all news

 1.హైదరాబాద్‌లో ప్రపంచంలో రెండో అతిపెద్ద క్యాంపస్‌ ‘కాల్‌అవే’

` మౌళిక వసతుల కల్పనలో హైదరాబాద్‌ మిన్న

` నివాసయోగ్‌ ప్రాంతంగా ముందువరసలో సిటీ

` గోల్ఫ్‌ సంస్థ కార్యాలయ ప్రారంభోత్సవంలో కెటిఆర్‌

హైదరాబాద్‌,మే12(జనంసాక్షి):మౌలిక వసతుల్లో దేశంలో హైదరాబాద్‌ అగ్రభాగాన ఉందని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ఈ విషయంలో ముందున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ‘కాల్‌అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని వెల్లడిరచారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద సెంటర్‌ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడిరచారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కాల్‌అవే గోల్ఫ్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాల్‌ అవే గోల్ఫ్‌ సంస్థ రెండో కార్యాలయం కోసం.. తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషమన్నారు. మౌళిక సదుపాయాల్లో దేశంలోని అన్ని నగరాల కంటే.. హైదరాబాద్‌ ముందుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. అమెరికా తర్వాత చాలా చర్చల అనంతరం ఇండియాలో కార్యాలయం పెట్టాలనుకున్నామని కాల్‌ అవే సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయి కూరపాటి తెలిపారు. హైదరాబాద్‌లో మంచి సౌకర్యాలున్నాయని తెలుసుకుని ఇక్కడే ఈ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడిరచారు. ఇక్కడి సదుపాయాలు చూసిన తర్వాత భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే సూచన కనిపిస్తోందని అన్నారు.కార్యక్రమంలో ఐటి సెక్రటరీ జయేశ్రంజన్‌, కాల్‌ అవే సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.




2.రోగులకు సహాయకులకు ఇక మూడుపూటలా భోజనం

` ఒక పూటకు రూ.5

` జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభ్యం

` ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌,మే12(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మానవత్వానికి మారు పేరు సీఎం కేసీఆర్‌ అని హరీశ్‌రావు కొనియాడారు. ఉస్మానియా ఆస్పత్రిలో మూడు పూటలా భోజనం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. రాష్ట్రం వచ్చిన తొలి రోజుల్లోనే పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికే అందించారని మంత్రి తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఎంత మంది ఉన్న ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున.. మొత్తం 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి 200 గ్రాముల చొప్పున ఆహారం అందించేవారు. అర్దాకలితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, సన్న బియ్యంతో భోజనం పెట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఇవాళ అన్ని హాస్టళ్లలో సన్నబియ్యం తో తిన్నంత భోజనం పెడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ గతంలో ఆస్పత్రులను సందర్శించి నప్పుడు రోగుల సహాయకుల బాధలను గమనించారు. తద్వారా రోగుల సహాయకులకు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నైట్‌ షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారు. ఆ పని కొన్ని చోట్ల పూర్తయిందన్నారు. రోగుల సహాయకులకు కూడా భోజనం అందించాలని సూచించారు. ఈ క్రమంలోనే రోజుకు 20 వేల మందికి రూ. 5 కే అన్నం పెట్టే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. హరే రామ హరే కృష్ణ సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రతి భోజనం విూద రూ. 21 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమానికి రూ. 40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఒక వేళ ఖర్చు పెరిగినా కూడా ప్రభుత్వం భోజనం పెట్టేందుకు వెనుకాడదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని మంత్రి తెలిపారు. ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ కోసం రూ. 6 కోట్లను మంజూరు చేశామన్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఆధునీక మార్చురీగా తయారు చేస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా 75 ఐసీయూ పడకలు మంజూరు చేశామని, అందులో  40 ఐసీయూ పడకలను ప్రారంభించా మన్నారు. ఈ పడకలను జనరల్‌ మెడిసిన్‌, అనస్థీషీయా విభాగాల్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బెడ్‌కు వెంటిలేటర్‌, మానిటర్‌ ఏర్పాటు చేశాం. ఇదే ఐసీయూ బెడ్లకు ప్రయివేటులో అయితే రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు ఛార్జీ వేస్తారు.. కానీ ఉస్మానియాలో మాత్రం ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మరో 30 పడకలకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లోనే ప్రారంభింస్తామన్నారు. వీటితో పాటు మరో రూ. 36 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. ఆర్థోపెడిక్‌ విభాగాన్ని రూ. 2 కోట్ల 63 లక్షలతో ప్రారంభించామన్నారు. రూ. 70 లక్షలతో పూర్తి చేసిన మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను పూర్తి చేసి ప్రారంభించామని చెప్పారు. రూ. మూడున్నర కోట్లతో ఐసీయూ బెడ్స్‌ ప్రారంభించాం. ఓపీ రిజిస్టేష్రన్‌, ఫార్మసీ బ్లాక్‌ను కూడా ప్రారంభించామన్నారు. హెచ్‌ఎండీఏ సహకారంతో గేటు, పరిసరాలను తీర్చిదిద్దడానికి రూ. 50 లక్షలతో శంకుస్థాపన చేశాం. రెండు నెలల్లో పూర్తవుతుందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పురుగులు పట్టిన రేషన్‌ బియ్యాన్ని లబ్దిదారులకు ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో మాత్రమే బీసీ, ఎస్సీ హాస్టల్స్‌ లలో సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు. వృద్దులకు రూ.2016పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. పెళ్లి సమయంలో ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ వంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్లకు డైట్‌ చార్జ్‌ కూడా పెంచామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ సహాయకులకు టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి కూడా రోగులు, వారి సహాయకులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, వీరంతా కేవలం రూ.5కే భోజనం చేయవచ్చన్నారు.


