ALL NEWS

 

1.ప్రపంచంముందు తలవంపు..
` భాజపా అధికారప్రతినిధుల ఉన్మాదవ్యాఖ్యలు
` బీజేపీ ప్రతినిధుల నోటి దూల.. దేశ ప్రతిష్టకు మచ్చ
` నాడు భారత్‌ ` పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో సైతం భారత్‌కు మద్ధతుగానో,తటస్థంగానో ఉన్న పశ్చిమాసియా దేశాలు
` నేడు బీజేపీ అధికార ప్రతినిధుల ప్రేలాపనలతో కస్సుమన్న ఖతార్‌, కువైట్‌, ఇరాన్‌, సౌదీ
` ‘ఆ వ్యాఖ్యలు మా దేశ సంస్కృతిని ప్రతిబింబించవు’ అంటూ సంజాయిషీ ఇచ్చుకున్న భారత రాయబారులు
` ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ కంటితుడుపు చర్యలు తీసుకున్న బీజేపీ
` ‘బీజేపీ మతోన్మాద వైఖరి విదేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బంది, ఈ దేశ ప్రతిష్టకు మచ్చ’ అని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు నుపూర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ లను పరిస్థితి చేయిదాటకముందే ఆ పార్టీ సస్పెండ్‌ చేసినప్పటికీ వాళ్ళ వ్యాఖ్యల తాలూకూ ప్రభావం మాత్రం సమిసిపోయేలా లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే గనుక పశ్చిమాసియా దేశాలతో భారత దౌత్య సంబంధాల విూద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ప్రపంచ దేశాలన్నిటితో సత్సంబందాలు కొనసాగించాలనుకునే భారత్‌ వైపు ఇప్పటివరకు ఏ దేశమూ వేలెత్తి చూపలేదు. దాయాది దేశమైన పాకిస్తాన్‌ తో జరిగిన యుద్ధసమయంలో కావచ్చు, సరిహద్దులో తీరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు కావచ్చు ఈ పశ్చిమాసియా దేశాలు మనల్ని కట్టడి చేయాలని కానీ, సంజాయిషీ అడగటం కానీ ఎప్పుడూ చేయలేదు. వాళ్ళ పార్టీ వైఖరే కావొచ్చుగాక దురదృష్టవశాత్తు ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఖతార్‌, కువైట్‌, ఇరాన్‌, సౌదీ దేశాల విదేశాంగ శాఖ అధికారులు ఆయా దేశాలలోని భారత రాయబారులకు తమ నిరసన తెలపడంతో పాటు సంజాయిషీ కోరడం భారత్‌ ప్రతిష్టకు కొంత నష్టమే అని చెప్పుకోవచ్చు. గల్ఫ్‌ దేశాలలో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్న విషయాన్ని కానీ, ఆ దేశాలతో భారత్‌ కొనసాగిస్తున్న వర్తక వాణిజ్య సంబంధాలను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. కొన్నిచోట్ల ‘బయికాట్‌ ఇండియా ప్రోడక్ట్స్‌’ ఉద్యమం కూడా మొదలుపెట్టారు. నష్ట తీవ్రతను పసిగట్టిన బీజేపీ అధిష్టానం ఇద్దరు అధికార ప్రతినిధులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్‌ చేసి దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ ప్రతినిధులు చేసిన అనాలోచిత వ్యాఖ్యలకు విదేశాంగ అధికారులు సంజాయిషీ ఇచ్చుకోవడం దేశప్రతిష్టకు మచ్చ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ హిందూ అతివాద వైఖరి కారణంగా దేశాభివృద్ధి కుంటుపడటంతో పాటు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విూద తీవ్రప్రభావం పడుతుందని పలువురు ప్రజాస్వామికవాదులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ‘బీజేపీ మతోన్మాద వైఖరి విదేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బంది, ఈ దేశ ప్రతిష్టకు మచ్చ’ అని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.

