1.ఏటా 2కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?
` మోదీ.. ప్రైవేటు ఉద్యోగాలెక్కడ?
` కేంద్రప్రభుత్వ పరిధిలో 16లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి..వాటి భర్తీ ఎప్పుడు?
` ఏటా రెండుకోట్ల ఉద్యోగహావిూ ఏమయ్యింది
` తెలంగాణలో ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాల భర్తీ
` మరో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
` ఉపాధి,ఉద్యోగ అవకాశాలను దెబ్బకొడుతున్న కేంద్రం
` ఉద్యోగాల భర్తీకి యువతతో కలసి కేంద్రంపై పోరాడుతాం
` ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్,జూన్ 9(జనంసాక్షి):దేశంలోని యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ.. తన హావిూని నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. కానీ కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిరదన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు ద్వారా పెద్ద దెబ్బ కొట్టారని ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యువతతో కలిసి టీఆర్‌ఎస్ ఆందోళన చేపడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు, అలుపెరగని ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్టాన్న్రి సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ యువత తరపున నేను కీలకమైన అంశాన్ని విూ దృష్టికి తీసుకువస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపాదికైన నీళ్లు` నిధులు` నియామకాలు అనే కీలక అంశాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎనిమిది సంవత్సరాలుగా మా ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కల్పన కోసం రెండంచెల వ్యూహంతో పనిచేస్తున్నాము. నూతన రాష్ట్రం అయినప్పటికీ వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు పెట్టుబడులుగా తెచ్చాము. త్రికరణశుద్దిగా మేం చేస్తున్న ప్రయత్నాలతో ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకుంది. భారత ప్రధానమంత్రి అయిన విూకు ఈ విషయంలో తగినంత సమాచారం ఉండే ఉంటుందని భావిస్తున్నాను. పారిశ్రామిక, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని విూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే పలు వేదికలపై లెక్కలేనన్ని సార్లు ప్రశంసించిన విషయం విూకు తెలిసే ఉంటుంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మేము, ప్రభుత్వ రంగంలోనూ ఇప్పటిదాకా సుమారు లక్షా 32 వేల ఉద్యోగాలను మేం భర్తీ చేశాము. తాజాగా మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పక్రియను మొదలు పెట్టి, మాది ఒట్టి మాటల ప్రభుత్వం కాదు గట్టి చేతల ప్రభుత్వమని ప్రజల చేతనే శభాష్ అనిపించుకుంటు న్నాము. ఒక రాష్ట్రంగా మాకున్న పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మా ప్రజలకు కల్పిస్తున్నామన్నారు. కాని దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రధానమంత్రిగా విూరు విఫలమయ్యారనే భావన నెలకొన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎంతో గంభీరంగా విూరు మాట్లాడినదంతా ఢాంబికమే అనడానికి ఎనిమిదేళ్ల విూ పాలనే నిదర్శనంగా కనిపిస్తున్నది. విూ అసమర్థ నిర్ణయాలు, అర్ధిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు. విూరు తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తాకిందన్నారు. ఉన్న ఉద్యోగాలు పొయి కేవలం పకోడీ ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవం. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించే విషయంలో విూకు ఒక స్పష్టమైన విధానం లేదనడానికి నాకెలాంటి సందేహం లేదని అన్నారు.. వ్యవసాయం రంగంతో పాటు, దాని తరువాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ టెక్స్ టైల్ రంగ అభివృద్ధిపై విూ ప్రభుత్వానికి చిత్తశుద్ది అసలే లేదు. అందుకే పొరుగున ఉన్న చిన్న దేశాల కన్నా తక్కువమందికి ఈరంగంలో ఉపాధి లభిస్తున్నది. మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ రెండు రంగాలను విూరు కావాలని విస్మరించడంతోనే ఇవాళ దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నది నిజం. విూ ఈ విధానాల వలనే గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్న భారత ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం అంటూ విమర్శలు గుప్పించారు. దేశానికి పెట్టుబడులను భారీగా రప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన విూరు, కేందప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలతోపాటు పబ్లిక్ సెక్టార్ లోని అనేక కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండిరగ్‌లో పెట్టారు. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్న విూరు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అందినకాడికి అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను రద్దు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో పెండిరగ్ లో ఉన్న 16 లక్షల ఉద్యోగాలభర్తీకి ఏం చర్యలు తీసుకుంటారో వివరించండి. లేకుంటే తెలంగాణ యువతతో కలిసి కేంద్రం విూద ఒత్తిడి తీసుకువచ్చేలా, ఉద్యోగాల భర్తీ జరిగేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
