మధ్యప్రదేశ్‌ లో దారుణం


గిరిజనమహిళను సజీవదహనం చేసిన దుండగులు
గుణ,జూలై 4(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 38 సంవత్సరాల ఒక గిరిజన మహిళను కొందరు వ్యక్తులు సజీవ దహనం చేసేందుకు నిప్పంటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా గిరిజన మహిళ కుటుంబం పొందిన భూమిని ఆక్రమించుకున్న ముగ్గురు నిందితులు, ఆమెను అదే వ్యవసాయ భూమిలో తగలబెట్టారు. ఆ తర్వాత దానిని వీడియో తీసి, మహిళ హాహాకారాలు చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గుణ జిల్లాకు చెందిన రాంప్యారి సహారియా అనే గిరిజన మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకం కింద రెండు ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే ఈ భూమిని చాలా సంవత్సరాల క్రితం ఓబీసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. ఇక దీనిపై సహారియా చేసిన పోరాటంతో రెవెన్యూ శాఖ తిరిగి భూమిని సహారియా కుటుంబానికి అప్పగించింది. ఈ క్రమంలోనే వారు సహారియాను అత్యంత అమానవీయంగా సజీవ దహనం చేశారు. దీంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలపాలైన నొప్పితో కొట్టుమిట్టాడుతున్న గిరిజన మహిళ సహారియాను భర్త అర్జున్‌ సహారియా ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తమ పొలానికి వెళ్తుండగా ప్రతాప్‌, హనుమత్‌, శ్యామ్‌ కిరార్‌ అనే ముగ్గురు వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌లో అక్కడనుండి వెళ్ళిపోవడం తాను చూశానని ఆమె భర్త పోలీసులకు తెలిపాడు. ఇక తమ పొలం వైపు నుంచి పొగలు రావడంతో అర్జున్‌ సహారియా, అక్కడికి చేరుకుని చూడగా మంటల్లో తీవ్రంగా గాయపడిన భార్య కనిపించిందని పేర్కొన్నారు.
నిందితులపై ఫిర్యాదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సహారియా భర్త డిమాండ్‌ చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తుల కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని అర్జున్‌ సహారియా స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అర్జున్‌ సహారియా ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌)లో పేర్కొన్న ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారి పంకజ్‌ శ్రీవాస్తవ తెలిపారు.