా అంగీకరించలేని స్థితికి ఆ పార్టీ చేరింది. విలువలతో కూడాని రాజకీయాలు నెరిపే బిజెపికి ఇప్పుడు అసత్యాలు మాట్లడడమే అలవాటుగా చేసుకుంది. ఎందుకంటే విలువలు కలిగిన నేతలను పార్టీలో దూరంగా పెట్టారు. కనీసం వారికి మర్యాద ఇచ్చి మాట్లాడే స్థితిలో కూడా లేరు. అందుకే పార్టీలో అన్నీ అవలక్షణాలు చోటుచేసుకున్నాయి. కేవంల ఇద్దరి చేతుల్లోనే పార్టీ ఉంది. వారిద్దరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్పోరేట్ల సలహాలతో వారు చెప్పిన రీతిలోనే పాలన సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము చెప్పిందే వేదం అన్న రీతిలో పార్టీని నడుపుతూ ప్రజల ఉసురు పోసు కుంటున్నారు. అన్నీ ఘనతలు సాధించామని, భారత్ ఉజ్వలంగా ఉందని గొప్పలకు పోతున్నారు. ఇలాంటి వారికి ఎదుటి వారు చెప్పే నిజాలు చేదుమాత్రగానే ఉంటుంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. చాయ్ అమ్మానని గొప్పుల చెప్పే ప్రధాని మోడీ,గ్రామాల్లో చాయ్ అమ్మేవాళ్లకు కూడా కష్టకాలం తీసుకుని వచ్చారు. ఎంతోమంది ఆర్థిక వేత్తలు, ఆర్థిక నిపుణులు పెద్దనోట్ల రద్దు వల్ల కలిగిన విపరిణామాలను ఏకరువు పెట్టినా పట్టించుకోలేదు. పలు స్వతంత్ర నివేదికలు ఇప్పటికే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టాయి. నిజానికి ఇది ప్రతి నిరుద్యోగి చేస్తున్న ఆక్రందన. దేశంలో ఉద్యోగాలు రావు. వస్తూత్పత్తి పెరిగినా అనుబంధ రంగాలు బలపడలేదు. వ్యవసాయం దివాళా తీసింది. పండిరచిన పంటలకు మద్దతు ధరలు రావడం లేదు. వ్వయసాయానుబంధ పరిశ్రమలు పెట్టి నిరుద్యోగాన్ని రూపుమాపకుండా ఉపన్యాసాలతో కాలం వెళ్ల దీసారు. ఉద్యోగాలు కల్పిస్తానని, మేకిన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోదీ వైఫల్యాన్ని కాలంగడుపుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీర్చే ప్రయత్నాలు జరిగివుంటే పరిస్థితి ఎందుకింత దారుణంగా ఉంటుంది. దీనికితోడు రూపాయి విలువ పడిపోతూ, ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతుందే తప్ప అభివృద్ది గణాంకాలు ముందుకు సాగడం లేదు. పాలనలో కొత్త ఒరవడి తీసుకుని వచ్చి,ప్రజలకు ఆసరాగా అండగా, దేశానికి మంచి చేసేలా చేస్తారని మోడీని నమ్మిన ప్రజలు నిజంగానే మోసపోయారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనిపై బిజెపి పెద్దలు ఆత్మవిమర్శ
చేసుకుంటే పార్టీకి, దేశానికి మంచిది. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఎలా సన్నగిల్లాయో లెక్కలుచూస్తే తెలుస్తుంది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 7.8శాతం, గ్రావిూణ ప్రాంతాల్లో 5.3శాతం చొప్పున నిరుద్యోగిత ఉందని, సగటున 6శాతం పైనేనని గణాంకాలు తెలుపుతున్నాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ 2016 నవంబరులో కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్న తర్వాత అవి ఎలా సన్నగిల్లాయో తెలిపినా పట్టించు కోవడం లేదు. తీవ్రమైన ఉపాధి లేమి ఎన్నికల్లో మోదీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్నది చాలామంది అంచనాలు వేశారు. అయితే మోడీ మేనేజ్‌మెంట్‌తో ఎన్నికల్లో గెలవడంతో ఇక తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉన్నారు. స్వతంత్ర సంస్థల నోరుకట్టేసి, ప్రభుత్వ సంస్థల నివేదికలను దాచేసి, పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఎన్నో అద్భుతాలను సాధించామని చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకం. పెద్దనోట్ల రద్దు కారణం గానే ఈ దేశంలోని యువతీయువకులకు కొత్త ఇల్లు చవుకగా సమకూరు తున్నదని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో గొప్పలకు పోయారు. కానీ, ఈ నిర్ణయం నల్లధనాన్ని తవ్వితీయ డమనే ప్రకటిత లక్ష్యాన్ని సాధించకపోగా, నలుపును తెల్లగా మార్చి, చక్కగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అధికారంలోకి వచ్చేముందు కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హావిూ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలం అవే మాటలతో మేకిన్ ఇండియా పాట కూడా పాడారు. అప్పట్లో ఆయన నోట అభివృద్ధి మాట తప్ప రామమందిరం ఊసు వినపడలేదు. తన అపసవ్య, అర్థంలేని నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ జపం చేస్తున్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నా అది అసమతు ల్యంగా ఉండడం వల్ల తగినన్ని ఉద్యోగాల సృష్టి జరగక లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతు న్నారు. గత 45 ఏళ్ళ కాలంలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు ఉన్నదనీ, కోట్లాది ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోదీ హావిూ ఓ క్రూరమైన జోక్‌గా మిగిలిపోయింది. పెద్దనోట్ల రద్దుతో కోటికిపైగా ఉద్యోగ, ఉపాధులు దెబ్బ తిన్నాయనీ, ఇప్పటికీ దాని ప్రభావం తీవ్రంగానే ఉన్నదని కొన్ని సర్వేలు చెబుతూనే ఉన్నాయి. అయినా మోడీ దేనికి జంకకుండా తన కార్యాచరణతోనే ముందుకు సాగుతున్నారు.
నిరుద్యోగ భారతం... సమాధానం ఇచ్చే ధైర్యం మోడీకి లేదు