 

2.జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో మోదీ భేటీ
` కష్టపడితే అధికారం మనదే..
` హైదరాబాద్‌ కార్పొరేటర్లకు ఢల్లీిలో ప్రధాని దిశానిర్దేశం
ఢల్లీి,జూన్‌ 7(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఒక్కో కార్పొరేటర్‌ను పేరు పేరునా పరిచయం చేసుకున్న ప్రధాని.. వాళ్ల కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రజా జీవితంలో ఆదర్శంతంగా ఉండాలని, రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో కష్టపడి పని చేస్తే అధికారం మనదే(బీజేపీ) అని ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలవలేకపోయా.. ఈసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కలుసుకుందాం అంటూ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ గ్రూప్‌ ఫొటో దిగారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరించాలనుకుంటోంది. ఇందులో భాగంగానే.. జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటోంది.ఈ సమావేశంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.

 

3.శ్రీశైలంలోకి అక్రమంగా వెలుగొండ తవ్వకం మట్టి..
` వెంటనే ఆపించాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
` పూడిక పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదముందని వెల్లడి
హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):వెలుగొండ సొరంగం తవ్వకం మట్టిని శ్రీశైలంలోకి తరలించడం వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళి లేఖ రాశారు. వెలుగొండ సొరంగం తవ్వకం మట్టిని శ్రీశైలంలోకి తరలించడంపై ఫిర్యాదు చేసింది. మట్టిని జలాశయంలోకి తరలించకుండా ఆపాలని ఈఎన్‌సీ కోరారు. ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు నుంచి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నిలిచే కొల్లం వాగు వరకు వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులు జరుగుతున్నాయి. సొరంగం లోపలి భాగంలో రెండో విడుత పనులు మొదలయ్యాయి. కార్మికులు, యంత్రాలు వెళ్లేందుకు మొదటి సొరంగం నుంచి భూగర్భంలో తవ్వుతున్నారు. ఈ క్రమంలో వచ్చే మట్టి, రాళ్ల వ్యర్థాలను కొల్లంవాగు వద్ద అటవీ ప్రాంతంలో డంప్‌ చేస్తున్నారు. రాత్రివేళ అక్కడి నుంచి లాంచీల్లోకి ఎక్కించి నదిలో కలిపేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత పది రోజులుగా పెద్ద ఎత్తున మట్టి వ్యర్థాలను నదీ జలాల్లో కలిపేసినట్లు సమాచారం. శ్రీశైలం జలాశయం వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 308.60 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215 టీఎంసీలకు పడిపోయింది. దాదాపు 92 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. ఇప్పుడు టన్నెల్‌ వ్యర్థాలు కూడా ప్రాజెక్టు దగ్గరలోనే కలుపుతుండడంతో పూడిక మరింత పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉన్నది. ఈ క్రమంలో తెలంగాణ ఈఎన్‌సీ కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

4.బాధితురాలి ఆధారాలు బయటపెట్టినందుకు రఘునందన్‌పై కేసు నమోదు
` రాజాసింగ్‌పై కూడా..
హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని.... న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ 223(జీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రఘునందన్‌రావు జుబ్లీహిల్స్‌ ఘటనకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని విూడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందచేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని రఘునందన్‌ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు అబిడ్స్‌ పీఎస్‌లో రఘునందన్‌రావుపై కేసు నమోదు అయింది. మరోవైపు సాముహిక అత్యాచార బాధితురాలికి సంబంధించిన వివరాలను రిలీజ్‌ చేసిన ఓ జర్నలిస్టు సుభాన్‌పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ అవ్నిూషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్‌ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు.అలాగే గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అజ్మీర్‌ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. అయితే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 295ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ... తనకు కేసులు కొత్త కాదని అన్నారు. పోలీసుల నోటీసుల కోసం బీజేపీ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలసి రాజకీయంగా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఇదే మెదటి.. చివరి ఎఫ్‌ఐఆర్‌ కాదని, ఉద్యమంలో పోరాడిన వాడినని తెలిపారు. చట్టం తెలిసిన వాడిగా సాక్ష్యాలను మాత్రమే బయట పెట్టినట్లు తెలిపారు. కేసులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానన్నారు. మైనర్‌ బాలికకు న్యాయం చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు స్పష్టం చేశారు.