(ఢల్లీి పర్యటనలో బిజీగా మంత్రి కెటిఆర్
బోయింగ్ చీఫ్‌తో మంత్రి చర్చలు
న్యూఢల్లీి,జూన్ 9(జనంసాక్షి):ఢల్లీి పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడుపుతున్నారు. గురువారం ఢల్లీిలో బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షులు సలీల్ గుప్తాతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో బోయింగ్ సంస్థ ఉత్పత్తులతో పాటు భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015లో మార్క్‌తో తాను అమెరికాలో మొదటిసారి కలిసినట్లు, అప్పటినుంచి వివిధ సందర్భాల్లో ఆయనతో సమావేశమైనట్లు ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడిరచారు. హైదరాబాద్‌లో బోయింగ్ తయారీ యూనిట్ ఏర్పాటులో మార్క్ ఎంతగానో సహాయపడినట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
2.వ్యవసాయ రంగానికి మోదీని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలట!
` బండి సంజయ్ డిమాండ్
` సీఎం కెసిఆర్‌కు లేఖ
హైదరాబాద్,జూన్ 9(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనంతా ’రైతుల కంట కన్నీరు` కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరు’గా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా పేర్కొంటూ ముఖ్యమంత్రికి బండి సంజయ్ మూడు పేజీల బహింరంగ లేఖ రాశారు. కేంద్రం, ప్రధాని మోదీపై ఆరోపణలు ఆపాలని లేఖలో పేర్కొన్నారు. వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు నిధులు రూ. 7,500 కోట్లను రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని.. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. ’ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతుబంధుకు.. రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. రైతుబంధు నిధులు సకాలంలో విడుదల చేయక పోవడంతో అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవతున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణలో రూ. 5,800 కోట్ల నిధులను జమచేసి రైతులను ఆదుకుంది. ఈ సీజన్ కోసం రూ.580 కోట్ల నిధులను విడుదల చేసిందని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
3.ముగ్గురు మైనర్ల కస్టడీ కోరిన పోలీసులు
` నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు వినతి
హైదరాబాద్,జూన్ 9(జనంసాక్షి): జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే ఉన్నారు.వీరిలో ముగ్గురు మైనర్లను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతిచ్చింది. దీంతో ఈ ముగ్గురిని రేపట్నుంచి ఐదురోజుల పాటు జువైనల్ హోమ్‌లోనే మైనర్లను పోలీసులు విచారణ చేనున్నారు. న్యాయవాది సమక్షంలో మైనర్లను విచారణ చేసి వాంగ్మూలం తీసుకోనున్నారు. పోలీసు దుస్తులు లేకుండా సాధారణ దుస్తుల్లోనే వెళ్లి విచారణ చేయాలని పోలీసులను జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. ఈ కేసులో ఏ`1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను ఇప్పటికే చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 12వ తేదీ వరకు సాదుద్దీన్ మాలిక్ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.మరో వైపు నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన చట్ట సవరణను జువైనల్ జస్టిస్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.కాగా జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేప్ కేస్ నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్ ను పోలీసులు కోరారు. చార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులంతా మేజర్లు అవుతారని పేర్కొన్నారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్ జస్టిస్ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడిరచనుంది. కాగా... మైనర్లకు 21 యేళ్లు దాటిన తరువాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైల్‌కు తరలిస్తారన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు దర్యాప్తును పోలీసులు కీలకంగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే కేసులో పట్టుబడ్డ నలుగురు మైనర్లే అని... వీరిపై సెక్లన్లను పూర్తిగా అమలు చేసేందుకు మేజర్లుగా పరిగణించాల్సి ఉంటుందని జువైనల్ బోర్డుకు పోలీసులు తెలియజేశారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డుకు పోలీసులు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై జువైనల్ బోర్డు నిర్ణయం కీలకంగా మారింది. రోవైపు... ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు చంచల్ గూడా జైలుకు జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 4 రోజుల పాటు నిందితుని పోలీసులు విచారించనున్నారు.
4.ఎన్టీఆర్ మనిషినన్న ముద్రతో నేను గర్విస్తున్నాను
` రిటైరయ్యాక ఎన్టీఆర్‌తో అనుబంధంపై పుస్తకం రాస్తా
` ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవి
` రైతుబిడ్డ,రాజకీయవేత్తగా రాణించిన మహామనిషి
` ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జస్టిస్ ఎన్‌వి రమణ
తిరుపతి,జూన్ 9(జనంసాక్షి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యాక దివంగత నేత ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ వెల్లడిరచారు. తిరుపతిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను సీజే ప్రారంభించి మాట్లాడారు. తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఎన్టీఆర్‌కు తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఎన్టీఆర్ ఓ సమగ్ర సమతామూర్తి? అని కొనియాడారు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని పేర్కొన్నారు. రైతు బిడ్డగా, సినిమా నటుడిగా, రాజకీయవేత్తగా రాణించారని తెలిపారు. నాడు ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్రవేయడం పట్ల గర్విస్తున్నానని వెల్లడిరచారు. టీడీపీని ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్టీఆర్ కోసం పరోక్షంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. సంక్షోభ సమయంలో ఆయన తరుఫున వాదించడానికి కూడా ఎవ్వరూ రాలేదని అన్నారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఆయనకు న్యాయ పరమైన సలహాలు ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరీ అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ మనిషిగా ఉండడాన్ని తాను గర్విస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 1983 నుంచి ఎన్టీఆర్.. మనిషిగా తనపై ముద్ర వేశారని వ్యాఖ్యనించారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని చెప్పారు. జనం నాడి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాలన్న అంశంపై సందిగ్దత ఉంటుందని.. ఎన్నో సదస్సుల్లో పాల్గొన్నా ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురుకాలేదని అన్నారు. ఎన్టీఆర్ స్వలాభం కోసం కాకుండా.. ప్రజా సేవకోసం పార్టీ పెట్టారని చెప్పారు. పార్టీ ప్రారంభించి నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని తెలిపారు. 1984 ఎన్నికల్లో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు.ఎన్టీఆర్‌తో కొంత సాన్నిహిత్యం ఉందని.. 1983 నుంచి ఎన్టీఆర్.. మనిషిగా తనపై ముద్ర వేశారని అన్నారు. ఎన్టీఆర్ మనిషిగా ఉండడాన్ని తాను గర్విస్తున్నానని చెప్పారు. రాజకీయ పార్టీకి సిద్దాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్‌పై ఓ పుస్తకం రాస్తానని వెల్లడిరచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌కు గుర్తింపు కోసం అందరూ పోరాడాలని సూచించారు.
5.రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా
` పార్టీలు విప్ జారీ చెయ్యొద్దని హుకుం
` జూలై18న రాష్ట్రపతి ఎన్నిక
` జులై 21న కౌంటింగ్... ఫలితాలు వెల్లడి
` ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల
` నామినేషన్లకు జూన్ 29 చివరి తేదీ
` జూన్ 30న నామినేషన్ల స్కుట్రినీ
` నామినేషన్ల విత్ డ్రాకు జులై 2 వరకు గడువు
న్యూఢల్లీి,జూన్ 9(జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జులై 18న ఎన్నిక జరగనుంది. జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు జులై రెండు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను జూన్ 15న విడుదల చేస్తామని తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 అని చెప్పారు. 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణ గడువుకు చివరి తేదీ జులై 2 అన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జులై 24న ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక పక్రియ వచ్చే నెల 24లోపే పూర్తి కావాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాది ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు. ప్రతి రాష్టాన్రికి ఎన్నికల సంఘం నుంచి... అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను పంపుతారు. పార్లమెంట్ భవనం, రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లో ఓటింగ్ పక్రియ జరుగుతుంది. పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్లమెంటు, రాష్టాల్ర అసెంబ్లీలలో పోలింగ్ జరగుతుందని సీఈసీ చెప్పారు. ఎన్నిలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు. ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431 అని సీఈసీ తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొన్నారు. ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, ఢల్లీి, పుదుచ్చేరి సహా... అన్ని రాష్టాల్రఎమ్మెల్యేలు ఎలక్టరోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10,98,903 కాగా 5,34,680 ఓట్లు పొందిన అభ్యర్ధి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఎలక్టోరల్ కాలేజీలో 778 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలుంటారు. ఒక్కో ఎంపీ విలువ 700. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు ఒక్కరికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జులై 24న ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక పక్రియ వచ్చే నెల 24లోపే పూర్తి కావాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాది ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు. ప్రతి రాష్టాన్రికి ఎన్నికల సంఘం నుంచి... అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను పంపుతారు. పార్లమెంట్ భవనం, రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లో ఓటింగ్ పక్రియ జరుగుతుంది. పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన విూడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నామినేషన్లకు జూన్ 29 చివరి తేదీ కాగా... నామినేషన్ల స్కుట్రినీ జూన్ 30న, నామినేషన్ల విత్ డ్రాకు జులై 2 వరకు కమిషన్ గడువు విధించింది. ఇక జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించ నున్నారు. జులై 21న కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా తదుపరి రాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయ్యింది. జులై 25న కొత్త రాష్ట్రపతి ఎన్నిక పక్రియ పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యుల తో పాటు అన్ని రాష్టాల్రు, ఢల్లీి, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. వీరంతా కలిసి ఓటు హక్కు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్యాలెట్ పేపర్లలో తమ మొదటి ఎంపిక (చాయిస్), రెండో ఎంపిక, మూడో ఎంపిక లను టిక్ చేస్తారు. మొదటి ఎంపిక ఓట్లను తొలుత లెక్కిస్తారు. మొదటి ఎంపిక ఓట్లను మెజారిటీ సంఖ్యలో పొందే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. అందులో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోతే.. రెండో, మూడో ఎంపిక ఓట్లను కూడా లెక్కిస్తారు.
8.యాసంగివడ్లు కొంటానన్న మొనగాడివి ఏడ దాక్కున్నవ్..?
` రైతులకు క్షమాపణ చెప్పు.. ముక్కునేలకు రాయ్..
` నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు బండి వ్యవహరం
` బండిసంజయ్‌పై నిప్పులు చెరిగిన మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్,జూన్ 9(జనంసాక్షి): తెలంగాణ రైతుల పట్ల బీజేపీ మొసలి కన్నీరు ఆపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంజయ్ లేఖ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వడ్లు కొనిపించే బాధ్యత తనదేనన్న సంజయ్.. ధాన్యం కొనుగోలు సమయానికి ముఖం చాటేశారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో యాసంగి వడ్లు కొనుగోలు చేశారని తెలిపారు. రైతుబంధుకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చాలా తేడా ఉందన్నారు. రూ. 7,500 కోట్లకు, రూ. 580 కోట్లకు తేడా తెలుసుకోవాలని మంత్రి చురకలంటించారు. తమ ప్రభుత్వం ఏటా రైతుబీమాకు చేస్తున్న ఖర్చు రూ. 1,500 కోట్లు అని తెలిపారు. రైతుబంధు గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్‌కు లేదని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.
9.తెలంగాణ బిడ్డ ముందు ఏడు ఎత్తైన శిఖరాలు లొంగిపోయాయి
` అరుదైన ఖ్యాతిని సొంతంచేసుకున్న మలావత్ పూర్ణ
` ఏడు ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు
నిజామాబాద్,జూన్ 9(జనంసాక్షి): హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్‌కు చెందిన మలావత్ పూర్ణ మరో ఘనత సాధించారు.అమెరికా దేశం అలస్కాలోని 6,190 విూటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరోహించారు. తాజా ఘనత ద్వారా ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు.ఈ ఘనత సాధించిన ’యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు.మే 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ శేఖర్ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్ చేసిన ఏస్ ఇంజనీరింగ్ అకాడవిూ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్(వీఆర్‌ఎస్), సహకరించిన హైదరాబాద్ బీఎస్‌బీ ఫౌండేషన్ చైర్మన్ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది. పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ’ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7సమ్మిట్స్ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్ వర్మ కూడా ఉన్నారు. కాగా, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ’ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కాంట్రెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7సమ్మిట్ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం.
10.దేశంలో కరోనా డేంజర్ బెల్స్..