3.నిరాధారణ ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు

` బండికి కేటీఆర్‌ హెచ్చరిక

` తెలంగాణపై మోదీకి అంత వివక్ష ఎందుకని మండిపాటు

హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): ప్రజాసంగ్రామ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్‌ నిర్వాకమే కారణమని..దీనిపై సీఎం కేసీఆర్‌ కనీసం స్పందించలేదని బండి సంజయ్‌ ఆరోపించారు. సంజయ్‌ ఆరోపణలపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.హాస్యాస్పదమైన, ఆధార రహితమైన, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను బండి సంజయ్‌ ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని కేటీఆర్‌ హెచ్చరించారు. ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. ఆధారాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని.. ప్రచారం కోసం వాక్చాతుర్యం ప్రదర్శించవద్దన్నారు. లేకపోతే ప్రజలకు బండి సంజయ్‌ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.కాగా మరో ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ‘’మోదీ జీ.. విూరు గుజరాత్‌కే కాదు భారత్‌కు కూడా ప్రధానే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 8ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా ఇవ్వలేదని.. కేంద్రం చర్యలతో వైద్యవిద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై ఇంత వివక్ష ఎందుకు.మోదీ.. విూరు గుజరాత్‌కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా మంజూరు చేయలేదన్నారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.అయితే గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయుబ్‌ పటేల్‌ అనే వ్యక్తిని మోదీని పలుకరించగా, తన కూతురు ఆశయాన్ని ప్రధాని ముందుంచారు ఆయన. తన బిడ్డ భవిష్యత్‌లో డాక్టర్‌ కావాలని కోరుకుంటుందని తెలిపారు. ఎందుకు డాక్టర్‌ కావాలనుకుంటున్నావని ఆయుబ్‌ పక్కనే ఉన్న కూతురిని మోదీ ప్రశ్నించాడు. మా నాన్న అనుభవిస్తున్న సమస్యే కారణమని ఆమె చెప్పి బోరున విలపించింది. సౌదీలో పని చేస్తున్న సమయంలో ఐ డ్రాప్స్‌ వేసుకోవడంతో కంటి చూపును కోల్పోయాడని చెప్పింది. మిగతా వారిలా ఆయన స్పష్టంగా చూడలేకపోతున్నారని ఆ యువతి చెప్పడంతో మోదీ కూడా భావోద్వేగానికి లోనై.. భవిష్యత్‌లో ఆమె కలను నెరవేర్చేందుకు తప్పకుండా సహాయం చేస్తానని మోదీ ప్రకటించారు. ఈ వీడియోను కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేస్తూ.. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు.




4.రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పైకి.. 

` ఎనిమిదేళ్ల గరిష్ఠానికి!