 

5.మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల్లో ఖాళీల భర్తీ
` రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్‌ పోస్టుల భర్తీ
` పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌
హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్‌ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్‌ హెల్త్‌లో236, చీఫ్‌ ఇంజనీర్‌ రూరల్‌ వాటర్‌ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పంచాయతీ రాజ్‌ జనరల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్ట్‌, ఎక్సైజ్‌, బ్రెవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రూప్‌ వన్‌, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా మంగళవారం మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

6.యూపిలో మారో దారుణం
` దళిత బాలిక అత్యాచారం..
` ఆపై దారుణంగా హత్యచేసిన దుండగులు
లక్నో,జూన్‌ 7(జనంసాక్షి):యూపీలో ఘోరం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసిన దుండగులు క్రూరంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని రైల్వే ట్రాక్‌ వద్ద పడేశారు. బాధితురాలి ఒంటివిూద అనేక గాయాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. ఉన్నావ్‌లో క్రూరమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన దళిత బాలిక.. శవమై తేలింది. ఆమెపై అత్యాచారం చేసి చంపి ఉంటారని సమాచారం. బాలిక శరీరంలోని ఎముకలు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. బంగారమౌ కొత్వాలీ ప్రాంతంలో ఉండే 13 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి బయటకు వెళ్లింది. ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ వెతికినా.. ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా, సోమవారం ఉదయం బాలిక మృతదేహం ఓ రైల్వే ట్రాక్‌ సవిూపంలో కనిపించింది. ఈ ప్రదేశం బాలిక ఇంటికి కిలోవిూటర్‌ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌ మార్టం నిర్వహించిన తర్వాత షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాడీకి ఎనిమిది చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయని వైద్యులు తేల్చారు. కొన్ని గాయాలు చాలా లోతుగా ఉన్నాయని గుర్తించారు. తలకు బలంగా గాయం కావడం వల్లే బాలిక మృతి చెందిందని నిర్ధరించారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత చంపేసి ఉంటారని వైద్యులు పేర్కొన్నారు. అదనపు ఎస్పీ.. బాలిక మృతదేహం లభించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్‌ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై సత్వరం చర్యలు తీసుకోవాలని పోలీసులను.. ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం, నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గ్రామానికి చెందిన యువకుడే బాలికపై అత్యాచారం చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. నలుగురు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి.

 

7.రాజస్థాన్‌లో ఘోరరోడ్డు ప్రమాదం
కారును ఢీకొన్న ట్రక్కు: 8మంది మృతి
జయపుర,జూన్‌ 7(జనంసాక్షి):రాజస్థాన్‌ బాడ్‌మేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారును.. ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.ప్రయాణికులంతా జాలౌర్‌ జిల్లాలోని సాంచోర్‌లో నివాసం ఉంటున్నారు. గుదామాలానీ వద్ద నిర్వహించిన ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. గుదామాలానీ 8 కిలోవిూటర్ల దూరంలో ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ నలుగురిని గుదామాలానీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం సాంచోర్‌?కు తరలించారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. చక్రాలు, డోర్లు, స్టీరింగ్‌.. కారు నుంచి విడిపోయాయి.

 

8.ఫోర్త్‌వేవ్‌ తప్పదంటున్న నిపుణులు
అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
న్యూఢల్లీి,జూన్‌ 7(జనంసాక్షి):కరోనా వేవ్‌ వస్తోందంటే జనం భయపడే రోజులివి.. కానీ థర్డ్‌ వేవ్‌ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్‌ వేవ్‌ను అందరూ లైట్‌ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫోర్త్‌ వేవ్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం కరోనా మహమ్మారి ఇంటి నుంచి కాలు బయట పెట్టనీయలేదు. ప్రాణభయం వెంటాడడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవన ప్రయాణానికి లాక్‌ పడిరది. క్రమంగా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రెండున్నరేళ్ల తర్వాత జనజీవనం పట్టాలపై పరుగులు తీస్తోంది. మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా అన్నట్లుగా అంతటా రద్దీ వాతావరణం నెలకొంది. ఉత్సవాలు, పెళ్లిళ్లు, వేడుకలు, జాతరలు జనంతో కలకలలాడుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ ఫోర్త్‌ వేవ్‌ భయం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు అంటే నాలుగు నెలలపాటు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫోర్త్‌ వేవ్‌పై కీలక విషయం వెల్లడిరచారు. అయితే దీని తీవ్రతపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కొత్త వేరియంట్లు, మ్యూటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. బూస్టర్‌ డోసు వల్ల కలిగే ఇమ్యూనిటీ నిలబడగలితే పోర్‌ వేవ్‌ ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇమ్యూటీని మించి మ్యూటేషన్‌ ఇబ్బంది పెడితే మాత్రం ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం గట్టిగా ఉంటుంది.దేశవ్యాప్తంగా కరోనా ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో రెండు, మూడు జిల్లాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కేంద్రం అప్రమత్తం చేసిన రాష్టాల్ల్రో తెలంగాణ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక రాష్టాల్రు ఉన్నాయి. గత రెండు వారాలుగా యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 6 వందల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, మాస్క్‌, సామాజిక దూరం పాటించకపోవడం.. కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