` మహారాష్ట్ర, దిల్లీలో అధికంగా నమోదవుతున్న కేసులు
ముంబయి,జూన్ 9(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.మహారాష్ట్రలో నిన్న 2701 కేసులు రాగా.. గడిచిన 24గంటల వ్యవధిలో మరో 2,813 కొత్త కేసులతో పాటు ఒక మరణం నమోదైనట్టు అధికారులు వెల్లడిరచారు. అలాగే, 1047మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. తాజాగా బయటపడిన ఇన్ఫెక్షన్లతో మహారాష్ట్రలో క్రియాశీల కేసుల సంఖ్య 11,571కి పెరిగింది. ఈరోజు వచ్చిన వాటిలో ఒక్క ముంబయిలోనే 1,702 కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో కలిపితే మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 79,01,628కి చేరింది. వీటిలో 77,42,190 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,47,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం 11,571 క్రియాశీల కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 7,998 యాక్టివ్ కేసులు ఉండగా.. ఠానేలో 1984, రాయిగఢ్‌లో 319 చొప్పున ఉన్నాయి.అటు, దిల్లీలోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 19,619 టెస్టులు చేయగా.. 622 మందిలో ఈ మహమ్మారి వెలుగుచూసింది. తాజాగా 537మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కరోనాతో పోరాడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడిరచారు. తాజా కేసులతో దిల్లీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 19,10,613కి చేరింది. వీరిలో 18,82,623 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 26,216 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,774కి చేరింది.దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 7240 కొత్త కేసులు రావడం.. వీటిలో 81శాతం మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటకల్లోనే ఉండటంతో గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇన్ఫెక్లన్లను తగ్గించడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ లేఖ రాశారు. వైరస్‌ను ముందుగా గుర్తించి వ్యాప్తిని నిరోధించడంలో టెస్టింగ్‌లదే కీలక పాత్ర అనీ.. అందువల్ల విస్తృతస్థాయిలో టెస్టులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్`ట్రాక్`ట్రీట్`వ్యాక్సిన్, కొవిడ్ నిబంధనలు పాటించడం అనే ఐదంచెల వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ కట్టడికి ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
11.మోదీ హయాంలో రైతుల కష్టాలు వంద రెట్లు పెరిగాయి
` పెరిగిన ద్రవ్యోల్బణంతో ఈ మద్దతు ధర ఏమాత్రం సరిపోదన్న కాంగ్రెస్
న్యూఢల్లీి,జూన్ 9(జనంసాక్షి): 2022`23 సంవత్సరానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్రం 4`9 శాతం పెంచడంపై కాంగ్రెస్ పెదవివిరిచింది. ఇది నామమాత్రపు పెంపని, మోతెక్కుతున్న ద్రవ్యోల్బణంతో ఇది ఏమాత్రం సరిపోదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల రాబడిని పెంచేందుకు బదులు మోదీ ప్రభుత్వం రైతుల కష్టాలను వందరెట్లు పెంచిందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా గురువారం ఆరోపించారు.మోదీ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని మరోసారి మోసగించిందని, ఎంఎస్‌పీని అరకొరగా పెంచిందని దుయ్యబట్టారు. మోదీ హయాంలో రైతుల ఆదాయం పెరగకపోగా వారి కష్టాలు వంద రెట్లు పెరిగాయని ఆక్షేపించారు. ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటలకు పెరిగిన ఎంఎస్‌పీల జాబితాను ట్విట్టర్‌లో షేర్ చేసిన సుర్జీవాలా ధరల పెరుగుదలతో పోలిస్తే ఇది ఎంతమాత్రం సరిపోదని స్పష్టం చేశారు.ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఆర్‌బీఐ ఇటీవల అంచనా వేయగా ఎంఎస్‌పీ రేట్లు ద్రవ్యోల్బణ రేటు కంటే అతితక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ఖరీఫ్ సీజన్‌లో వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ 100 చొప్పున పెంచి రూ 2040గా ఎంఎస్‌పీని కేంద్రం బుధవారం నిర్ణయించింది.
12.విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు
న్యూఢల్లీి,జూన్ 9(జనంసాక్షి):ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకీ ఆమెను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఢల్లీి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢల్లీి పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. సోషల్ విూడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢల్లీి పోలీసులు తెలిపారు.