దిల్లీ,మే12(జనంసాక్షి): దేశంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి ఎగబాకింది. ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది.ఇంధన ధరలు, ఆహార ధరలు భారీగా పెరుగుతుండటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.79శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిర్దేశించిన స్థాయి కన్నా ఇది వరుసగా నాలుగోసారి కూడా అధికంగా నమోదు కావడం గమనార్హం. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఇప్పటికే ఆర్‌బీఐ సూచించింది. 2014 మే నెలలో రికార్డు స్థాయిలో 8.33శాతంగా నమోదు కాగా.. ఆ తర్వాత అదే స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.95 శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్‌లో మాత్రం 4.23శాతంగా ఉండేది.మరోవైపు, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం గత నెలలో 7.68శాతం ఉండగా.. ఏప్రిల్‌లో 8.38శాతానికి పెరగడం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ (అఖఎ)లో దాదాపు సగం వాటా కలిగిన ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో గత కొన్ని నెలల గరిష్ఠస్థాయిని చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కూరగాయలు, వంటనూనెల ధరలు పెరగడం వల్ల ఇది పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పేర్కొంటూ నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో ప్రస్తుతం అది 4.40 శాతానికి చేరింది. అయితే, ఈ నెలలో ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరడంతో ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆర్‌బీఐ వచ్చే నెలలో జరగబోయే విధాన సవిూక్షలో మరోసారి వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.





5.శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

` ప్రమాణం చేయించిన అధ్యక్షుడు గోటబయా రాజపక్స

` మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలు

` అతనిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన కోర్టు

కొలంబో,మే12(జనంసాక్షి): కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. గురువారం సాయంత్రం అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణోత్సవం జరిగింది. ఇదిలా ఉంటే లంకకు ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం లంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా సమసిపోవాలంటే అనుభవజ్ఞుడైన విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు హింస తీవ్రరూపు దాల్చుతుండడం ఆందోళన కలిగిస్తున్నా, మాజీ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే వంటి అనుభవశాలి, వివాదరహితుడు మళ్లీ ప్రధాని పీఠం ఎక్కనున్నారన్న వార్తలు.. అక్కడి పౌరుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అంతకు ముందు విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకుంటున్నారన్న విషయాన్ని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీకి చెందిన వజిర అబేవర్ధనే అనే అధికారి వెల్లడిరచారు. మరోవైపు అనేకమంది పార్లమెంటు సభ్యులు కొత్త ప్రధానిగా విక్రమసింఘేనే రావాలని కోరుకుంటున్నారని అబేవర్ధనే వివరించారు. యునైటెడ్‌ నేషనల్‌ పార్టీకి విక్రమసింఘేనే అధినేత. ఈయన ప్రధాని కావడంతో నిరసనలు 

కొంతైనా తగ్గుముఖం పట్టొచ్చని అధ్యక్షుడు గోటబయా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

మాజీ ప్రధాని మహింద రాజపక్సకు దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలు

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స ఆయన కుమారుడు నమల్‌ రాజపక్స, మరో 15 మందిపై శ్రీలంక కోర్టు ట్రావెల్‌ బ్యాన్‌  విధించింది. కొలంబోలో ఈ వారం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై జరిగిన హింసాత్మక దాడిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. సోమవారం గోటాగోగామా, మైనాగోగామాలలో జరిగిన శాంతియుత నిరసనలపై జరిగిన దాడిపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వీరు దేశం దాటి పోకుండా ఫోర్ట్‌ మేజిస్టేట్ర్‌  కోర్టు వారిపై విదేశీ ప్రయాణ నిషేధాన్ని విధించింది. మహింద్ర రాజపక్స, ఆయన కుమారుడితోపాటు పార్లమెంటు సభ్యులు జాన్‌స్టన్‌ ఫెర్నాండో, పవిత్ర వన్నియారచ్చి, సంజీవ ఎడిరిమన్నే, కాంచన జయరత్నె, రోహిత అబేయుగుణవర్ధనె, సీబీ రత్నాయకే, సంపత్‌ అతుకోరల, రేణుక పెరేరా, శాంతి నిషాంత, సీనియర్‌ డీఐజీ దేశబంధు తెన్నాకూన్‌ తదితరులు నిషేధం ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. రెండు హింసాత్మక ఘటనల వెనక కుట్ర ఉందని, ముందస్తుగా దీనికి పథక రచన జరిగిందని పేర్కొన్న అటార్నీ జనరల్‌.. వారిని విచారించాల్సిన అవసరం ఉందని, కాబట్టి దేశం విడిచి పోకుండా 17 మందిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలని కోర్టును కోరారు. పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వారు దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది. 