9.ఇది సిగ్గుపడాల్సిన మతోన్మాదం: రాహుల్‌ ట్వీట్‌
న్యూఢల్లీి,జూన్‌ 7(జనంసాక్షి):మహ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ’ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు... కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పరువును కూడా మంటగలుపుతోందని బీజేపీని ఉద్దేశిస్తూ రాహుల్‌ గాంధీ విమర్శించారు. వివాదంపై.. పలు ప్రతిపక్షాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, బీఎస్పీ నేత మాయావతి సహా పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

10.నస్టాలతో ముగిసిన భారత్‌ మార్కెట్లు
567 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
ముంబై,జూన్‌ 7(జనంసాక్షి):భారత స్టాక్‌మార్కెట్లు మంగళవారం సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 567 పాయింట్లు కోల్పోయి 55,107కు చేరగా ఎన్‌ఎఈ నిప్టీ 153 పాయింట్లు తగ్గి 16,416 వద్ద స్థిరపడిరది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్‌ఎస్టేట్‌ సెక్టార్ల షేర్లు 1 శాతం తగ్గాయి. మరోవైపు ఆయిల్‌అండ్‌ గ్యాస్‌, విద్యుత్‌ రంగాలకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేసేందకు మదుపర్లు ఆసక్తి చూపించారు. మార్కెట్లు మొదలైన సమయానికి 55,373 వద్ద ఉన్న సెన్సెక్స్‌ నష్టాల్లో ట్రేడయింది.
గరిష్ఠంగా కేవలం 14 పాయింట్లు పెరిగి 55,387కు చేరిన సెన్సెక్స్‌.. ఒకానొక దశలో కనిష్ఠంగా 54,882కు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛెంజీలో కూడా ఇదే పరిస్థితి. 16,469 వద్ద ప్రారంభమైన సూచీలు.. 16,487 గరిష్ఠాన్ని నమోదు చేయగా.. ఓ దశలో 16,347 కనిష్టానికి చేరుకున్నాయి.ఎన్‌టీపీసీ, మారుతి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాలను నమోదు చేశాయి.టైటాన్‌, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా, ఎల్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.బొంబాయి స్టాక్‌? ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ ఓ దశలో 800 పాయింట్లకుపైగా పడిపోయింది. ప్రస్తుతం 700 పాయింట్ల నష్టంతో 55 వేల మార్కు దిగువకు చేరింది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 200 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 370 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్‌ మాత్రమే స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. ఫార్మా, ఐటీ, రియాల్టీ రంగం షేర్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఐరోపా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు దాదాపు అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. దేశీయంగానూ ఆర్‌బీఐ రెపోరేటును పెంచే అవకాశం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 120 డాలర్ల దిగువకు చేరింది.

11.నా రక్తాన్ని చిందిస్తా గానీ.. బెంగాల్‌ను ముక్కలు కానివ్వను
` ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
అలీపూర్‌దూర్‌,జూన్‌ 7(జనంసాక్షి):బెంగాల్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు భాజపా నేతలు డిమాండ్లు చేస్తున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీటుగా స్పందించారు.రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వేర్పాటు రాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఉత్తర బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు సామరస్యతతో జీవిస్తున్నారని దీదీ పేర్కొన్నారు. మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.’’సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భాజపా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. కొన్నిసార్లు గూర్ఖాలాండ్‌, ఇంకొన్నిసార్లు నార్త్‌ బెంగాల్‌ అంటూ రెచ్చగొడుతోంది. నా రక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే గానీ.. బెంగాల్‌ను మాత్రం విభజన కానివ్వను’’ అని అన్నారు. ప్రత్యేక కాంతాపూర్‌ను దీదీ వ్యతిరేకిస్తే ఆమెను రక్తం కళ్లచూస్తామంటూ కాంతాపూర్‌ లిబరేషన్‌ సంస్థ నేత జీవన్‌ సింగ్లా బెదిరింపుల వీడియోపై ఆమె స్పందించారు. అలాంటి బెదిరింపులు తనను ఏవిూ చేయలేవన్నారు.’’కొందరు వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారు.. అలాంటి వాటిని లెక్కచేయను. అలాంటి బెదిరింపులకు భయపడేదిలేదు’’ అని దీదీ స్పష్టంచేశారు.