మా నాన్న, నేను ఎక్కడికీ పారిపోం.. :నమల్‌ రాజపక్స

శ్రీలంకలో సోమవారం చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స విదేశీ ప్రయాణంపై కోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే.ఈ అంశంపై ఆయన తనయుడు, ఎంపీ నమల్‌ రాజపక్స స్పందించారు. సోమవారం జరిగిన దురదృష్టకర ఘటనలకు సంబంధించి ఎలాంటి దర్యాప్తుకైనా పూర్తిగా తాము సహకరిస్తామన్నారు. శ్రీలంకను విడిచి పారిపోవాలనే ఉద్దేశం తనకు గానీ, తన తండ్రికీ గానీ లేదని, శ్రీలంకలోనే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్‌ చేశారు. శ్రీలంకలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసిన వారే వాటికి జవాబుదారీ చేయాలన్నారు. వికృత గుంపుల చేష్టలకు బాధితులుగా మారిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్‌ విక్రమసింఘేకు అభినందనలు తెలుపుతూ మరో ట్వీట్‌ చేశారు. శ్రీలంకను ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తీసుకోవడం ఉత్తమంగా పేర్కొన్నారు.శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు, మహీంద రాజపక్స మద్దతుదారుల మధ్య సోమవారం చెలరేగిన ఘర్షణలతో ద్వీప దేశం ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఘర్షణలు మరింత హింసాత్మకంగా మారడంతో గత సోమవారం మహీంద తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో మహీందను అరెస్టు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా మహీంద, ఆయన మద్దతుదారులపై శ్రీలంక ఫోర్ట్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించింది. అటార్నీ జనరల్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మహీంద రాజపక్స, ఎంపీ నమల్‌ రాజపక్స సహా పలువురిపై విదేశీ ప్రయాణ నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.



6.ప్రపంచ జనాభాకు పోషకాహారభద్రత పెనుసవాల్‌

` వ్యవసాయోత్పత్తిపెంచి అధిగమించాలి

`పోషకాహారాలు అందించాల్సిన బాధ్యత పెరిగింది

` పంటల ఉత్పాదకతలో నాణ్యమైన విత్తనాలు ముఖ్యం

` ఇస్టాసేవలను ప్రశంసించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారికి పోషకాహార భద్రత కల్పించడం పెద్ద సవాలు వంటిదేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిఅన్నారు.ప్రపంచ జనాభా ఇప్పటికే 7.6 బిలియన్లకు చేరుకుంది.అది 2050 నాటికి 9.9 బిలియన్లకు చేరుతుందని అంచనా అని ఆయన అన్నారు.జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఆహార ధాన్యాల కోసం ప్రపంచ డిమాండ్‌ పెరుగుతున్నదని చెప్పారు. అందుకే పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో నాణ్యమైన విత్తనానిది కీలక పాత్ర అన్నారు.భారత వ్యవసాయోత్పత్తి ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతూ వస్తున్నదని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్‌ సదస్సులో ఇస్టా 2022 ` 2025 ఎగ్జిగ్యూటివ్‌ కమిటీ ఎన్నిక సంధర్భంగావ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు,ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర, బాధ్యతను వహిస్తున్నాయని అన్నారు.విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమల అభివృద్ధి స్థాయి ఒకేరీతిగా లేదు, ప్రాంతాలు/దేశాల మధ్య గణనీయంగా మారుతున్నాయన్నారు. విత్తన నమూనా,పరీక్ష కోసం ప్రామాణిక విధానాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. ’ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత’ అనే లక్ష్యం ద్వారా విత్తన నాణ్యత పరీక్షా వ్యవస్థలపరంగా అన్ని ప్రాంతాలను సమం చేయడానికి, అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా విత్తన వాణిజ్యాన్ని పెంచడానికి ఇస్టా కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. తొలిసారి ఆసియా నుండి, అందునా తెలంగాణ నుండి డాక్టర్‌ కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికకావడం పట్ల గర్విస్తున్నామని అన్నారు. 2022`25 కాలానికి కొత్తగా ఎన్నికైన ఇస్టా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులందరినీ మంత్రి అభినందించారు. ఇది ఒక గొప్ప అవకాశం, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం,  ప్రపంచ వ్యాప్తంగా విత్తన పరిశ్రమలకు మద్దతునిచ్చే ఇస్టా వారసత్వాన్ని కొనసాగించడం ఒక పెద్ద బాధ్యతగా చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తి, ఆహార భద్రతను మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సమావేశం ఫలితాలనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 



7.రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

` దేశవ్యాప్తంగా 15 రాష్టాల్ల్రో 57 సీట్లకు ఎన్నికలు

` ఏపీలో 4...తెలంగాణలో 2 సీట్లకు ఎన్నిక

న్యూఢల్లీి,మే12(జనంసాక్షి):పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్టాల్ల్రో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. జూన్‌ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 3 వరకు గడువు ఉంటుంది. జూన్‌ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 57 సీట్లలో.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.  ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్‌ ప్రభు, టీజీ వెంకటేష్‌, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు,  ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్‌ అవుతున్నారు. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 15 రాష్టాల్లో 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం  గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, జూన్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.


8.భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్‌కుమార్‌

న్యూఢల్లీి,మే12(జనంసాక్షి):తదుపరి భారత ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి)గా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సిఇసిగా విధులు నిర్వహిస్తున్న సుశిల్‌ చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో తదుపరి సిఇసిగా రాజీవ్‌ కుమార్‌ మే 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ గురువారం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అభినందనలు తెలిపారు. 1984 బ్యాచ్‌ జార్ఖండ్‌ క్యాడర్‌కు చెందిన రాజీవ్‌ కుమార్‌.. 2020 సెప్టెంబరులో కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా చేరారు. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.



9.హానిట్రాప్‌..(కిక్క)

దేవేంద్ర నారాయణ్‌ శర్మ  దేశరక్షణ సమాచారాన్ని అమ్మేశారు

` విధుల నుంచి ఏయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి తొలగింపు

` అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు

దిల్లీ,మే12(జనంసాక్షి):దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలక, సున్నితమైన సమాచారాన్ని..పాకిస్థాన్‌కు చెందిన ఓ ‘ఏజెంట్‌’కు లీక్‌ చేశాడన్న ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన ఉద్యోగిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు హనీట్రాప్‌లో చిక్కుకుని ఈ సమాచారాన్ని బయటకు పంపించినట్లు క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆరోపించారు.భారత వైమానిక దళంలో గూఢచర్యం జరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో దిల్లీ క్రైం బ్రాంచ్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ రికార్డ్‌ ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న దేవేంద్ర నారాయణ్‌ శర్మ ద్వారా సమాచారం బయటకు వెళ్తున్నట్లు గుర్తించి ఈ నెల 6వ తేదీన అతడిని కస్టడీలో తీసుకొంది. ఈ విషయాన్ని దిల్లీ పోలీసులు గురువారం వెల్లడిరచారు.పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ద్వారా దేవేంద్ర హనీట్రాప్‌లో చిక్కుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్రను ఆమె ట్రాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్షణ రంగ కార్యాలయాలు, స్థావరాలు, సిబ్బందికి సంబంధించిన అత్యంత సున్నితమైన, కీలక సమాచారాన్ని దేవేంద్ర సదరు మహిళతో పంచుకున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు గానూ ఆయనకు డబ్బులు కూడా చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దేవేంద్ర నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దేవేంద్రను తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడిరచారు.గతేడాది జులైలో ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి కూడా రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకు అందించిన విషయం తెలిసిందే. దీంతో అతడిని విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు.





11.విదేశాలకు వెళ్లే వారికి వెసులుబాటు.. 

` గడువుకన్నా ముందే బూస్టర్‌ డోసు

దిల్లీ,మే12(జనంసాక్షి): విదేశాలకు వెళ్లే భారతీయులకు బూస్టర్‌ డోసు విషయంలో కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. తాము వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని చెప్పింది.ఈ విషయాన్ని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడిరచారు. ‘విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థులు.. వారు వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చు. ఈ వెసులుబాటు కొవిన్‌ పోర్టల్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది’ అంటూ మాండవీయ ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం రెండో డోసుకు, బూస్టర్‌ డోసుకు మధ్య వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లాలనుకునే దృష్టిలో ఉంచుకొని దీనిని ఆరు నెలలకు తగ్గించే విషయమై ప్రభుత్వం యోచిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ బుధవారం దీనికి సంబంధించిన సిఫార్సులు చేసింది. అయితే మిగతా ప్రజల విషయంలో ఈ నిబంధనలు యథావిధిగానే ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ జనవరి నుంచి బూస్టర్‌ డోసులు అందిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కూడా ఈ డోసులు అందుబాటులో ఉంటున్నాయి.