 

13.దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు చేయాలి..
` జాతీయ రైతు నాయకుల సమావేశం తీర్మానం
న్యూఢల్లీి,జూన్‌ 7(జనంసాక్షి):దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అములచేయాలని జాతీయ రైతు నాయకుల సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు వివరించారు. ఢల్లీిలో రాకాబ్‌గంజ్‌ గురుద్వారా సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘం జాతీయస్థాయి రైతు సంఘాల సమావేశం నిర్వహించారు. మూడు నల్ల చట్టాల ఉపసంహరణ, ఎంఎస్‌పీ గ్యారెంటీ చట్టం హావిూల అమలు జరుగకపోవడంతో దీనిపై ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు శివకుమార్‌ కక్కాజీ అధ్యక్షతన సమావేశమయ్యారు. డబ్ల్యూటీవో నుంచి భారత్‌ వైదొలగాలని, రైతులను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సమావేశం తీర్మానం చేసింది
తెలంగాణ రైతు పథకాల ప్రస్తావన..
ఈ సమావేశంలో దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు పాల్గొని, ఉద్యమ కార్యాచరణకు తమ వంతు సహకారాన్ని ప్రకటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న రైతు బంధు , రైతు బీమా, 24/7 ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కనీస మద్దతు ధరతో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విధానాన్ని సమావేశంలో పాల్గొన్న వారికి, వివరించారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు తెచ్చేలా ఒత్తిడి తేవాలని సమావేశం తీర్మానించింది. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ఆమోదించారు.

14.ఆరు నెలల్లో 5 బిలియన్‌ డాలర్లు అవసరం
` శ్రీలంక ప్రధాని విక్రమసింఘే
కొలంబో,జూన్‌ 7(జనంసాక్షి):ఇంధన దిగుమతుల కోసం దాదాపు 3.3 బిలియన్‌ డాలర్లతో సహా పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి వచ్చే ఆరు నెలల్లో కనీసం అయిదు బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం మాత్రమే సరిపోదని..మొత్తం ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖనూ నిర్వహిస్తున్న ఆయన.. ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ‘మధ్యంతర బడ్జెట్‌’పై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. ఎరువుల కొనుగోలు కోసం భారత్‌కు చెందిన ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నుంచి 55 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను శ్రీలంక కేబినెట్‌ ఆమోదించినట్లు సంబంధిత ప్రతినిధి మంగళవారం తెలిపారు.2.2 కోట్ల జనాభా కలిగిన ఈ ద్వీప దేశం ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వల పడిపోయాయి. ఆహారం, ఇంధనం, మందులు తదితరాల కొరతతో ప్రజలు సతమతమవుతున్నారు. గొటబాయ రాజపక్స, ఆయన కుటుంబ సభ్యుల ప్రభుత్వ వ్యతిరేక విధానాల కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిరదంటూ పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గొటబాయ సోదరుడు మహింద రాజపక్స ఇటీవల తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు రణిల్‌ విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షోభ శ్రీలంకను గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

15.విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌
లండన్‌,జూన్‌ 7(జనంసాక్షి):బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విశ్వాస పరీక్షలో నెగ్గారు. బోరిస్‌పై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ గేట్‌ వ్యవహారంపై జాన్సన్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారు. బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు.అవిశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం తనకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఇది చాలా సానుకూల, నిర్ణయాత్మకమైన ఫలితం అని తాను భావిస్తున్నట్లు జాన్సన్‌ తెలిపారు. ప్రధానంగా ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు.2019లో బోరిస్‌ జాన్సన్‌ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో డౌనింగ్‌ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరిగిన విషయం విదితమే. అయితే కోవిడ్‌ నియమావళిని ఉల్లంఘించి ఆ పార్టీలకు ప్రధాని బోరిస్‌ హాజరైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి.